బ్యాంకుల ద్వారా బీమా అవసరమా?

ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి తన, తన కుటుంబ శ్రేయస్సు కొరకు సంపాదిస్తుంటారు. దీని కోసం ఉద్యోగం , వ్యాపారం వంటి వాటిని ఎంచుకుంటారు...

Updated : 01 Jan 2021 19:40 IST

ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి తన, తన కుటుంబ శ్రేయస్సు కొరకు సంపాదిస్తుంటారు. దీని కోసం ఉద్యోగం , వ్యాపారం వంటి వాటిని ఎంచుకుంటారు.

ఈ క్రమంలో సంపాదించే వ్యక్తికి ఏమైనా జరిగి పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ వైకల్యం సంభవించినా,లేదా మరణించినా ఆ వ్యక్తిపై ఆధారపడ్డ వారు ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లలు చిన్న వాళ్లయితే మరీ ఇబ్బంది. ఎందుకంటే, పిల్లలు పెద్దవాళ్ళై ఫై చదువుల కొరకు దీర్ఘ కాలం పాటు చాలా ధనం కావాలి కాబట్టి. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి జీవిత బీమా పాలసీలను ప్రవేశ పెట్టారు. దీర్ఘ కాలం పాటు ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ ఐ సి , వివిధ రకాల పధకాలను ప్రవేశ పెట్టింది . గత రెండు దశాబ్దాలలో అనేక ప్రైవేట్ బీమా సంస్థలు కూడా వివిధ రకాల పధకాలను అందిస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటికి అనేక మంది ఎటువంటి జీవిత బీమా లేకుండానే జీవిస్తున్నారు.
ఇటువంటి సమస్య ను అధిగమించి మరింతమందికి బీమాను అందించే దిశలో కొత్త పద్ధతులకు నాంది పలికారు. బీమా పధకాలను మరింతమందికి చేర్చే దిశగా బ్యాంకుల ద్వారా ఈ పధకాలను ప్రజలకు అందించేందుకు, బీమా కంపెనీలు బ్యాంకులతో ఒప్పందం కూర్చుకున్నాయి.

ప్రజలకు ఎక్కువగా బ్యాంకులతో పని ఉంటుంది . ఎక్కువ నగదు లావాదేవీలు బ్యాంకు ద్వారా జరుపుతారు కాబట్టి , బ్యాంకు సిబ్బందికి ప్రజల ఖాతా వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది . దీనిని ఆసరాగా తీసుకుని బ్యాంకు సిబ్బంది తమ ఖాతా దారులకు పాలసీలను అమ్ముతున్నారు. ఇందులో జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా వంటివి ఉన్నాయ్. ముఖ్యంగా ఇంటి రుణం లేదా లాకర్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు , బీమా తీసుకోమని బలవంత పెట్టవచ్చు. ఇది తప్పనిసరి కాదు.

ఖాతాదారులు మొహమాటం తోనో లేదా బ్యాంకు సిబ్బందితో పని ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ పడతారని , ఈ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీసుకుంటున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు అనవసరమైన పాలసీలను అంటగడుతున్నారు .

మారుతున్న కాలంతో వస్తున్న మార్పులకు అనుగుణంగా పథకాలలో కూడా మార్పులు వస్తాయి. ఉదా : ఒకప్పుడు ఎండోమెంట్ , మనీబ్యాక్ వంటివాటిని బీమాతోపాటు మదుపు కూడా భావించేవారు. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ. చాలా కాలం వీటిని బీమా కన్నా మదుపు సాధనంగా భావించేవారు.
ప్రస్తుత రోజులలో జీవన ప్రమాణాలలో మార్పులతోపాటు,ఊహించని వ్యాధుల వలన, ప్రమాదాల సంఖ్యలో పెరుగుదల వంటి కారణాలవలన సంపాదించే వ్యక్తి మరణిస్తే వచ్చే బీమా హామీ మొత్తం సరిపోదు.

అందువలన వాటి స్థానంలో టర్మ్ జీవిత బీమాను తీసుకువచ్చారు. టర్మ్ బీమాలో బీమా హామీ మొత్తం ఎక్కువగా, ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పాలసీ ఉద్దేశ్యం పాలసీదారుడు పాలసీ కాలపరిమితిలో మరణించినట్లైతే బీమా హామీ మొత్తం చెల్లిస్తారు. అయితే పాలసీదారుడు పాలసీ కాలపరిమితి పూర్తయ్యే వరకు జీవించివుంటే ఎటువంటి సొమ్ము పొందడు . ఎందుకంటే ఇది బీమా కానీ మదుపు సాధనం కాదు.

ప్రస్తుత రోజులలో అనేక చోట్ల ఈ బీమా సంస్థలు తమ కార్యాలయాలు కలిగి ఉన్నాయి . ఇంటర్నెట్ ద్వారా కూడా బీమాను తీసుకునే సదుపాయం ఉంది. మీరు తీసుకొనదలచిన పాలసీని వివిధ కంపెనీల ప్రీమియంలతో పోల్చిచూసుకొనవచ్చు . జీవిత బీమా అయితే ఎంత బీమా హామీ ఉండాలి, ప్రీమియం ఎంత, ఎన్ని సంవత్సరాలు కట్టాలి తోపాటు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా చాలా ముఖ్యం.
అదే, ఆరోగ్య బీమా అయితే నెట్వర్క్ ఆసుపత్రులు, క్యాషులెస్ ట్రీట్మెంట్, ఉపపరిమితులు, సహ చెల్లింపులు , ఎటువంటి వ్యాధులకు చెల్లిస్తారు, ఎటువంటి చెల్లించరు, ఉన్న వ్యాధులకు చికిత్స కోసం ఎన్ని సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది , మొదలగు విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ప్రీమియం చౌకగా ఉందని ఆరోగ్య బీమాను కొనుగోలు చేయరాదు.

కాబట్టి బ్యాంకుల ద్వారా ఎటువంటి పాలసీలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ, ఏ కారణం చేతైనా బ్యాంకు సిబ్బంది మిమ్మల్ని బలవంతం చేసినట్లయితే ఫై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అట్లాగే బీమా నియంత్రణ సంస్థ అయిన ఐ ఆర్ డి ఏ (IRDAI ) వారికి ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని