‘ఈయూ ఉత్తర్వులను సీసీఐ కాపీ కొట్టింది’.. గూగుల్‌ తీవ్ర ఆరోపణలు

Google on CCI orders: సీసీఐపై గూగుల్‌ ఇండియా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈయూ గతంలో ఇచ్చిన ఉతర్వులను సీసీఐ కాపీ కొట్టిందని ఆరోపించింది.

Published : 03 Jan 2023 22:19 IST

దిల్లీ: అనైతిక వ్యాపార పద్ధతులను అవలంబిస్తోందంటూ భారీ జరిమానా విధించిన కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI)పై గూగుల్‌ ఇండియా (Google) తీవ్ర ఆరోపణలు చేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విషయంలో యూరోపియన్‌ యూనియన్‌ ఇచ్చిన ఉత్తర్వులను సీసీఐ కాపీ కొట్టిందంటూ తీవ్రంగా ఆరోపించింది. తనంతట తానుగా ఎలాంటి విచారణా చేపట్టలేదని ట్రైబ్యునల్‌కు తెలిపింది. కాబట్టి సీసీఐ ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించింది.

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ విభాగంలో గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ గూగుల్‌కు గతేడాది అక్టోబర్‌లో రూ.1337.76 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. గతంలో ఆండ్రాయిడ్‌ మొబైల్‌ తయారీదారులపై అనైతిక ఆంక్షలు విధిస్తోందంటూ యూరోపియన్‌ కమిషన్‌ సైతం గూగుల్‌కు 4.3 బిలియన్‌ డాలర్ల భారీ జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో సీసీఐ ఉత్తర్వులపై NCLATని ఆశ్రయించిన గూగుల్‌.. ఈయూ తీర్పును కాపీ కొట్టిందని ట్రైబ్యునల్‌కు తెలిపింది. యూరోపియన్‌ కమిషన్‌ ఆదేశాలను చాలా వరకు సీసీఐ కాపీ కొట్టారని, దాదాపు 50 చోట్ల కాపీ పేస్ట్‌ ఆనవాళ్లు ఉన్నాయని తన ట్రైబ్యునల్‌కు సమర్పించిన పేపర్లలో పేర్కొన్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. సీసీఐ తనంతట తానుగా ఎలాంటి నిష్పాక్షిక, చట్టబద్ధమైన దర్యాప్తూ జరపలేదని గూగుల్‌ ఆరోపించింది. కాబట్టి సీసీఐ ఉత్తర్వులను కొట్టి వేయాలని అభ్యర్థించింది. గూగుల్‌ ఆరోపణలపై అటు సీసీఐ గానీ, యూరోపియన్‌ కమిషన్‌ గానీ తమ స్పందన తెలియజేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని