వేత‌నంలో ఆదాయ‌ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేవి ఏంటి?

ఉద్యోగుల‌కు వ‌చ్చే వేత‌నాల‌పై ప‌న్ను విధానం ఎలా ఉంటుందో తెలిపే క‌థ‌నం

Published : 16 Dec 2020 16:20 IST

ప్ర‌స్తుతం దేశంలో ఆదాయ‌ప‌న్ను చెల్లిస్తున్న వారిలో అధికులు వేత‌న జీవులే. జీతంలో భాగంగా అందే ర‌క‌ర‌కాల అల‌వెన్సుల్లో ఏవి ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తాయి, ఏవి రావు మ‌రియు అమ‌లులో ఉన్న మిన‌హాయింపులు ఏంటి వంటి విష‌యాల్లో అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

వేత‌నం లేదా జీతం:

ఒక వ్య‌క్తి మ‌రొక వ్య‌క్తికి డ‌బ్బు చెల్లిస్తే ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య య‌జ‌మాని, ఉద్యోగి సంబంధం ఉంటేనే ఆ డ‌బ్బును ఆదాయ పన్ను పరిధిలో జీతం లేదా వేత‌నంగా పరిగణిస్తారు.
య‌జ‌మాని ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఉద్యోగికి చెల్లించిన మొత్తం, ఏమైనా గ‌త సంవ‌త్స‌ర‌పు బ‌కాయిలు, రాబోవు సంవ‌త్స‌ర‌పు ముందస్తు చెల్లింపులు ఉంటే వాటిని ప్ర‌స్తుత ఆర్ధిక సంవత్సర ఆదాయంగా పరిగణించి, పన్ను చెల్లించాలి.

ఒక ఉద్యోగి త‌న య‌జ‌మాని నుంచి జీతంలో భాగంగా ర‌క‌ర‌కాల‌ అల‌వెన్సులు, ప‌ర్కిజెట్స్ మ‌రియు ప‌ద‌వీవిర‌మ‌ణ సౌల‌భ్యాలు అందుకుంటారు. ఈ అలవెన్సుల్లో పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ఉన్న‌వి, పూర్తిగా ప‌న్ను పరిధిలోనికి వచ్చేవి, ష‌ర‌తుల‌తో కూడిన మిన‌హాయింపులు ల‌భించేవి ఉంటాయి.

వాస్త‌వ ఖ‌ర్చుపై ప‌న్ను మిన‌హాయింపు ఉన్న అల‌వెన్సులు :

ప్ర‌భుత్వ ఉద్యోగులు అందుకునే అన్నిర‌కాల‌ అల‌వెన్సులు పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధిలోకి వ‌స్తాయి. అలాగే ప్ర‌భుత్వేత‌ర ఉద్యోగులు అందుకునే

  • డైలీ అల‌వెన్సు
  • అసిస్టెంట్ అల‌వెన్సు
  • యూనిఫాం అల‌వెన్సు
  • రీసెర్చి అల‌వెన్సు
  • ట్రాన్స్‌ఫ‌ర్ / ఆఫీసు టూర్ స‌మ‌యంలో ఇచ్చే ట్రావెలింగ్ అల‌వెన్స్
    మొద‌లైన‌ వాటిపై వాస్త‌వంగా చేసిన ఖ‌ర్చులను మిన‌హాయింపుగా పొంద‌వ‌చ్చు.

పరిమితుల‌తో కూడిన మిన‌హాయింపులు ఉన్న అల‌వెన్సులుః

ఉద్యోగులు త‌మ య‌జ‌మాని నుంచి అందుకునే కొన్ని అల‌వెన్సులకు ప‌రిమితుల‌తో కూడిన మిన‌హాయింపులు ల‌భిస్తాయి. వాటిల్లో కొన్నింటికి వాస్త‌వంగా చేసిన ఖ‌ర్చు లేదా విధించిన గ‌రిష్ట ప‌రిమితి ఈ రెండింటిలో త‌క్కువ‌గా ఉన్న మొత్తానికి మిన‌హాయింపు ల‌భిస్తుంది. మ‌రికొన్నింటికి ప్ర‌త్యేకంగా నియ‌మాలు ఉంటాయి. ఈ నియ‌మాల‌కు అనుగుణంగానే ప‌న్ను చెల్లింపుదారులు మిన‌హాయింపులు పొందుతారు.

ఇంటి అద్దె అల‌వెన్సు (హెచ్‌.ఆర్‌.ఏ):

ఇది కంపెనీ త‌మ ఉద్యోగులకు వారు నివ‌సించే ఇంటి అద్దె నిమిత్తం ఉప‌యోగించుకునేందుకు ఇచ్చే అల‌వెన్స్. జీతంతో పాటుగా ఉద్యోగి అందుకునే ఈ అల‌వెన్సు ఆదాయ‌ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. అయితే దీనికి కొన్ని మిన‌హాయింపులు ఉన్నాయి. ఈ క్రింది వాటిలో త‌క్కువ మొత్తం ఏది అయితే అది మిన‌హాయింపుగా ల‌భిస్తుంది.

  1. ఉద్యోగి అందుకునే వాస్త‌వ‌ హెచ్‌.ఆర్‌.ఏ
  2. వాస్త‌వంగా చెల్లించిన అద్దె నుంచి జీతంలో 10శాతం తీసివేయ‌గా మిగిలిన మొత్తం.
  3. జీతంలో 40శాతం (మెట్రో నగరాలలో ఉండే వారయితే 50%)

హెచ్‌.ఆర్‌.ఏ. లెక్కింపులో జీతం అన‌గా బేసిక్, డి.ఎ, ట‌ర్నోవ‌ర్ ఆధారిత క‌మీష‌న్‌ల మొత్తం.

  • కొంద‌రు ఉద్యోగులు త‌మ సొంత ఇంట్లో నివాసం ఉంటూ హెచ్‌.ఆర్‌.ఏ.ను అందుకుంటారు. ఇలాంటి వారు త‌మ కంపెనీ నుంచి అందుకున్న మొత్తం హెచ్‌.ఆర్‌.ఏ.కు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. వీరికి హెచ్‌.ఆర్‌.ఏ.లో ఎలాంటి మిన‌హాయింపులు వ‌ర్తించ‌వు.

ఉద్యోగి చెల్లించే ఇంటి అద్దె సంవ‌త్స‌రానికి రూ.లక్ష దాటితే ఆ ఇంటి య‌జ‌మానికి చెందిన పాన్‌కార్డు కాపీని జ‌త‌చేయాలి.

ఉద్యోగి పిల్ల‌ల చ‌దువు నిమిత్తం అందించే అల‌వెన్స్:

ఉద్యోగి పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజుల కోసం కంపెనీ అందించే అల‌వెన్సు ఇది. ఒక్కొక్క‌రికి సంవ‌త్స‌రానికి రూ.1200 చొప్పున గ‌రిష్ఠంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు రూ.2400 వ‌ర‌కు ఈ అల‌వెన్సు కింద‌ ప‌న్ను మిన‌హాయింపుగా పొంద‌వ‌చ్చు.

పిల్ల‌ల హాస్ట‌ల్ ఫీజు నిమిత్తం అందించే అల‌వెన్స్‌:

ఉద్యోగి త‌న పిల్ల‌ల హాస్ట‌ల్ ఖ‌ర్చుల నిమిత్తం కంపెనీ నుంచి అందుకునే అల‌వెన్సు ఇది. ఉద్యోగి తాను అందుకున్న ఈ అల‌వెన్సు మొత్తంలో ఒక్కొక్క‌రికి సంవ‌త్స‌రానికి రూ.3600 చొప్పున గ‌రిష్టంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు రూ.7200 వ‌ర‌కు మిన‌హాయింపుగా పొంద‌గ‌ల‌డు.

పూర్తిగా ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే అల‌వెన్సులు:

ఇవి కాక ఉద్యోగులు వృత్తిలో భాగంగా అందుకునే

  • ఫోన్ అలవెన్సు
  • హాలిడే అల‌వెన్స్‌
  • ఫుడ్, రిఫ్రెష్‌మెంట్ అల‌వెన్సు
  • స‌ర్వెంట్ అల‌వెన్స్
  • ప్రాజెక్టు అల‌వెన్సు
  • ఓవ‌ర్ టైం అల‌వెన్సు
    మొద‌లైన‌ వాటికి ఎలాంటి మిన‌హాయింపులు వ‌ర్తించ‌వు. పూర్తిగా ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తాయి.

పెర్క్విసిట్లు:

కంపెనీ లేదా య‌జ‌మాని త‌మ ఉద్యోగుల‌కు ఉచితంగా లేదా కొంత రాయితీతో అందించే ఇత‌ర స‌దుపాయాల‌ను ప‌ర్కిజెట్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తాం. ఈ స‌దుపాయాలు కూడా కొన్ని మిన‌హాయింపుల‌తో ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తాయి.

ఆదాయ‌ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే పెర్క్విసిట్లు:

అద్దె లేకుండా లేదా నామ‌మాత్ర‌పు అద్దెతో అందించే గృహోప‌క‌రణాలు లేని వ‌స‌తి :

  • ఉద్యోగికి కంపెనీ లేదా య‌జ‌మాని పూర్తి ఉచితంగా లేదా నామ‌మాత్ర‌పు అద్దెతో గృహోప‌క‌ర‌ణాలు లేని వ‌స‌తిని స‌మ‌కూరిస్తే ఆ వ‌స‌తి ఉన్న ప్ర‌దేశాన్ని బ‌ట్టి చెల్లించాల్సిన ప‌న్ను మారుతుంది. వ‌స‌తి స‌మ‌కూర్చిన ప్ర‌దేశంలో 10ల‌క్ష‌ల జ‌నాభా కన్నా త‌క్కువ ఉంటే జీతంలో 7.5 శాతం, 10 నుంచి 25 ల‌క్ష‌ల మ‌ధ్య జ‌నాభా ఉంటే జీతంలో 10శాతం, 25 ల‌క్ష‌ల జ‌నాభా మించి ఉంటే జీతంలో 15శాతంను ప‌న్ను చెల్లించాల్సిన ప‌ర్కిజెట్ విలువ‌గా లెక్కిస్తాం.

  • ఒక‌వేళ ఉద్యోగికి కేటాయించిన వ‌స‌తిని య‌జ‌మాని స్వంతం కాక వేరొక‌రి నుంచి అద్దెకు లేదా లీజుకు తీసుకొని ఉంటే , వాస్త‌వంగా చెల్లించాల్సిన ఆ లీజు మొత్తం లేదా జీతంలో 15 శాతం ఈ రెండింటిలో త‌క్కువ‌గా ఉన్న మొత్తాన్ని ప‌న్ను చెల్లించాల్సిన ప‌ర్కిజెట్ విలువ‌గా పేర్కొంటాం.

  • వ‌స‌తిని కేటాయించిన స్థ‌లం మారుమూల ప్రాంతమైతే దానిపై ఎలాంటి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

అద్దె లేకుండా లేదా నామ‌మాత్ర‌పు అద్దెతో అందించే గృహోప‌క‌ర‌ణాల‌తో కూడిన వ‌స‌తి:

య‌జ‌మాని త‌న ఉద్యోగికి అద్దె లేకుండా లేదా నామ‌మాత్ర‌పు అద్దెతో క‌ల్పించిన వ‌స‌తిలో గృహోప‌క‌ర‌ణాల‌ను కూడా స‌మ‌కూరిస్తే దాని విలువ‌ను కూడా గృహోప‌క‌ర‌ణాలు లేని వ‌స‌తి విలువను లెక్కించిన ప‌ద్ధ‌తిలోనే లెక్కిస్తాం. అయితే ఇలా వ‌చ్చిన విలువ‌కు అద‌నంగా గృహోప‌క‌ర‌ణాల వాస్త‌వ విలువ‌లో 10శాతం జ‌త చేసి వ‌చ్చిన మొత్తాన్ని ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే విలువ‌గా తీసుకుంటాం.

వడ్డీ లేని లేదా రాయితీతో అందించే రుణాలు:

ఉద్యోగులు త‌మ కంపెనీ నుంచి లేదా య‌జమాని నుంచి అందుకునే వ‌డ్డీ లేని లేదా రాయితీతో కూడిన రుణాలు కొన్ని మిన‌హాయింపుల‌కు లోబడి ప‌న్ను ప‌రిధిలోకి వస్తాయి. అందుకున్న రుణం మొత్తం రూ.20,000 వేల క‌న్నా త‌క్కువగా ఉండ‌టం లేదా ఏదైనా నిర్దేశించిన వ్యాధుల చికిత్స నిమిత్తం అందిస్తే ఆ రుణం ప‌న్ను ప‌రిధిలోకి రాదు. ఉద్యోగి ఏవైనా వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం తీసుకున్న రుణం రూ.20,000 దాటితే అలాంటి రుణాల‌పై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. దీని పై ప‌న్ను లెక్కించ‌డానికి ఎస్‌బిఐ వ‌డ్డీ రేట్ల‌ను ఆధారంగా తీసుకుంటాం. ముందుగా అంతే రుణాన్ని అదే అవ‌స‌రం కోసం గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధంలో ఎస్‌బీఐ నుంచి తీసుకొని ఉంటే ఎంత వ‌డ్డీ వ‌ర్తిస్తుందో లెక్కించాలి. ఇలా లెక్కించిన వ‌డ్డీ నుంచి ఉద్యోగి నామ‌మాత్రంగా ఏమైనా వ‌డ్డీ చెల్లించి ఉంటే దానిని తీసివేయాలి. త‌ర్వాత మిగిలిన మొత్తాన్ని ప‌న్ను చెల్లించాల్సిన ఆదాయంగా గుర్తిస్తారు.

ఉద్యోగికి అందించే ఆహార పానీయాలు:

  • ప‌నివేళ‌ల్లో అందించే టీ, కాఫీ, స్నాక్స్ మొద‌లైన వాటి విలువ‌పై ఉద్యోగికి ఎలాంటి ప‌న్ను వ‌ర్తించ‌దు. పూర్తిగా ఆదాయ‌ప‌న్ను నుంచి మిన‌హాయించ‌బ‌డ‌తాయి.
  • అయితే ప‌నిచేసే కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో కంపెనీ త‌మ ఉద్యోగుల‌కు అందించే భోజ‌నం విలువ లేదా ఫుడ్ వోచ‌ర్స్ కోసం చేసిన ఖ‌ర్చు రూ.50లేదా అంత‌క‌న్నా త‌క్కువ‌గా ఉండాలి . అప్పుడే పూర్తిగా మిన‌హాయింపు ల‌భిస్తుంది. లేనిచో రూ.50కు మించి ఉన్న‌ విలువ నుంచి ఉద్యోగి చెల్లించిన మొత్తం తీసివేయ‌గా మిగిలిన విలువను ప‌న్ను ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు.

గమనిక : ఆర్ధిక సంవత్సరం 2018-19 నుంచి మెడికల్ రేయింబర్సుమెంట్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సు కి బదులుగా రూ. 40,000 స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని