Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకొని.. ఫ్లాట్‌గా ముగిసి.. మార్కెట్‌లోని మరిన్ని సంగతులు!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాయి....

Updated : 14 Jan 2022 16:13 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు సూచీలకు దన్నుగా నిలిచింది. 

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 61,040.32 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. దాదాపు మధ్యాహ్నం వరకు అదే ధోరణిలో సాగింది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో అనూహ్యంగా పుంజుకొని ఓ దశలో స్వల్ప లాభాలూ నమోదు చేసింది. చివరకు 12.27 పాయింట్లు నష్టపోయి 61,223.03 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 61,324.59 - 60,757.03 మధ్య కదలాడింది. నిఫ్టీ 18,185.00 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజులో 18,286.95 - 18,119.65 మధ్య కదలాడింది. చివరకు 2.10  పాయింట్ల స్వల్ప నష్టంతో 18,255.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.13 వద్ద నిలిచింది.

నిఫ్టీ50 సూచీలో లాభపడిన / నష్టపోయిన షేర్లు

లాభాల స్వీకరణతోనే నష్టాలు..

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో మార్కెట్లు ఉదయం ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. దీనికి గత ఐదు సెషన్ల మార్కెట్‌ ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ తోడైంది. దీంతో సూచీలు ఓ దశలో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయంగా ఉన్న బడ్జెట్‌ అంచనాలు, మూడో త్రైమాసిక ఫలితాల సానుకూల పవనాల వంటి సానుకూలతలు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు దోహదం చేశాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత సూచీలు పుంజుకున్నాయి. ఓ దశలో స్వల్ప లాభాల్లోకీ ఎగబాకాయి. చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా ఉండడమూ సూచీలకు కలిసొచ్చింది.  

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌,  టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్ వంటి ఐటీ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో నిఫ్టీ ఐటీ సూచీ నేడు భారీగా పుంజుకుంది. ఉదయం ప్రధాన సూచీలను ఇదే కిందకు లాగడం గమనార్హం.

* ఇండియా సిమెంట్స్‌ షేర్లు ఈరోజు రూ.259.95 వద్ద 14 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం విశేషం. గత 20 రోజుల్లో ఈ కౌంటర్‌లో 37 శాతం ర్యాలీ కనిపించింది. దేశవ్యాప్తంగా వివిధ హౌసింగ్‌, నీటి పారుదల సహా ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల నుంచి ఆర్డర్లు లభించినట్లు ప్రకటించడంతో బ్రోకరేజీ సంస్థలు ఈ షేర్లను కొనడానికి సిఫార్సు చేశాయి. మరోవైపు కంపెనీలో కార్పొరేట్‌ యాక్షన్‌ ఉండే అవకాశం ఉందన్న వార్తలూ షేరు ర్యాలీకి దోహదం చేశాయి.

* డేటామెటిక్స్ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 5 శాతం మేర లాభపడ్డాయి. కంపెనీ పీఎస్‌ఐ సర్వీసెస్‌తో దీర్ఘకాల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడమే అందుకు కారణం.    

* యునైటెడ్‌ బ్రూవరీస్‌ షేర్లు వరుసగా తొమ్మిదో రోజు, డెల్టా కార్ప్‌ షేర్లు వరుసగా ఎనిమిదో రోజు రాణించాయి.

* నిఫ్టీ 50 సూచీలో 22 షేర్లు లాభపడితే.. 28 షేర్లు నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని