Petrol Price: ఏపీ, తెలంగాణ సహా ఆ 6 రాష్ట్రాల్లోనే పెట్రో ధరలెక్కువ: కేంద్రం

Petrol Price: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ భారం సామాన్యులపై పడకుండా సర్కార్‌ చర్యలు తీసుకుందని మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎక్సైజ్‌ సుంకం తగ్గించగా.. భాజపాయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ తగ్గించలేదన్నారు.

Updated : 15 Dec 2022 15:33 IST

దిల్లీ: దేశంలో భాజపాయేతర పార్టీలు పాలిస్తున్న ఆరు రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ (VAT) తగ్గించలేదని కేంద్రం తెలిపింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol, Diesel Prices) అధికంగా ఉన్నాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, ఝార్ఖండ్‌లో వ్యాట్‌ (VAT) తగ్గించలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ (Hardeep Singh Puri) గురువారం లోక్‌సభలో తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినట్లు హర్దీప్‌ సింగ్‌ (Hardeep Singh Puri) గుర్తుచేశారు. దీనికి కొనసాగింపుగా కొన్ని రాష్ట్రాలు ప్రజలపై భారం తగ్గించడం కోసం వ్యాట్‌ (VAT)ను సైతం తగ్గించాయని తెలిపారు. లోక్‌సభలో మంత్రి ఈ ప్రకటన చేస్తుండగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చౌకగా పెట్రోల్‌ లభిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ ఒకటని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు (Crude Oil Price) భారీగా పెరగడం వల్ల దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రూ.27,276 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ (VAT)ను తగ్గించేందుకు ఒప్పించాలని ప్రతిపక్ష పార్టీల లోక్‌సభ సభ్యులను హర్దీప్‌ సింగ్‌ (Hardeep Singh Puri) కోరారు. భారత చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలకు అనుగణంగానే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol, Diesel Prices) ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వినియోగదారులకు విక్రయించే ధరలో చమురు కొనుగోలు ఖర్చు, మారకపు రేటు, రవాణా వ్యయం, రిఫైనరీ మార్జిన్‌, డీలర్‌ కమిషన్‌, కేంద్ర ప్రభుత్వ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్‌ వంటివన్నీ భాగమై ఉంటాయన్నారు.

2020 నవంబరు నుంచి 2022 నవంబరు మధ్య భారత్‌ కొనుగోలు చేసిన చమురు ధర సగటున 102 శాతం పెరిగినట్లు హర్దీప్‌ సింగ్‌ (Hardeep Singh Puri)  తెలిపారు. అదే సమయంలో దేశీయంగా పెట్రోల్‌ రిటైల్‌ ధర 18.95 శాతం, డీజిల్‌ ధర 26.5 శాతం మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌ 6 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని సవరించలేదని హర్దీప్‌ సింగ్‌ లోక్‌సభకు తెలిపారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీలు రూ.27,276 కోట్ల నష్టాల్ని చవిచూసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల ప్రభావం సామాన్యులపై ఉండొద్దనే కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని