‘ స్మాల్‌క్యాప్‌’ రిస్కును తట్టుకోగలిగితే...

అగ్రశ్రేణి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలలో ఒకటైన యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఒక స్మాల్‌ క్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ‘యాక్సిస్‌ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 7. ‘నిప్టీ స్మాల్‌క్యాప్‌ 50 టీఆర్‌ఐ ఇండెక్స్‌’ ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా

Updated : 25 Feb 2022 00:44 IST

యాక్సిస్‌ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌

గ్రశ్రేణి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలలో ఒకటైన యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఒక స్మాల్‌ క్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ‘యాక్సిస్‌ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 7. ‘నిప్టీ స్మాల్‌క్యాప్‌ 50 టీఆర్‌ఐ ఇండెక్స్‌’ ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా తీసుకుంటారు. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ‘యాక్సిస్‌ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌’ కు జినేష్‌ గొపానీ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ‘నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250 ఇండెక్స్‌’ నుంచి మార్కెట్‌ కేపిటలైజేషన్‌ ఆధారంగా 100 కంపెనీలను ఎంపిక చేసి, అందులో 50 కంపెనీలకు నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 50 ఇండెక్స్‌లో స్థానం కల్పిస్తారు. యాక్సిస్‌ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌, ప్రధానంగా ఈ షేర్లలోనే పెట్టుబడి పెడుతుంది. స్మాల్‌క్యాప్‌ తరగతికి చెందిన షేర్లపై పెట్టుబడిలో రిస్కు అధికంగా ఉన్నప్పటికీ, ప్రతిఫలమూ అంతేస్థాయిలో అధికంగా కనిపిస్తుంది. దీనికి సిద్ధపడే వారికి ఇటువంటి పథకాలు అనుకూలంగా ఉంటాయి.


సంప్రదాయ మదుపరులకు...

ఐటీఐ కన్జర్వేటివ్‌ హైబ్రీడ్‌ ఫండ్‌

ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఒక కన్జర్వేటివ్‌ హైబ్రీడ్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఐటీఐ కన్జర్వేటివ్‌ హైబ్రీడ్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 7 ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ ఫండ్‌ ప్రధానంగా నాణ్యమైన రుణ పత్రాలు, నిఫ్టీ 50 ఇండెక్స్‌ షేర్లలో పెట్టుబడి పెడుతుంది. దాదాపు 75 శాతం పెట్టుబడులు రుణ పత్రాల్లో, మిగిలిన 25 శాతం పెట్టుబడులు ఈక్విటీలో ఉంటాయి. దీనికి విక్రాంత్‌ మెహతా, ప్రదీప్‌ గోఖలే ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ప్రధానంగా సంప్రదాయ పొదుపు పథకాలైన బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారిని దృష్టిలో పెట్టుకొని, రిస్కు కొంత తక్కువగా ఉండే ఈ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించిందని అర్థమవుతోంది.

ఐటీఐ కన్జర్వేటివ్‌ హైబ్రీడ్‌ ఫండ్‌తో కలిపి, ఐటీఐ (అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ) మ్యూచువల్‌ ఫండ్‌, గత రెండేళ్లలో 16 మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను ఆవిష్కరించింది. గత నెలాఖరు నాటికి ఈ సంస్థ నిర్వహణలో రూ.2,661 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీ పెట్టుబడులు రూ.1,869 కోట్లు కాగా, మిగిలిన సొమ్ము హైబ్రీడ్‌, రుణ పథకాల్లో ఉంది.


తక్కువ నిర్వహణ వ్యయాలతో..
నవీ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌

‘మిడ్‌క్యాప్‌’ విభాగంలో ఒక కొత్త పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌)ను నవీ మ్యూచువల్‌ ఫండ్‌ చేపట్టింది. నవీ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఈ ఏడాదిలో వచ్చిన నాలుగో పథకం ఇది.

ఈ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 2. కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి. ప్రధానంగా మిడ్‌క్యాప్‌ తరగతికి చెందిన షేర్లలో మదుపు చేయడం ద్వారా అధిక లాభాలు ఆర్జించాలనేది ఈ పథకం ఉద్దేశం. అంతేగాక ఈ పథకం నిర్వహణ వ్యయాలు (టీఈఆర్‌- టోటల్‌ ఎక్సెపెన్సెస్‌ రేషియో), డైరెక్ట్‌ ప్లాన్‌కు ఎంతో తక్కువగా 0.12 శాతం మాత్రమే ఉండటం మరొక ప్రత్యేకత. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఈ సూచీ గత ఏడాది కాలంలో 46 శాతం, గత అయిదేళ్ల కాలంలో 18.7 శాతం ప్రతిఫలాన్ని నమోదు చేసింది.

కొంత నష్టభయం భరించగలిగి దీర్ఘకాలం పాటు ఎదురుచూడగలిగిన వారికి మిడ్‌క్యాప్‌ పథకాలు ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో లార్జ్‌క్యాప్‌ పెట్టుబడులకు మాత్రమే ఇప్పటి వరకూ పరిమితమై, తమ పెట్టుబడుల్లో కొంత వైవిధ్యం ఉండాలనుకునే మదుపరులు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని