LinkedIn: లింక్డిన్‌లోనూ గేమ్స్‌.. మెదడుకు పదును పెట్టే పజిల్స్‌

LinkedIn: మెదడుకు పదును పెట్టే ఆటలతో యూజర్లను ఆకర్షించేందుకు లింక్డిన్‌ సిద్ధమైంది. అందులో భాగంగా మూడు పజిల్‌ గేమ్స్‌ను ప్రవేశపెట్టింది.

Updated : 02 May 2024 11:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లను ఆకర్షించడంలో భాగంగా సోషల్‌ మీడియా సంస్థ లింక్డిన్‌ (LinkedIn) ¸గేమింగ్‌లోకి ప్రవేశించింది. తమ ప్లాట్‌పామ్‌పై మూడు గేమ్స్‌ను తీసుకొచ్చింది. పిన్‌పాయింట్‌, క్వీన్స్‌, క్రాస్‌క్లైంబ్‌ పేరిట వీటిని ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో వీటిని ఆడొచ్చు.

మెదడుకు పదును పెట్టేలా లింక్డిన్‌ (LinkedIn) ఈ గేమ్స్‌ను రూపొందించింది. మొబైల్‌, డెస్క్‌టాప్‌లో ‘మై నెట్‌వర్క్‌’ ట్యాబ్‌లో గేమ్స్‌ను చూడొచ్చు. డెస్క్‌టాప్‌లో న్యూస్‌ సెక్షన్‌లోనూ అందుబాటులో ఉంటాయి. ‘వర్డ్‌లీ’ వంటి పజిల్స్‌కు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అనేక సంస్థలు యూజర్ల ఎంగేజ్‌మెంట్‌ను పెంచుకోవడం కోసం ఈ తరహా గేమ్స్‌ను రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో లింక్డిన్‌ తాజా నిర్ణయం వెలువడడం గమనార్హం.

2022లో ‘వర్డ్‌లీ’ని సొంతం చేసుకున్న తర్వాత న్యూయార్క్‌ టైమ్స్‌కు యూజర్‌ ఎంగేజ్‌మెంట్‌, వెచ్చించే సమయంతో పాటు డిజిటల్‌ సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయి. వర్డ్‌లీతో పాటు ఇతర గేమ్స్‌ను ప్రవేశపెట్టడమూ అందుకు కలిసొచ్చింది. లింక్డిన్‌ గేమ్స్‌ను ఇటీవలే సంస్థ న్యూస్‌ విభాగంలో చేరిన గేమ్స్ ఎడిటర్‌ పావోలో పాస్కో రూపొందించారు. అంతకుముందు ఆయన అమెరికన్‌ వాల్యూస్‌ క్లబ్‌ క్రాస్‌వర్డ్‌ పేరిట వచ్చే వీక్లీ క్రాస్‌వర్డ్‌లో పనిచేశారు. ఈ ఏడాది అమెరికన్‌ క్రాస్‌వర్డ్‌ పజిల్‌ టోర్నమెంట్‌ విజేతగానూ నిలిచారు. 

లింక్డిన్‌ (LinkedIn) యూజర్లు ఈ మూడు గేమ్స్‌ను రోజుకు ఒకసారి చొప్పున ఆడొచ్చు. అలాగే వారి కాంటాక్ట్‌లో ఎవరెవరు ఏ ఆటను ఆడారో కూడా తెలుసుకోవచ్చు. స్కూల్‌, కంపెనీ నెట్‌వర్క్‌లలో ఎవరు బాగా ఆడారో కూడా లీడర్‌బోర్డు రూపంలో కనిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని