GST evasion: రెండేళ్లలో రూ.55,575 కోట్ల జీఎస్టీ ఎగవేత

జీఎస్టీ ఎగవేతను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఫలితంగానే జీఎస్టీ వసూళ్లు గణనీయంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లలో రూ.55 వేల కోట్లు విలువ చేసే ఎగవేతల్ని గుర్తించినట్లు తెలిపారు.

Published : 10 Nov 2022 12:41 IST

దిల్లీ: గత రెండేళ్లలో రూ.55,575 కోట్లు విలువ చేసే జీఎస్టీ మోసాలను గుర్తించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఖాజానాకు ఈ రకంగా నష్టం కలిగించిన దాదాపు 700 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్‌కు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ (DGGI) అధికారులు 22,300 నకిలీ జీఎస్టీ ఐడీ నెంబర్లను గుర్తించినట్లు వెల్లడించారు. జీఎస్టీ సంబంధిత మోసాలను గుర్తించేందుకు 2020 నవంబరు 9న ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ మోసాలను గుర్తించినట్లు తెలిపారు.

ఈ కేసుల్లో ఎంత మొత్తం రికవరీ చేశారనే అంశాన్ని జీఎస్టీ అధికారులు వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం, డీజీజీఐ, డీఆర్‌ఐ, ఆదాయ పన్ను, ఈడీ, సీబీఐ మధ్య సమన్వయం వల్లే నిందితుల గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. జీఎస్టీ ఎగవేతను అరికట్టేందుకు అధికారులు పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ తనిఖీ, ఇ-వే బిల్లులు, జీఎస్టీ రిటర్నుల ధ్రువీకరణ, ఇన్‌పుట్‌ ట్యాక్స్ క్రెడిట్‌ క్లెయింపై పరిమితి వంటి చర్యలతో ఎగవేతను అరికడుతున్నారు. ఫలితంగానే నెలవారీ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అక్టోబరు నెలలో రూ.1.52 లక్షల కోట్లు వసూలైన విషయం తెలిసిందే. గతకొన్ని నెలలుగా రూ.1.50 లక్షల కోట్ల వసూళ్లు సాధారణమైపోయాయి. అత్యధికంగా ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్లు వసూళ్లు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని