ఎగుమతుల్లో మారుతీ కీలక మైలురాయి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) ఎగుమతుల్లో కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కలిపి 20 లక్షల యూనిట్లను

Published : 27 Feb 2021 22:33 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) ఎగుమతుల్లో కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కలిపి 20 లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గుజరాత్‌లో ముంద్రా పోర్టు నుంచి ఎస్-ప్రెసో, స్విఫ్ట్‌, వితారా బ్రెజా కార్లు ఇటీవల దక్షిణాఫ్రికాకు ఎగుమతి అయ్యాయి. దీంతో మారుతీ 20 లక్షల మైలురాయిని చేరుకున్నట్లైంది.

34 ఏళ్లుగా కార్లను ఎగుమతి చేస్తున్న మారుతీ సుజుకీ 1987, సెప్టెంబరులో తొలిసారి హంగేరీకి 500 కార్లను పంపింది. అలా 2012-13లో 10 లక్షల మైలురాయిని చేరుకుంది. వీటిలో 50 శాతం అభివృద్ధి చెందిన ఐరోపా మార్కెట్లకు ఎగమతి కావడం విశేషం. తొలి 10 లక్షల యూనిట్ల ఎగుమతికి 26 ఏళ్లు పట్టగా.. తర్వాతి పది లక్షల మైలురాయిని కేవలం ఎనిమిదేళ్లలోనే చేరుకుంది. ఈ క్రమంలో లాటిన్‌ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికా మార్కెట్లలో తనదైన ముద్ర వేసింది. ఆల్టో, బాలెనో, డిజైర్‌, స్విఫ్ట్‌ వంటి మోడళ్లకు ఆయా దేశాల్లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం 14 మోడళ్లలో 150 వేరియంట్లను 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

ఈ సందర్భంగా కంపెనీ సీఈవో కెనిచీ అయుకావా మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాహన విపణిలో భారత్‌లో తయారవుతున్న తమ కంపెనీ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. నాణ్యత, భద్రత, డిజైన్‌, సాంకేతికత విషయంలో మారుతీ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తోందని తెలిపారు. అలాగే ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లోని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను తయారు చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి..

గంటకు 200 కి.మీ వేగం

బీఎండబ్ల్యూ నుంచి రూ.24లక్షల బైక్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని