Jet Airways: జేకేసీకి జెట్‌ ఎయిర్‌వేస్ అప్పగింత.. NCLT అనుమతి

Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ను జలాన్‌ కర్లాక్‌ కన్సార్షియానికి అప్పగించేందుకు NCLT గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రుణదాతలకు చెల్లింపులు చేసేందుకు కన్సార్షియానికి ఆరు నెలల గడువు ఇచ్చింది.

Published : 13 Jan 2023 21:15 IST

దిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యాన్ని జలాన్‌-కర్లాక్‌ కన్సార్షియానికి (JKC) బదిలీ చేసేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) అనుమతిచ్చింది. ఈ మేరకు ట్రైబ్యునల్‌ ముంబయి బెంచ్‌ శుక్రవారం తీర్పు వెలువరించింది. రుణదాతలకు చెల్లింపులు చేసేందుకు జేకేసీకి మరో ఆరు నెలల గడువు ఇచ్చింది. ఇందుకు నవంబర్‌ 16ను ఎఫెక్ట్‌ డేట్‌గా నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.150 కోట్ల విలువైన బ్యాంకు గ్యారెంటీలను కన్సార్షియం రుణ దాతలకు సమర్పించాలి. అలాగే రుణ ప్రణాళిక కింద ఆరు నెలల్లోపు రూ.185 కోట్లు రుణ దాతలకు చెల్లించాలి.

ఆర్థికంగా కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లగా.. జలాన్- కర్లాక్‌ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. అయితే, కన్సార్షియానికి, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ అప్పగింత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ తాజాగా కన్సార్షియం ఎన్‌సీఎల్‌టీని కోరింది. దీంతో కన్సార్షియానికి ఊరటనిస్తూ ఆరు నెలల అదనపు గడువును ఇచ్చింది. గతంలో చెల్లింపుల గడువును 2022 నవంబర్‌ 16గా పేర్కొంది. ఇప్పుడు అదే తేదీని ఎఫెక్ట్‌ డేట్‌గా పేర్కొంటూ అదనపు గడువుకు అనుమతిచ్చింది. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా స్టే ఇవ్వాలని రుణదాతల తరఫు న్యాయవాది కోరగా.. అందుకు ట్రైబ్యునల్‌ నిరాకరించింది. మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌ను మళ్లీ ప్రారంభించేందకు కావాల్సిన అన్ని అనుమతులనూ డీజీసీఏ నుంచి ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ పొందింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని