జీవిత బీమా, ఆరోగ్య బీమా మ‌హిళ‌ల‌కు ఏది ఎక్కువ ప్ర‌యోజ‌న‌క‌రం ?

జీవిత‌, ఆరోగ్య బీమా రెండూ కూడా ల‌క్ష్యాన్ని అందించే ఆస్తులు లాంటివే.

Updated : 17 Oct 2022 14:14 IST

మ‌హిళ‌లు ఒక‌ప్పుడు ఇంటికే ప‌రిమితం అయ్యేవారు. జీవిత బీమా విష‌యానికోస్తే  ఇంటిలో మ‌గ‌వారికి మాత్ర‌మే జీవిత బీమా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా గృహ వాత‌వ‌ర‌ణం మారిపోయింది. స్త్రీ, పురుషలిద్ద‌రు ఉద్యోగాలు చేస్తూ, కెరీర్ రీత్యా ప్ర‌యాణాలు చేస్తూ తీరిక‌లేకుండా ఉంటున్నారు. ప్ర‌స్తుత కాలంలో స్త్రీ, పురుష‌లిద్ద‌రికి లింగ, వ‌యోభేదం లేకుండా జీవిత బీమా, ఆరోగ్య బీమా రెండూ అవ‌స‌ర‌మే. చ‌దువుకునే స‌మ‌యంలో మ‌హిళ‌లు ఉన్న‌త విద్య‌కు బ్యాంకు రుణాలు తీసుకోవ‌డం ఈ మ‌ధ్యరోజుల్లో సాధార‌ణ‌మై పోయింది. ఆ స‌మ‌యంలో కూడా బ్యాంకులు జీవిత బీమా అడుగుతారు. ఇక‌పోతే ఆరోగ్య బీమా మ‌హిళ‌ల‌కు ఉండ‌టం అత్య‌వ‌స‌రం కూడా.

జీవిత బీమా, ఆరోగ్య బీమా లేని మ‌హిళ‌లు సుర‌క్షిత‌మైన భ‌విష్య‌త్తు కోసం తెలివైన ఆర్ధిక ప్ర‌ణాళిక‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి త‌మ‌ను తాము ప్ర‌శ్నించుకోవాలి, నా జీవిత‌కాలంలో నేను లేనిఎడ‌ల నా కుటుంబానికి ఆర్ధిక భ‌ద్ర‌త‌, జీవించి ఉన్న‌ప్పుడు ఆరోగ్య భ‌ద్ర‌త శ్రేయ‌స్సు గురించి భ‌రోసా ఉండేలా ఏ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టాలి అనేది  ఆలోచించాలి. మొద‌ట ఈ రెండు సాధ‌నాల నిర్మాణాన్ని అర్ధం చేసుకోవాలి, ఆపై వీటి కింద అందించే ప్ర‌యోజ‌నాల‌ను అంచ‌నా వేయాలి. జీవిత‌, ఆరోగ్య బీమా రెండూ కూడా ల‌క్ష్యాన్ని అందించే ఆస్తులు లాంటివే. ఒక‌టి జీవితానికి ఏమైన అయితే కుటుంబాన్ని ఆర్ధికంగా కాపాడుతుంది. రెండోవ‌ది ఆరోగ్యాన్ని కాపాడి సాధార‌ణ మ‌నిషిని చేస్తుంది.

జీవిత బీమా : జీవిత బీమాలో ట‌ర్మ్ బీమా పాల‌సీ తీసుకుంటే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఈ పాల‌సీ తీసుకున్న‌వారు భౌతికంగా లేక‌పోయిన సంద‌ర్భాల్లో కుటుంబ ఆర్ధిక అవ‌స‌రాలు (పిల్ల‌ల చ‌దువు, వివాహం) వంటి ఖ‌ర్చుల‌ను చాలావ‌ర‌కు తీరుస్తుంది. లేదా ఎండోమెంట్‌, యూనిట్ లింక్డ్ పాల‌సీలు తీసుకున్న కూడా అవి మెచ్యూర్ అయ్యి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత వృద్ధాప్యంలో మ‌హిళ‌ల‌కు త‌గినంత మూల‌ధ‌నం ఉండేలా ఈ జీవిత బీమా ప‌థ‌కాలు ఆర్ధిక అవ‌స‌రాల‌ను తీరుస్తాయి. జీవిత బీమా పెట్టుబ‌డితో క‌నీసం సాధార‌ణ ఆదాయం యొక్క శూన్య‌త‌ను చాలా వ‌ర‌కు పూరించ‌వ‌చ్చు. ప్ర‌త్యేకించి స్త్రీ కుటుంబానికి ప్ర‌ధాన జీవ‌నాధారం.  మ‌హిళ‌ల విష‌యంలో యూనిట్ లింక్డ్ బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయ‌డం అంటే పెట్టుబ‌డి పెట్టిన ప్రీమియంల‌పై మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు. భార‌త్‌లో జీవిత బీమా పురుషుల కంటే మ‌హిళ‌ల‌కే చౌక‌గా ఇస్తున్నారు. ఎందుకంటే వారి జీవిత‌కాలం పురుషుల క‌న్నా ఎక్కువ‌గా ఉంటుంది. ఇంకా జీవిత బీమా కోసం చెల్లించే ప్రీమియంలు 1961 ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీ కింద రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు అర్హులు.

ఆరోగ్య బీమా :  ఆరోగ్య బీమా అనేది  వైద్య ఖ‌ర్చుల నుండి కాపాడే ఆర్ధిక భ‌ద్ర‌తా వ‌ల‌యం. ప్ర‌మాదాలు ఎప్పుడైనా జ‌ర‌గ‌వ‌చ్చు. అంతేకాకుండా మ‌హిళ‌ల్లో తీవ్ర‌మైన అనారోగ్యాలు పెరుగుతున్నాయి. డేకేర్ విధానాలు, ఓపీడీ ఖ‌ర్చులు, ఇన్‌-పేషెంట్ హాస్పిట‌లైజేష‌న్‌, వైద్య ప‌రీక్ష‌లు, మందులు, డాక్ట‌ర్ సంప్ర‌దింపులు మొద‌లైన వాటికి సంబంధించిన ఖ‌ర్చుల‌ను ఇంటి నుండి భ‌రించ‌డం భ‌రించ‌లేనిదిగా ఉంటుంది. నామ‌మాత్ర‌పు ప్రీమియం మొత్తానికి గ‌ణ‌నీయ‌మైన వైద్య ఖ‌ర్చుల‌ను ఆరోగ్య‌బీమాతో పొందొచ్చు. ఇది అనేక తీవ్ర‌మైన వ్యాధుల చికిత్స ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేస్తుంది. ఇది కుటుంబ వ్య‌క్తిగ‌త పొదుపుపై త‌క్కువ ఒత్తిడిని క‌లిగిస్తుంది. ఆరోగ్య బీమా ప్రీమియంలు కూడా రూ. 25 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపుల‌కు ఆర్హ‌త పొందుతాయి. 60 ఏళ్లు అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న‌ట్ల‌యితే రూ. 50 వేలు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80డీ కింద మిన‌హాయింపు పొందొచ్చు.

ఇంటి వ‌ద్ద ఉండే గృహిణుల‌కు జీవిత బీమాతో పోల్చుకుంటే ఆరోగ్య బీమా అత్య‌వ‌స‌రం. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా మ‌హిళ‌లంద‌రికీ ఆరోగ్య బీమా అవ‌స‌రం ఎప్పుడూ ముఖ్య‌మైన‌దే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని