ఎన్ఈఎఫ్టీ vs ఆర్టీజీఎస్ vs ఐఎంపీఎస్

సాధారణంగా బ్యాంకులను సందర్శించేటప్పుడు లేదా ఇతరులకు డబ్బు పంపాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి పదాలను వింటూ ఉంటాం. కానీ ఈ మూడు పదాలు వాస్తవానికి భిన్నమైనవి. అలాగే ఉపయోగం, యంత్రాంగం పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. కావున ఈ మూడు ఎలా వేర్వేరుగా ఉంటాయో తెలుసుకుందాం. కానీ తెలుసుకునే ..

Published : 16 Dec 2020 18:22 IST

సాధారణంగా బ్యాంకులను సందర్శించేటప్పుడు లేదా ఇతరులకు డబ్బు పంపాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి పదాలను వింటూ ఉంటాం. కానీ ఈ మూడు పదాలు వాస్తవానికి భిన్నమైనవి. అలాగే ఉపయోగం, యంత్రాంగం పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. కావున ఈ మూడు ఎలా వేర్వేరుగా ఉంటాయో తెలుసుకుందాం. కానీ తెలుసుకునే ముందు ఈ మూడింటి మధ్య కామన్ గా ఉండే వాటి గురించి మొదట తెలుసుకోవాలి. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అనేవి బ్యాంకింగ్ కు సంబంధించిన పదాలు. వీటిని రెండు వేర్వేరు బ్యాంకులు చెందిన రెండు వేర్వేరు ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు. మొదటగా, వాటిలో ఒక్కొక్కదాన్ని తీసుకుని వాటి లక్షణాలను అర్థం చేసుకుందాం. తరువాత, మూడింటిని ఒకదానితో ఒకటి పోల్చి చూద్దాం. ఇలా చేయడం ద్వారా ఎన్ఈఎఫ్టీ vs ఆర్టీజీఎస్ vs ఐఎంపీఎస్ మధ్య వ్యత్యాసం, బదిలీ పరిమితి, ఛార్జీలు, సమయ వేళల గురించి మంచి అవగాహన పొందవచ్చు.

ఎన్ఈఎఫ్టీ - అర్ధం, పని వేళలు, పరిమితులు, ఫీచర్స్ ?

ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ఢిల్లీలోని ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతను తన తల్లికి డబ్బు పంపించాల్సిన అవసరం ఉంది. అతని బ్యాంకు ఖాతా హైదరాబాద్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. అయితే అతని తల్లికి విజయవాడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఖాతా ఉంది. అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు వెళ్లి, ఎన్ఈఎఫ్టీ ద్వారా రూ. 50,000 బదిలీ చేయాల్సిందిగా కోరతాడు. అప్పుడు కౌంటర్లో ఉన్న గుమాస్తా అతనికి ఒక రసీదు ఇచ్చి, ఒక గంటలో మీ అమ్మగారి బ్యాంకు ఖాతాకు నగదు చేరుతుందని చెబుతాడు. ఎన్ఈఎఫ్టీ అనగా నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్ఫర్. దీనిని ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.

ఎన్ఈఎఫ్టీ పని వేళలు:

ఎన్ఈఎఫ్టీ లావాదేవి రియల్ టైంలో కాకుండా బ్యాచ్లలో జరుగుతుంది. ఇక ఎన్ఈఎఫ్టీ పని వేళల విషయానికి వస్తే, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు (రెండు, నాల్గవ శనివారాలు మినహా) నగదు బదిలీ చేసుకోవచ్చు. రోజులో మొత్తం 12 బ్యాచ్ లు ఉంటాయి. ఆన్ లైన్ వయా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా ఎన్ఈఎఫ్టీ చేయవచ్చు.

ఎన్ఈఎఫ్టీ పరిమితులు:

ఎన్ఈఎఫ్టీ ద్వారా కనిష్ట బదిలీ మొత్తం రూ. 1, అలాగే గరిష్ట పరిమితి లేదు.

కింద తెలిపిన మొత్తం ఆధారంగా ఎన్ఈఎఫ్టీ ఛార్జీలను విధిస్తారు:

t1.png

ఎన్ఈఎఫ్టీ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు:

ఎన్ఈఎఫ్టీ చెల్లింపును మధ్యలో ఆపవచ్చా?
లబ్ధిదారుడి ఖాతాలోకి వచ్చిన మొత్తాన్ని వెంటనే చెల్లింపుదారుడి ఖాతా నుంచి తీసివేస్తారు. అందువలన ఎన్ఈఎఫ్టీ చెల్లింపును ఆపడం కుదరదు. అయితే, ఒకవేళ లబ్దిదారుడి ఖాతా నెంబర్ తప్పుగా ఉన్నా లేదా నిలిపివేసిన ఖాతాకు చెందినది అయినట్లయితే, పంపినవారి ఖాతాకు తిరిగి క్రెడిట్ అవుతుంది.

ఎన్ఈఎఫ్టీ కోసం చెక్ అవసరమా?
సాధారణంగా ఎన్ఈఎఫ్టీ కోసం ఒక చెక్కు అవసరమవుతుంది, కానీ రూ. 50,000 వరకు విలువగల లావాదేవీలకు ఇది తప్పనిసరి కాదు. అలాగే రూ. 50,000 వరకు నగదు చెల్లింపులు చేయవచ్చు. మీ ఐడీ ప్రూఫ్, ఇతర సంప్రదింపు సమాచారాన్ని బ్యాంకు ఎన్ఈఎఫ్టీ ఫారంతో పాటుగా జత చేస్తారు.

అయితే, మీరు ఎన్ఈఎఫ్టీ లావాదేవీ చేయడానికి నెట్ బ్యాంకింగ్ సర్వీసును ఎల్లప్పుడూ ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ మీరు ఎలాంటి చెక్కును సమర్పించాల్సిన అవసరం లేదు.

ఎన్ఈఎఫ్టీ ద్వారా డబ్బును బదిలీ చేయడానికి ఎంత సమయం పడుతుంది?
ఎన్ఈఎఫ్టీ లావాదేవీలు అరగంట బ్యాచ్ లో చేసినప్పుడు, మనం చెల్లించిన వ్యక్తి బ్యాంకు ఖాతాలో నగదు క్రెడిట్ అవడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఇది ఆర్బీఐ సిఫార్సు చేసిన సమయ పరిమితి.

ఆదివారం ఎన్ఈఎఫ్టీ ద్వారా లావాదేవీలు చేయవచ్చా?
ఆదివారం ఎన్ఈఎఫ్టీ ద్వారా లావాదేవీలు చేయడం కుదరదు. ఎన్ఈఎఫ్టీ ని కేవలం పని దినాలలో మాత్రమే చేయగలం. అందునా ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మాత్రమే లావాదేవీలు చేయడం వీలవుతుంది.

ఆర్టీజీఎస్:

రాహుల్ హైదరాబాద్ లో ఒక వ్యాపారవేత్త, అతను ముంబై నుంచి సరుకు తెప్పించి ఇక్కడ విక్రయిస్తూ ఉంటాడు. ఒకసారి రాహుల్ కు సరుకును సరఫరా చేసే వ్యక్తికి నగదు కొరత ఉండడంతో ఆర్డర్ ప్రాసెస్ చేయడానికి రాహుల్ అతనికి రూ. 3 లక్షల నగదును ముందుగా చెల్లించాల్సి వచ్చింది. కానీ అతను కేవలం 15 నిమిషాల్లోనే నగదును పంపిల్సి వచ్చింది.

ఎన్ఈఎఫ్టీ ద్వారా నగదు బదిలీ చేస్తే రెండు గంటల సమయం పడుతుందని రాహుల్ కి తెలుసు. దీంతో రాహుల్ బ్యాంకుకి వెళ్లి, తన ఖాతా నుంచి సరకు సరఫరాదారుడి ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయాలని బ్యాంకు మేనేజర్ ను కోరతాడు. దీంతో డబ్బు వెంటనే బదిలీ అయ్యి, రాహుల్ సమస్య పరిస్కారం అవుతుంది.

ఆర్టీజీఎస్ అనగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. పేరు సూచించినట్లుగా, ఇతర ఖాతాలకు నిధులు రియల్ టైంలో బదిలీ అవుతాయి. కావున ఎన్ఈఎఫ్టీ మాదిరిగా రెండు గంటల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

ఆర్టీజీఎస్ ఫీచర్స్:

  • ఆర్టీజీఎస్ ఫండ్ బదిలీ రియల్ టైంలో జరుగుతుంది. దీని అర్ధం నిధుల బదిలీ తక్షణమే జరుగుతుంది.

  • ఆర్టీజీఎస్ సమయ వేళలు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు (రెండు, నాల్గవ శనివారాలు మినహా).

  • ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయాల్సిన కనీస మొత్తం రూ. 2,00,000. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు.

  • మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా శాఖను సందర్శించడం ద్వారా ఆర్టీజీఎస్ చేయవచ్చు.

ఆర్టీజీఎస్ చార్జీలు:

t2.png

ఆర్టీజీఎస్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

ఆర్టీజీఎస్ కోసం చెక్కు సమర్పించాలా?
అవును. బ్యాంక్ శాఖను సందర్శించి, ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయడానికి చెక్కు తప్పనిసరి.

ఒకవేళ మీరు ఆన్ లైన్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే ఆర్టీజీఎస్ కు చెక్కు అవసరం లేదు.

ఆన్ లైన్ ద్వారా ఆర్టీజీఎస్ చేయవచ్చా?
అవును, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్టీజీఎస్ చేయవచ్చు.

ఆర్టీజీఎస్ ద్వారా బదిలీకి ఎంత సమయం పడుతుంది?
దీని ద్వారా తక్షణమే నగదు బదిలీ అవుతుంది.

ఐఎంపీఎస్ అర్థం, చార్జీలు, ఫీచర్లు?
ఒక రోజు రాత్రి 2:00 గంటల సమయంలో సంతోష్ నైట్ క్లబ్ లో ఉంటాడు. అతని బ్యాంకు ఖాతాలో తక్కువ బ్యాలెన్స్ ఉండడంతో అతని కార్డు నిరాకరణకు గురవుతుంది. అప్పుడు అతనికి అర్జెంట్ గా డబ్బు అవసరం అవుతుంది. వెంటనే సంతోష్ తన స్నేహితుడు రాఘవ్ కు కాల్ చేశాడు. రాఘవ్ హైదరాబాద్ లో ఉన్నాడు. సంతోష్ ముంబైలో నివసిస్తుండడం వలన రాఘవ్ తన వద్దకు వెళ్ళలేడు. తన స్నేహితుడికి సహాయం చేయడానికి, రాఘవ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని ఉపయోగించి ఐఎంపీఎస్ ద్వారా సంతోష్ కు నగదును బదిలీ చేస్తాడు. వెంటనే సంతోష్ ఖాతాలోకి నగదు బదిలీ అవడంతో బిల్లు చెల్లిస్తాడు.

ఐఎంపీఎస్ అనగా ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్. రియల్ టైమ్ ఫండ్ బదిలీకి ఇది ఉపయోగపడుతుంది. సెలవు దినాలతో, బ్యాంకింగ్ సమాయంతో నిమిత్తం లేకుండా 24*7 దీనిని ఉపయోగించవచ్చు.

ఐఎంపీఎస్ ఎలా పని చేస్తుంది?
ఐఎంపీఎస్ బ్యాంకు ఖాతాల మధ్య రియల్ టైమ్ ఫండ్ బదిలీని అనుమతిస్తుంది. అనగా బ్యాంకు పని వేళలు లేదా సెలవు దినాలతో సంబంధం లేకుండా మీరు నిధులను బదిలీ చేయవచ్చు. అలాగే మీరు ఏటీఎం, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్, బ్యాంకు బ్రాంచ్, యూఎస్ఎస్డీ వంటి వివిధ ఛానెళ్ల ద్వారా ఐఎంపీఎస్ ను ఉపయోగించుకోవచ్చు.

ఐఎంపీఎస్ ఛార్జీలు:
ప్రతి ఐఎంపీఎస్ లావాదేవికి కింద తెలిపిన విధంగా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

t3.png

  • ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఐఎంపీఎస్ కోసం వివిధ బ్యాంకులు వేర్వేరు ఛార్జీలను వసూలు చేస్తాయి. పైన తెలిపిన చార్జీలు ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించినవి.

ఐఎంపీఎస్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు:

ఒకవేళ వ్యక్తి నుంచి వ్యక్తికి నగదు బదిలీ చేస్తే, మీరు ఈ కింది మూడు వివరాలను తెలుసుకోవాలి

మీరు డబ్బు పంపే వ్యక్తి ఎంఎంఐడీ, వారి పేరు, వారి మొబైల్ నంబర్.

ఒక వ్యక్తి నుంచి ఖాతాకు నగదు బదిలీ చేయడానికి మీకు కింది వివరాలు అవసరం

లబ్ధిదారుడి పేరు, లబ్దిదారుడి ఖాతా సంఖ్య, లబ్దిదారుడి బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్

ఎంఎంఐడీ అంటే ఏమిటి?
ఎంఎంఐడీ అనగా మొబైల్ మనీ ఐడెంటిఫికేషన్ నంబర్, ఇది లబ్దిదారుని వివరాలని ప్రతిబింబించే ఏడు అంకెల సంఖ్య. ఏడు అంకెలలోని మొదటి నాలుగు అంకెలు ఐఎంపీఎస్ ను అందించే బ్యాంకు ప్రత్యేక గుర్తింపు కోడ్ ను సూచిస్తాయి.

ఐఎంపీఎస్ పని వేళలు ఏమిటి?
ఐఎంపీఎస్ పని వేళలు - సేవలు దినాలతో సంబంధం లేకుండా 24*7 పని చేస్తాయి.

మీరు ఐఎంపీఎస్ ద్వారా బదిలీ చేసే గరిష్ట మొత్తం ఎంత?
ఖాతా సంఖ్య ను ఉపయోగించి బదిలీ చేసినట్లయితే, ఒకేసారి రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదును బదిలీ చేయలేరు.

ఎంఎంఐడీని, నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించి ఐఎంపీఎస్ ద్వారా ఒక ఖాతాదారుడు రోజుకు రూ. 5000 మాత్రమే బదిలీ చేయగలడు.

ఐఎంపీఎస్ ద్వారా బదిలీ చేయడానికి ఎంత సమయం పడుతుంది?
ఐఎంపీఎస్ అనేది రియల్ టైమ్ నగదు బదిలీ కావున వెంటనే బదిలీ అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని