46% తగ్గిన అపోలో హాస్పిటల్స్‌ లాభం

గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.90 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.168 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం తక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.2,868 కోట్ల నుంచి 24 శాతం పెరిగి రూ.3,546.40 కోట్లకు చేరింది

Published : 26 May 2022 03:14 IST

 ఒక్కో షేరుకు రూ.11.75 డివిడెండ్‌

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.90 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.168 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం తక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.2,868 కోట్ల నుంచి 24 శాతం పెరిగి రూ.3,546.40 కోట్లకు చేరింది. మూలధన లాభాల పన్ను కోసం రూ.88.2 కోట్లను కేటాయించడంతో లాభం తగ్గిందని అపోలో హాస్పిటల్స్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. అపోలో ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరించి, గ్రూప్‌ డిజిటల్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ప్లాట్‌ఫామ్‌ అపోలో 24/7తో పాటు అపోలో హెల్త్‌ కంపెనీ లిమిటెడ్‌కు 100 శాతం అనుబంధ సంస్థగా మార్చారు. అపోలో హెల్త్‌ కంపెనీ ప్రస్తుతం గ్రూప్‌ ఓమ్నిఛానెల్‌ డిజిటల్‌ హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌గా పని చేయనుంది. ప్రాథమిక చికిత్స, డయాగ్నోస్టిక్స్‌, ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్‌, కండిషన్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను అందించడం ద్వారా వచ్చే మూడేళ్లలో 300 కోట్ల డాలర్లకు పైగా (సుమారు రూ.23,000 కోట్లు) స్థూల వ్యాపార విలువను (జీఎంవీ) సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూలధన లాభాల పన్ను కోసం ఒకసారి కేటాయింపులు చేయకపోయినట్లయితే కంపెనీ నికర లాభం 6 శాతం పెరిగి రూ.178 కోట్లకు చేరేదని సంస్థ పేర్కొంది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం రూ.1,056 కోట్లకు చేరింది. 2020-21లో ఇది రూ.150 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.10,560 కోట్ల నుంచి రూ.14,663 కోట్లకు పెరిగింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.11.75 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

 విభాగాల వారీగా ఆదాయాలు..

ఆరోగ్య సంరక్షణ సేవల ఆదాయం 21 శాతం పెరిగి రూ.1,863 కోట్లకు చేరింది. మెచ్యూర్‌ హాస్పిటల్స్‌, కొత్త ఆసుపత్రుల ఆదాయం వరుసగా 21 శాతం, 19 శాతం చొప్పున పెరిగాయి. ఫార్మసీ, రిటైల్‌ హెల్త్‌ వ్యాపారం రూ.1,118.70 కోట్ల నుంచి 23 శాతం పెరిగి రూ.1,374.50 కోట్లకు చేరింది.

* ‘సవాళ్లతో కూడిన ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికాన్ని పూర్తి చేశాం. కొవిడ్‌ తర్వాత కొత్త సాధారణ స్థితికి ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ చేరుకుంది. 2022 జనవరిలో ఒమిక్రాన్‌ కేసులు బాగా పెరిగినా, రెండో దశతో పోలిస్తే మరణాలు తక్కువగా నమోదయ్యాయి. ఈ సమయంలో సర్జరీలు తక్కువగా జరిగాయ’ని అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌.సి.రెడ్డి వెల్లడించారు.

* 2022 జూన్‌ 25 నుంచి మరో రెండేళ్ల కాలానికి ప్రతాప్‌.సి.రెడ్డిని ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా పునర్నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

* చెన్నై ఓఎంఆర్‌ రోడ్డులో పాక్షికంగా నిర్మాణం చేసిన భవనాలతో పాటు 7.3 ఎకరాల భూమిని అపోలో కొనుగోలు చేసింది. ఇక్కడ 1.5 మిలియన్‌ చదరపు అడుగుల్లో ఉన్నత ప్రమాణాలతో అడ్వాన్స్‌డ్‌ ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కాంప్లెక్‌ నిర్మించనుంది. ఇందులో 150కి పైగా అవుట్‌ పేషెంట్‌ కన్సల్ట్‌ గదులు, 650 పడకలతో అత్యవసర, ట్రామా సెంటర్‌, అడ్వాన్స్‌డ్‌ అంబులేటరీ బ్లాక్‌, ఇంటర్నేషనల్‌ పేషెంట్స్‌ బ్లాక్‌ ఉండనున్నాయి. 1500కు పైగా కార్లను పార్కింగ్‌ చేసుకునేలా సదుపాయం కల్పించనున్నారు.

*2022 మార్చి 31 నాటికి అపోలో హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌లో మొత్తం 7,875 నిర్వహణ పడకలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని