మాతో కలిసి పనిచేయండి

ఒకస్థాయికి చేరిన అంకుర సంస్థ (స్టార్టప్‌)లు, తమ నిపుణుల్లో అధిక వేతనాలకు అనుగుణమైన పని లేని వారిని తొలగిస్తుంటే, వారిని చేర్చుకుని మరింత ఎదిగేందుకు కొత్తగా ఏర్పాటైన అంకుర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ, రిటైల్‌

Published : 26 Jun 2022 03:38 IST

పెద్ద సంస్థల నుంచి వస్తున్న నిపుణులను ఆహ్వానిస్తున్న అంకురాలు

ఒకస్థాయికి చేరిన అంకుర సంస్థ (స్టార్టప్‌)లు, తమ నిపుణుల్లో అధిక వేతనాలకు అనుగుణమైన పని లేని వారిని తొలగిస్తుంటే, వారిని చేర్చుకుని మరింత ఎదిగేందుకు కొత్తగా ఏర్పాటైన అంకుర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ, రిటైల్‌, ఫర్నిచర్‌, ఫ్యాషన్‌, ఔషధ.. రంగాల్లో ఇదే ధోరణి నెలకొంది. ప్రముఖ విద్యా సంస్థల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారెందరో.. అంకుర సంస్థలను ఏర్పాటు చేశారు. వేలసంఖ్యలో ఏర్పాటైన అలాంటి సంస్థల్లో, ఆదాయపరంగా బాగున్నవి వందల్లో ఉంటాయి. ఉద్యోగాల కల్పనలోనూ దిగ్గజ కంపెనీలకు పోటీనిచ్చే స్థాయికి ఇవి చేరుకున్నాయి. ఇటీవలి పరిస్థితుల్లో కొత్తగా పెట్టుబడులు రావడం తగ్గుతున్నందున, భారీ పరిమాణానికి చేరిన టెక్‌ అంకురాలు కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

60,000 అంకురాలు- 6 లక్షల ఉద్యోగాలు

2016 నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 56 విభిన్న రంగాల్లో 60 వేలకు పైగా కొత్త అంకురాలు పురుడు పోసుకున్నాయి. సుమారు 6 లక్షల మందికి పైగా ఉద్యోగులు వీటిల్లో పనిచేస్తున్నారు. 2016-17లో కొత్తగా 733 అంకురాలు ఏర్పడగా, 2021-22లో దాదాపు 14,000 స్టార్టప్‌లు వచ్చాయి. దేశంలో యూనికార్న్‌ క్లబ్‌లోకి (100 కోట్ల డాలర్‌ విలువ) చేరిన అంకురాల సంఖ్య 100కు మించింది. అమెరికా, చైనా తరువాత ఈ విషయంలో భారత్‌ మూడో స్థానంలోకి చేరింది.

కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో, పలు రంగాలు డిజిటలీకరణ బాట పట్టడంతో, సాంకేతిక నిపుణులను టెక్‌ సంస్థలు అధిక వేతనాలతో ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. ఎడ్యుటెక్‌, హెల్త్‌టెక్‌, ఫిన్‌టెక్‌, రిటైల్‌ విభాగాల్లోని సంస్థలు తమ నిపుణులను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాయి. అంతా సాఫీగా సాగిపోతోంది అన్న దశలో.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితులతో అంకురాలకు పెట్టుబడులు రావడం తగ్గుతోంది. 2021 తొలి అయిదు నెలల్లో దేశీయ అంకురాలు దాదాపు రూ.67,979 కోట్ల పెట్టుబడులు సాధించాయి. 2020తో పోలిస్తే ఇది 80 శాతం అధికం. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెంచర్‌ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ సంస్థల నుంచి స్టార్టప్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.7,760 కోట్లు. ఇది గతంతో పోలిస్తే సగమే. దీంతో అంకురాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రారంభించాయి. అధిక వేతనాలకు ఉద్యోగాల్లోకి తీసుకున్న వారిని తొలగించేందుకు సిద్ధం అవుతున్నాయి.

గిరాకీ లేకపోవడం వల్లే

కరోనా సమయంలో విద్యా సంస్థలు పనిచేయలేదు. ఆసుపత్రులు కూడా వైద్య సలహాలు ఆన్‌లైన్‌లో ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డరు ఇచ్చి ఇంటికే ఆహార పదా ర్థాలు తెప్పించుకుని తినడం పెరిగింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పాఠశాలలు తెరుచుకున్నాయి. నేరుగా ఆసుపత్రులకు వెళ్తున్నారు. హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌ జనంతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎడ్యుటెక్‌, హెల్త్‌టెక్‌, ఫిన్‌టెక్‌, రిటైల్‌ రంగాల సంస్థల వినియోగదారుల్లో ఒక్కసారిగా క్షీణత నమోదవుతోంది. ఫలితంగా సంస్థల ఆదాయాలు తగ్గిపోయాయి. ఉన్న గిరాకీకి సరిపడా సంఖ్యలోనే ఉద్యోగులను అట్టేపెట్టుకునే క్రమంలో, అధిక వేతనం గలవారిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘సంస్థ పనితీరు బాగున్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణతో లేని సంస్థలు.. పరిస్థితులు ఏమాత్రం ప్రతికూలంగా మారినా.. ఇబ్బంది ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు చాలా సంస్థలు ఈ సమస్యతోనే బాధపడుతున్నాయి. ఇప్పటికే ఫండింగ్‌ వచ్చి, రాబడులను ఆర్జిస్తున్న సంస్థలు నిలకడగా రాణించేందుకే అవకాశం ఉంది’ అని గోపీజీఓ వ్యవస్థాపకులు, సీఈఓ హరి అంటున్నారు  ఇలా వృద్ధి చెందిన అంకుర సంస్థలు తమ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులూ సృష్టించడం లేదని పేర్కొన్నారు.

భాగస్వామ్యం ఇస్తామంటూ..

పెద్ద అంకుర సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటుంటే, వారిని తమ సంస్థల్లోకి ఆహ్వానించేందుకు ఇప్పటికే సీడ్‌, సిరీస్‌ ఏ ఫండింగ్‌ పొందిన చిన్న స్థాయి అంకురాలు సిద్ధమవుతున్నాయి. అనుభవం ఉండి, ఉన్నత స్థానాల్లో పనిచేసిన వారిని తమ బృందంలో చేరాల్సిందిగా కోరుతున్నాయి. భారీ వేతనాలు ఇవ్వలేవు కాబట్టి, భాగస్వాములుగా, ఈక్విటీలు, ఇ-సాప్స్‌ (ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌) ఇస్తామంటూ వారిని చేర్చుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌ నిపుణుల కోసం చిన్న సంస్థలు చూస్తున్నాయి. ‘మా సంస్థ వృద్ధికి అవకాశాలున్నాయి. ఇప్పటికిప్పుడు భారీ వేతనాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ, కలిసి పనిచేద్దాం. లాభాలు ఆర్జిద్దాం’ అనే సూత్రంతో ఇవి నిపుణులను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని హరి వివరించారు. ‘రెండు మూడేళ్ల క్రితమే ఉద్యోగాల్లో చేరిన నిపుణులను 10-20% తక్కువ వేతనానికి తీసుకుంటుండగా, కొన్ని సందర్భాల్లో 30 శాతానికి పైగా తక్కువ జీతానికి చేరేందుకూ కొందరు సిద్ధం అవుతున్నార’ని మరో అంకుర సంస్థ సీఈఓ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని