Indian economy: భవిష్యత్‌ సవాళ్లనూ భారత ఆర్థిక వ్యవస్థ అధిగమిస్తుంది: జయంత్‌ ఆర్‌ వర్మ

Indian economy: ఇప్పటి వరకు ఎదురైన అన్ని సవాళ్లను భారత్‌ సమర్థంగా ఎదుర్కొందని.. భవిష్యత్‌లోనూ అదే కొనసాగుతుందని ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ అన్నారు.

Published : 14 Jan 2024 14:46 IST

Indian economy | దిల్లీ: గతకొన్నేళ్లలో వచ్చిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలన్నింటినీ భారత ఆర్థిక వ్యవస్థ (Indian economy) తట్టుకొని నిలబడగలిగిందని ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ ఆదివారం అన్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లోనూ ఎలాంటి సవాళ్లు ఎదురైనా భారత్‌ సమర్థంగా అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

2024లో ద్రవ్యోల్బణం (Inflation) తగ్గి బలమైన వృద్ధి నమోదవుతుందని వర్మ అంచనా వేశారు. గత ఏడాది అనూహ్యంగా పెరిగిన ఆహార పదార్థాల ధరలు క్రమంగా దిగొచ్చాయని గుర్తు చేశారు. 2024లోనూ అవి దిగువ స్థాయిలోనే ఉంటాయని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అవలంబించిన సరళ ద్రవ్య పరపతి విధానాలే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ సమస్యలకు కారణమని వివరించారు. తర్వాత సరఫరా వ్యవస్థల్లో తలెత్తిన ఇబ్బందులు సమస్యను మరింత తీవ్రం చేశాయన్నారు. ఆ సవాళ్లలో ఏవీ ఇప్పుడు లేవని తెలిపారు.

కరోనా మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరఫరా వ్యవస్థలో సమస్యలు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌- హమాస్‌ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, ఇటీవల ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు.. ఇలా వరుసగా సవాళ్లు ఎదురవుతున్న విషయం తెలిసిందే. వీటన్నింటినీ తట్టుకొని భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ భారత్‌ 7.3 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తుందని ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ సంస్థ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని