Twitter: బోర్డు సభ్యులందరిపై మస్క్‌ వేటు.. ఇక సీఈఓగా ఆయనేనా?

ట్విటర్‌ నూతన యజమాని ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ బోర్డు సభ్యులందరిని తొలగించారు. ప్రస్తుతం ఆయనొక్కరే బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు. 

Updated : 01 Nov 2022 13:29 IST

న్యూయార్క్‌: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను సొంతం చేసుకున్న అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. సంస్థలో సమూల ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. సంస్థను కొనుగోలు చేసిన తొలి రోజే సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ సహా నలుగురు ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించిన ఆయన.. తాజాగా బోర్డు సభ్యులందరిపై వేటు వేశారు. ప్రస్తుతం ట్విటర్‌ బోర్డులో తానే ఏకైక డైరెక్టర్‌ అని పేర్కొన్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సోమవారం సమర్పించిన ఫైలింగ్‌లో వెల్లడించారు. దీంతో ట్విటర్‌ సీఈఓ పదవిని ఆయన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ట్విటర్‌ను తాను కొనుగోలు చేయడానికి ముందు డైరెక్టర్లుగా ఉన్నవారంతా ఇకపై ట్విటర్‌ బోర్డు సభ్యులుగా కొనసాగబోరని మస్క్‌ ఆ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. అందులో మాజీ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి బోర్డులో తానొక్కడినే డైరెక్టర్‌గా ఉన్నానని, అయితే ఇది తాత్కాలికమేనని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌కు తెలిపాడు. ఇంతకంటే వివరాలేమీ మస్క్‌ వెల్లడించలేదు.

ఇదిలా ఉండగా.. ఏకైక బోర్డు సభ్యుడిగా ఉన్న మస్క్‌ ఇక ట్విటర్‌ సీఈఓగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పరాగ్‌ అగర్వాల్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత కొత్త సీఈఓను నియమించలేదు. అయితే సోమవారం నాటి ఫైలింగ్‌లో తానే ట్విటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అని మస్క్‌ పేర్కొన్నట్లు కొన్ని మీడియా కథనాలు తెలిపాయి. దీంతో త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇన్వెస్టర్లలో సౌదీ యువరాజు

ఇక ట్విటర్‌ కొత్త ఇన్వెస్టర్లలో సౌదీ యువరాజు అల్వలీద్‌ బిన్‌ తలాల్‌, ట్విటర్‌ సహా వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సె ఉన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా తెలిసింది. తలాల్‌కు చెందిన కింగ్‌డమ్‌ హోల్డింగ్‌ కంపెనీ ట్విటర్‌లో దాదాపు 35 మిలియన్ల షేర్లను 1.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మస్క్ తర్వాత కంపెనీలో రెండో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా సౌదీ యువరాజు ఉండనున్నారు. ఇక, జాక్‌ డోర్సే 978 మిలియన్‌ డాలర్లతో 18 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ కూడా ఇన్వెస్టర్‌గా ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని