మస్కా మజాకా..ఆరింతలైనఅనామక షేర్లు!

విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ఇప్పుడు ఏం చేసినా అది సంచలనంగానే మారుతోంది.

Published : 12 Jan 2021 14:13 IST

 

వాషింగ్టన్‌: విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ఇప్పుడు ఏం చేసినా అది సంచలనంగానే మారుతోంది. ఆయన వేసే ప్రతి అడుగుని యావత్తు ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతూ.. భవిష్యత్తు జీవనానికి సరికొత్త సాంకేతిక మార్గాలను అన్వేషిస్తున్న ఈ ఆవిష్కర్త.. ఒక్క సంవత్సరం కాలంలోనే దాదాపు 150 బిలియన్‌ డాలర్లకు పైగా సంపదను ఆర్జించి ప్రపంచ కుబేరుల్లో అగ్రగణ్యుడిగా నిలిచారు. మరి ఇలాంటి వ్యక్తి నుంచి వచ్చే మాటలకు ఎంత విలువుంటుందో ఇటీవల జరిగిన ఓ సంఘటనే కళ్లకు కడుతోంది.

జనవరి 7న ఎలన్‌ మస్క్‌ తన ట్విటర్‌ ఖాతాలో ‘యూజ్‌ సిగ్నల్‌’ అనే సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తరహాలో ‘సిగ్నల్‌’ కూడా ఒక సామాజిక మాధ్యమం. దాన్ని వినియోగించాలని కోరుతూ మస్క్‌ ఓ సందేశాన్ని ఉంచారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న మదుపర్లు ‘సిగ్నల్‌ అడ్వాన్స్‌’ అనే పేరు మీదున్న ఓ చిన్న వైద్యపరికరాల తయారీ కంపెనీపై దృష్టి సారించారు. బహుశా దీన్నే మస్క్‌ ప్రమోట్‌ చేస్తున్నారనుకుని ఆ కంపెనీ షేర్లపై పడ్డారు. దీంతో ఆ కంపెనీ షేర్ల విలువ జనవరి 7న ఆరింతలైంది. మూడు రోజుల్లో అమాంతం 5,100శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్‌ విలువ 390మిలియన్‌ డాలర్లకు చేరింది. మస్క్‌ ట్వీట్‌పై గందరగోళం కొనసాగుతున్నప్పటికీ.. శుక్రవారం సిగ్నల్‌ అడ్వాన్స్‌ షేర్లు 885శాతం ర్యాలీ అయ్యాయి.

దీనిపై స్పందించిన సిగ్నల్‌ అడ్వాన్స్‌ సీఈవో క్రిస్ హైమెల్.. మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మస్క్‌తోగానీ, సిగ్నల్‌ యాప్‌తోగానీ తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ కంపెనీ 2019 నుంచి సెక్యూరిటీస్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డుకి  ఎలాంటి వార్షిక నివేదిక సమర్పించలేదు. చివరిసారి సమర్పించిన నివేదిక ప్రకారం.. 2014 నుంచి 2016 మధ్య కంపెనీకి ఎలాంటి ఆదాయం లేదు. ఇక తన ట్విటర్‌ సందేశంపై స్పందించిన మస్క్‌.. తాను గతంలో ‘సిగ్నల్‌’ యాప్‌(సామాజిక మాధ్యమం)కి విరాళాలిచ్చానని.. భవిష్యత్తులో మరికొన్ని ఇవ్వాలనుకుంటున్నానని అసలు విషయం చెప్పారు.

గతంలోనూ ఈ తరహా గందరగోళం చోటుచేసుకుంది. జూమ్‌ కమ్యూనికేషన్స్‌కు ఆదరణ పెరగడంతో ఆ మధ్య మదుపర్లు పొరపాటున అదే పేరిట ఉన్న చైనా మొబైల్‌ తయారీ కంపెనీలో మదుపు చేశారు. అసలు విషయం తెలుసుకొని కంగుతిన్నారు.

ఇవీ చదవండి..

స్థూల ఎన్‌పీఏలు 13.5 శాతానికి!

తినడానికి సిద్ధంగా మాంసాహారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని