ITR Filling: ఐటీఆర్‌ను దాఖలు చేయాలా? ఆన్‌లైన్‌లో ఫైల్‌ చేయండిలా..

ITR Filling: ఐటీఆర్ దాఖ‌లు చేసిన వెంట‌నే ఈ-వెరిఫికేష‌న్ కూడా పూర్తి చేయవ‌చ్చు. లేదా ఐటీఆర్ దాఖాలు చేసిన త‌ర్వాత 120 రోజుల‌లోపు ఈ - వెరిఫికేష‌న్ చేయ‌వ‌చ్చు.

Updated : 25 Jun 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మదింపు సంవ‌త్స‌రం (ఏవై) 2022-23కి గానూ ఆదాయ‌పు ప‌న్ను శాఖ రిట‌ర్ను పత్రాలను నోటిఫై చేసింది. ఐటీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో రిట‌ర్నుల‌కు సంబంధించిన ప‌లు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. ప‌న్ను చెల్లింపుదారులు త‌మ‌కు వ‌ర్తించే ప‌న్ను ఫారంను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లోనే దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ఐటీఆర్ దాఖ‌లు చివ‌రి తేదీ జులై 31. స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, ప‌న్ను దాఖ‌లుకు కావ‌ల‌సిన ఫారం 26 ఏఎస్‌, ఏఐఎస్‌తో పాటు ఇత‌ర ప‌త్రాల‌ను సిద్ధం చేసుకుని వీలైనంత త్వరగా ఫైల్‌ చేయడం మంచిది.

ఐటీ రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేసే విధానం..

  • ముందుగా ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌ని సందర్శించాలి. https://www.incometax.gov.in/iec/foportal ఈ లింక్ ద్వారా నేరుగా వెబ్‌సైట్‌కి వెళ్ల‌వ‌చ్చు.
  • మీ పాన్ నంబ‌రును ఉప‌యోగించి లాగిన్ అవ్వాలి.
  • ఈ-ఫైల్‌ను క్లిక్ చేసి 'అసెస్మెంట్ సంవ‌త్స‌రం 2022-23' ఎంపిక చేసుకోవాలి.
  • మీ వార్షిక ఆదాయం, స్టేట‌స్‌, ఇత‌ర వివ‌రాల‌ ఆధారంగా మీకు స‌రిపోయే 'ఐటీఆర్-1' లేదా 'ఐటీఆర్-4' ఫారంను ఎంపిక చేసుకోవాలి.
  • రిట‌ర్నులు దాఖ‌లు చేయడానికి గ‌ల కార‌ణాన్ని ఎంపిక చేసుకుని ఫారంలో ముందుగానే నింపి ఉన్న స‌మాచారాన్ని ధ్రువీకరించండి.
  • అటు త‌ర్వాత సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి మీ ఐటీఆర్‌ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి.
  • మీ వివరాలను నిర్ధారించుకుని, వెరిఫై అండ్ స‌బ్మిట్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని నిమిషాల స‌మ‌యం పడుతుంది.
  • ఐటీఆర్ దాఖ‌లు చేసిన వెంట‌నే ఈ-వెరిఫికేష‌న్ కూడా పూర్తి చేయవ‌చ్చు. లేదా ఐటీఆర్ దాఖలు చేసిన త‌ర్వాత 120 రోజుల‌లోపు ఈ-వెరిఫికేష‌న్ చేయ‌వ‌చ్చు. ట్యాక్స్ పెయిడ్ అండ్ వెరిఫికేష‌న్ ట్యాబ్‌ను క్లిక్ చేసి మీరు ఏ విధానంలో ఈ-వెరిఫికేష‌న్ పూర్తి చేయాల‌నుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. ఈ-వెరిఫికేష‌న్ కోసం నాలుగు విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఆధార్-ఓటీపీ, ముందుగా ధ్రువీకరించిన బ్యాంకు ఖాతా, ముందుగా ధ్రువీకరించిన డీమ్యాట్ ఖాతా, లేదా బ్యాంక్ ఖాతా ద్వారా జన‌రేట్ చేసిన‌ ఈవీసీతో గానీ వెరిఫికేష‌న్‌ను పూర్తి చేయ‌వ‌చ్చు.
  • మీరు ఐటీఆర్ మొత్తాన్ని ఒక సెషన్లో పూర్తి చేయ‌లేక‌పోతే మీ ఫారం డ్రాఫ్ట్‌ని సేవ్ చేసుకోవ‌చ్చు. ఐటీఆర్ వెబ్‌సైట్ ఈ డ్రాఫ్ట్‌ని 30 రోజుల పాటు అందుబాటులో ఉంచుతుంది. ఏమైనా స‌మ‌స్య‌లు త‌లెత్తితే వెబ్‌సైట్ ద్వారా గానీ, టోల్ ఫ్రీ నంబ‌ర్లు 1800 103 0025, 1800 419 0025 ద్వారా గానీ ఆదాయ‌పు ప‌న్ను శాఖ వారిని సంప్ర‌దించొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని