LIC IPO: గణనీయంగా తగ్గనున్న ఎల్‌ఐసీ ఐపీఓ పరిమాణం?

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ పరిణామాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించే యోచనలో ఉందని సమాచారం...

Published : 22 Apr 2022 15:03 IST

దిల్లీ: మదుపర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు సంబంధించి రోజుకో వార్త తెరపైకి వస్తోంది. ఐపీఓ తేదీలను ఈ వారంలోనే ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉందని గురువారం ఓ ఉన్నతాధికారి వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా పబ్లిక్‌ ఇష్యూ పరిమాణాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించే యోచనలో ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

మే 2న ఐపీఓ?

ఎల్‌ఐసీ ఐపీఓను గత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినా, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల దృష్ట్యా వాయిదా వేసింది. పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీ ఇచ్చిన అనుమతులు మే 12 వరకు వర్తిస్తాయి. ఆ గడువు దాటితే మళ్లీ కొత్తగా సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మే 2న ఐపీఓకి వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, స్టాక్‌ మార్కెట్‌లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో మదుపర్ల ఆసక్తి తగ్గిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ముందు అనుకున్న స్థాయిలో కాకుండా కొంత తక్కువ మొత్తంలో సమీకరించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

తొలుత రూ.21 వేల కోట్లు..

ఐదు శాతం వాటాలను విక్రయించడం ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని ముందు అనుకున్న విషయం తెలిసిందే. కానీ, దాన్ని రూ.21,000 కోట్లకే పరిమితం చేయాలని ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. తద్వారా ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువను రూ.6 లక్షల కోట్లకు తగ్గించే అవకాశం ఉంది. అలాగే మరో రూ.9,000 కోట్లు విలువ చేసే షేర్లను గ్రీన్‌షూ ఆప్షన్‌ కింద జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. రూ.21,000 కోట్లతో ఐపీఓకి వచ్చినా.. భారత్‌లో ఇదే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ అవుతుంది. ఈ మార్కెట్‌ ఒడుదొడుకుల్లో ఐపీఓ ప్రక్రియ సాఫీగా సాగాలంటే పరిమాణాన్ని తగ్గించడమే మేలైన మార్గమని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. తద్వారా మదుపర్లు మంచి లాభాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఎక్కువ మంది పబ్లిక్‌ ఇష్యూలో పాల్గొంటారు.

గ్రీన్‌షూ ఆప్షన్‌ అంటే..

దేశీయంగా ఐపీఓ గ్రీన్‌షూ ఆప్షన్‌ వినియోగించడం ఇదే తొలిసారి. అంటే ఎల్‌ఐసీ ముందుగానే మరిన్ని అదనపు షేర్ల జారీకి సెబీ నుంచి అనుమతి తీసుకుంటుంది. ఒకవేళ మార్కెట్‌ పరిస్థితులు సానుకూలంగా ఉండి, సబ్‌స్క్రిప్షన్‌ ఊహించిన దానికంటే మించితే.. ఆ అదనపు షేర్లను కేటాయిస్తారు. అలా ఎల్‌ఐసీ మరో రూ.9,000 కోట్లు విలువ చేసే షేర్లను ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ గడువు ముగిసిన తర్వాత కూడా మదుపర్లకు కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు పబ్లిక్‌ ఇష్యూ విలువ రూ.30,000 కోట్లకు చేరుతుంది.

ఇప్పుడు గనక ఎల్‌ఐసీ ఐపీఓకు వెళ్లకుంటే.. ఆగస్టు- సెప్టెంబరు వరకు జరగకపోవచ్చు. తాజా త్రైమాసిక ఫలితాలతో సెబీకి మళ్లీ ఐపీఓ ముసాయిదా పత్రాలను సమర్పించి, ఆమోదం లభించేందుకు ఆ మేరకు సమయం పడుతుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని