Investments in Crisis: సంపాదించడానికి సంక్షోభం ఓ సదావకాశం!

సంక్షోభ సమయంలో భయానికి లోనుకాకుండా మార్కెట్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలో నిపుణులు అనేక మార్గాలు సూచించారు...

Updated : 23 May 2022 13:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటి వరకు ప్రపంచం అనేక సంక్షోభాలను చవిచూసింది. తాజా కరోనా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం అందులో కొన్ని. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లలో మదుపు చేసేవారికి వీటి ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి సంక్షోభ సమయాల్లో పెట్టుబడులు కచ్చితంగా ఉపసంహరించుకోవాలా? సుదీర్ఘంగా కొనసాగే ఇలాంటి ఘటనలకు భయపడి ఎంతకాలం మార్కెట్లకు దూరంగా ఉంటాం? కఠిన సవాళ్లను సైతం ఎదుర్కొని నిలదొక్కుకునే మార్గాలు లేవా? ఉన్నాయనే అంటున్నారు ఆర్థిక నిపుణులు.

సంక్షోభాలకు ఎలా స్పందిస్తారు?

ఎలాంటి సంక్షోభమన్నదానితో సంబంధం లేకుండా అనేక పుకార్లు షికార్లు చేస్తుంటాయి. దీంతో మదుపర్లు భయానికి లోనై అమ్మకాలకు దిగుతారు. చివరకు నష్టాలొచ్చినా వెనుకాడరు. ఇది చాలా పెద్ద తప్పు. అయినా, మరింత నష్టాన్ని నివారించడం కోసం తప్పదన్నట్లుగా మదుపర్లు అమ్మకాలకు దిగుతారు. పోనీ, ధైర్యంగా నిలబడి మంచి స్టాక్స్‌లో మదుపు చేద్దామంటే మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తుంటాయి. బలమైన షేర్లను గుర్తించడమే కష్టమవుతుంటుంది. ప్రస్తుతం మార్కెట్లలో అదే పరిస్థితి నెలకొంది. యుద్ధం ప్రారంభమైన తొలిరోజుల్లో మార్కెట్లు భారీగా కుంగాయి. అక్కడి నుంచి కోలుకున్నప్పటికీ భవిష్యత్తుపై భయాలతో మళ్లీ ఒడుదొడుకుల ధోరణిలోకి జారుకున్నాయి.

తాజా యుద్ధ ప్రభావం ఎలా ఉంది?

చాలా అసెట్‌ క్లాస్‌లు, రంగాలు, పరిశ్రమలపై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయి. ఆంక్షలు అమల్లోకి వస్తాయి. సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ముడిసరకుల కొరత ఏర్పడుతుంది. ఉత్పత్తి దెబ్బతింటుంది. డిమాండ్‌ పెరిగి ధరలు అధికమవుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం తెరపైకి వస్తుంది. ఈ పరిణామాల వల్ల ఈక్విటీ షేర్ల ధరలు 10-30% వరకు పడిపోతాయి. కింది పట్టికను ఒకసారి పరిశీలిస్తే భారీ సంక్షోభాల నుంచి ఈక్విటీ మార్కెట్లు కేవలం ఏడాది వ్యవధిలోనే భారీగా కోలుకోవడం గమనించవచ్చు.

సంక్షోభంలో ఎలా మదుపు చేయాలి?

ఎలాంటి సంక్షోభమైనా సంపదను వృద్ధి చేసుకోవడానికి అనేక అవకాశాలను తీసుకొచ్చి పెడుతుంది. చరిత్ర చూస్తే ఈ సంక్షోభాలే భారీ సంపదను పోగేసుకోవడానికి సదావకాశంగా మారాయి. అయితే, స్టాక్స్‌ని తెలివిగా ఎంచుకున్నవారే సక్సెస్‌ అవుతారు. సంక్షోభం తలెత్తగానే టెక్నాలజీ, యుటిలిటీస్‌, కన్జ్యూమర్‌ గూడ్స్‌, బంగారం వంటి సురక్షిత రంగాల్లోకి పెట్టుబడులను మళ్లిస్తుంటారు. దీని వల్ల నష్టాలను కొంత వరకు తప్పించుకోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవడం మాత్రం సాధ్యం కాకపోవచ్చు.

మార్కెట్ల పతనంలో ఏవి కొనాలి?

సంక్షోభ సమయాల్లో మార్కెట్లు భారీగా కుంగుతాయి. అప్పుడు నాణ్యమైన షేర్లు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. మరి అలాంటి వాటిని గుర్తించడానికి ఈ కింది అంశాలను పరిశీలించండి..

1. నిత్యావసర సరకులు, సేవలు

సంక్షోభ సమయాల్లో నిత్యావసర సరకులు, సేవలు అందించే కంపెనీల షేర్లను ఎంచుకోవడం ఉత్తమం. సబ్బులు, పాలు, ఔషధాలు, బియ్యం, పప్పులు.. వంటి నిత్యావసరాలకు సంబంధించిన స్టాక్స్‌ సంక్షోభాల్లోనూ రాణించే అవకాశం ఉంటుంది. ఇతర వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకున్నా.. ప్రజలు వీటిని మాత్రం కొనడం ఆపలేరు. అలాగే ఆభరణాలు, ఆటోమొబైల్స్‌, హాస్పిటాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌, టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌.. వంటి రంగాల స్టాక్స్‌ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. చాలా తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉండొచ్చు. కానీ, సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఇవి చాలా సమయం తీసుకుంటాయి.

2. సొంత సరఫరా వ్యవస్థలున్న కంపెనీలు

యుద్ధం వంటి సంక్షోభ సమయంలో సరఫరా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో ముడి సరకుల కొరత ఏర్పడి ఉత్పత్తి కుంటుపడుతుంది. కానీ, సొంతంగా సరఫరా వ్యవస్థలు కలిగి ఉన్న కంపెనీలకు ఈ ఇబ్బంది ఉండదు. పైగా సరఫరాల కోసం థర్డ్‌ పార్టీ కంపెనీలు, హోల్‌సేలర్లు, కాంట్రాక్టు సంస్థలపై ఆధారపడే కంపెనీలతో పోలిస్తే వీటికి అదనపు ప్రయోజనం ఉంటుంది. అందుకే సొంతంగా ముడి సరకులను సమకూర్చుకునే వ్యవస్థ ఉన్న కంపెనీలపై దృష్టి సారించాలి.

3. భాగస్వాములకు భరోసానిచ్చే సంస్థలు

కొన్ని కంపెనీలు తమ వ్యాపారంలో భాగంగా ఉండే సప్లయర్లు, విక్రేతలు, డిస్ట్రిబ్యూటర్లకు సంక్షోభ సమయంలో రుణ సాయం చేసి ఆదుకుంటుంటాయి. అంటే ఆయా సంస్థలు ఆర్థికంగా బలంగా ఉన్నాయని అర్థం. పైగా క్షేత్రస్థాయిలో వ్యాపారాలు దెబ్బతినకుండా కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయని అర్థం చేసుకోవచ్చు.

4. మార్కెట్‌ వాటాను పెంచుకునే కంపెనీలు

సంక్షోభ సమయంలో కొన్ని కంపెనీలు తమ మార్కెట్‌ వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఫలితంగా విక్రయాలు దెబ్బతినకుండా చూసుకుంటాయి. ఇది కంపెనీ ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచుతుంది. ఉదాహరణకు క్షేత్రస్థాయి విక్రేతలపై ఆధారపడ్డ చాలా కంపెనీలు కరోనా సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేశాయి. ఫలితంగా మార్కెట్‌ వాటా పెరిగి ప్రీమియం ఉత్పత్తుల కేటగిరీలో చేరాయి. అలా మార్కెట్‌ వాటాను పెంచుకునే కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం.

ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వంటి సంక్షోభాలు కొత్తేమీ కాదు. భవిష్యత్తులో ఇలాంటివి రాబోవన్న భరోసా కూడా లేదు. ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే.. ముందుగా పుకార్లకు దూరంగా ఉండాలి. హేతుబద్ధంగా నాణ్యమైన స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే సాధారణ సమయాల్లో కంటే అధిక సంపదను సృష్టించుకోవచ్చు.

(గమనిక: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న అంశం. మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత వ్యవహారం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని