Published : 14 May 2022 15:30 IST

Global M Cap: ఈ ఏడాదిలో 22 ట్రిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి విసిరిన పంజాతో 2020లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. దేశీయంగా జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సగానికిపైగా నష్టపోయి మదుపర్లను నిండా నష్టాల్లో ముంచింది. కానీ, ఏడాది తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. వ్యాక్సిన్లతో బలాన్ని మూటగట్టుకున్న బుల్‌.. దాదాపు ఏడాది పాటు మదుపర్లకు లాభాల పంట పండించింది. కట్‌ చేస్తే.. 2022లో పరిస్థితులు మళ్లీ నిరాశజనకంగా మారుతున్నాయి.

100 ట్రిలియన్‌ డాలర్ల దిగువకు మార్కెట్‌ క్యాప్‌..

ఈ ఏడాది ఆరంభం నుంచి మార్కెట్లు తిరోగమన దిశలోనే పయనిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల క్యాపిటలైజేషన్‌ 100 ట్రిలియన్‌ డాలర్ల దిగువకు చేరింది. డిసెంబరు 2020 తర్వాత ఈ స్థాయికి దిగిరావడం ఇదే తొలిసారి. వివిధ కారణాల వల్ల 2022 ఆరంభం నుంచి ఇప్పటి వరకు 22 ట్రిలియన్‌ డాలర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. మే 12 నాటికి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ 99.13 ట్రిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఈ విలువ 61.6 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. మహమ్మారి పంజా నుంచి మార్కెట్లు పుంజుకోవడంతో ఓ దశలో ప్రపంచ కంపెనీల మార్కెట్‌ విలువ 122.5 ట్రిలియన్‌ డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

భారత కంపెనీల మార్కెట్‌ విలువ 12.4 శాతం తరిగి 3.03 ట్రిలియన్‌ డాలర్లు చేరింది. ప్రపంచవ్యాప్తంగా చైనా, జర్మనీ, ఫ్రాన్స్‌ మార్కెట్ల క్యాపిటలైజేషన్‌ భారీగా తరిగిపోయింది. సంపదపరంగా చూస్తే అమెరికన్‌ మదుపర్లు అత్యధికంగా కోల్పోయారు. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా మార్చిలో ఐదో స్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు ఏడో ర్యాంకుకి పడిపోయింది.

కళ్ల ముందే కారణాలు..

మహమ్మారి కట్టడికోసం విధించిన లాక్‌డౌన్‌ల కారణంగా కుటుంబాల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు ఉద్దీపన పథకాల ద్వారా లక్షల కోట్ల డాలర్లను మార్కెట్లలోకి చొప్పించాయి. ఫలితంగా ద్రవ్యలభ్యత అధికమై మదుపర్లు మెజారిటీ నిధులను రిస్క్‌తో కూడుకున్న స్టాక్‌మార్కెట్‌, క్రిప్టోకరెన్సీల్లోకి మళ్లించారు. మరోవైపు ‘డిమాండ్‌-పుల్‌’ ప్రభావం వల్ల వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం తెరపైకి వచ్చింది. దీంతో ప్రపంచదేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడం ద్వారా కొవిడ్‌ సమయంలో చొప్పించిన డబ్బును తిరిగి ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యాయి. రానున్న రోజుల్లో వడ్డీరేట్లు మరింత పెరగనున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు జనవరిలో వడ్డీరేట్ల పెంపుపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. నాటి నుంచి మార్కెట్ల పతనం క్రమంగా ప్రారంభమైంది.

తర్వాత ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం రూపంలో వచ్చిపడ్డ ఉపద్రవం మార్కెట్లను కోలుకోలేని దెబ్బకొట్టింది. ద్రవ్యలభ్యత కారణంగా క్రమంగా తెరపైకి వస్తున్న ద్రవ్యోల్బణానికి ఇది కూడా జతకావడంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. మరోవైపు కొవిడ్‌ నుంచి పరిస్థితులు క్రమంగా చక్కబడుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా చమురుకు గిరాకీ పెరిగి ధరలు ఎగబాకాయి. అదే సమయంలో యుద్ధం రావడంతో సరఫరా సమస్యల కారణంగా చమురు ధరలు మరింత పెరిగాయి. మరోవైపు చైనాలో కరోనా కట్టడి నిమిత్తం విధిస్తున్న లాక్‌డౌన్లు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇవన్నీ భారీ ద్రవ్యోల్బణానికి దారితీశాయి.

ద్రవ్యోల్బణం వల్ల ముడిసరకుల ధరలు పెరుగుతాయి. దీని వల్ల కంపెనీల ఉత్పత్తి వ్యయం అధికమవుతుంది. మరోవైపు ద్రవ్యోల్బణ కట్టడి నిమిత్తం వడ్డీరేట్లను పెంచడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఫలితంగా కంపెనీల రాబడులు పడిపోతుంది. ఇలా ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు రెండూ కలిసి స్థూలంగా ఆర్థిక వృద్ధి మందగమనానికి దారితీసే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కారణంగానే నమోదిత సంస్థల షేర్లు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి.

అయినా, భారత్‌ భవిష్యత్తు మేలే..

దీర్ఘకాలంలో భారత స్టాక్ మార్కెట్లకు మాత్రం పొంచి ఉన్న ముప్పేమీ లేదని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆసియాలో సుదీర్ఘకాలంలో మంచి లాభాలు కావాలనుకునేవారు భారత స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేయాలని జెఫరీస్‌లో ఈక్విటీ స్ట్రాటజీ విభాగం గ్లోబల్‌ హెడ్‌ క్రిస్‌వుడ్‌ తన వారాంతపు సందేశంలో సూచించారు. భారత ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలు కచ్చితంగా ఫలితాలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల వంటి నిర్ణయాలు ఫలిస్తాయని చెప్పారు. మరోవైపు జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడం శుభసూచకమన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని