EMI: ప్రతి ₹లక్ష లోన్‌పై ఈఎంఐ ఎంత వరకు పెరగొచ్చంటే..?

ధరల పెరుగుదలను అదుపు చేయడమే లక్ష్యంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను పెంచింది. రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.90 శాతానికి చేర్చింది....

Updated : 08 Jun 2022 17:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ధరల పెరుగుదలను అదుపు చేయడమే లక్ష్యంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను పెంచింది. రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.90 శాతానికి చేర్చింది. దీంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. మే నెలలో పెంచిన 40 బేసిస్‌ పాయింట్లు, తాజాగా పెంచిన 50 బేసిస్‌ పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటే ఒక రూ.లక్ష లోన్‌పై ఈఎంఐ ఎంత భారం కానుందో చూద్దాం..

* మీకు రూ.25 లక్షల గృహరుణం ఉందనుకుందాం. కాలపరిమితి 20 ఏళ్లు, వడ్డీరేటు 7 శాతంగా పరిగణనలోకి తీసుకుందాం. అప్పుడు మీ ఈఎంఐ నెలకు రూ.19,382 నుంచి రూ.20,756కు పెరగనుంది. అంటే అదనంగా మరో రూ.1,374 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి రూ.లక్ష లోన్‌కు అదనంగా నెలకు రూ.55 చెల్లించాల్సి ఉంటుంది. 

* అదే సమయంలో రూ.10 లక్షల వాహన రుణం, 7 ఏళ్ల కాలపరిమితి, 10 శాతం వడ్డీరేటును పరిగణనలోకి తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.16,601 నుంచి రూ.17,070 పెరగనుంది. అంటే అదనంగా రూ.469 చెల్లించాల్సి వస్తుంది.

* అదే పర్సనల్‌ లోన్ విషయానికి వస్తే.. రూ.6 లక్షల రుణానికి ఐదేళ్ల కాలపరిమితి, 14 శాతం వడ్డీరేటుతో లెక్కిస్తే ఈఎంఐ రూ.281 పెరిగి రూ.13,961 నుంచి రూ.14,242కి చేరనుంది.

ఎఫ్‌డీ మదుపర్లకు మంచి రోజులు! 

కేవలం 36 రోజుల వ్యవధిలో ఆర్‌బీఐ రెపోరేటును 0.9 శాతం పెంచింది. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారికి శుభవార్త అనే చెప్పాలి. కరోనా సంక్షోభంతో భారీగా పడిపోయిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. 2014 సెప్టెంబరులో ఎఫ్‌డీలపై గరిష్ఠంగా 9 శాతం వడ్డీరేటును ఆఫర్‌ చేసిన ఎస్‌బీఐ కరోనా సంక్షోభంలో దాన్ని 5.4 శాతానికి చేర్చింది. దీంతో ఎఫ్‌డీలపై ఆధారపడే సీనియర్‌ సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఆర్‌బీఐ క్రమంగా వడ్డీరేట్లను పెంచుతుండడంతో తిరిగి ఎఫ్‌డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని