Nykaa: నైకా సీఎఫ్‌వో అర్వింద్‌ అగర్వాల్‌ రాజీనామా!

నైకా సీఎఫ్‌వో పదవికి అర్వింద్ అగర్వాల్‌ రాజీనామా చేశారు. కంపెనీ లాభాదాయక స్టార్టప్‌గా మారడంలో ఆయన కీలకపాత్ర పోషించారని నైకా ఛైర్‌పర్సన్‌ ఫల్గుడి నాయర్ అన్నారు. 

Published : 23 Nov 2022 00:18 IST

ముంబయి:  సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల సంస్థ నైకా చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) అర్వింద్‌ అగర్వాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఎస్‌ఎన్‌  ఈ-కామర్స్‌ వెంచర్స్‌ స్టాక్ ఎక్సేంజ్‌ ఫైలింగ్‌లో అర్వింద్ రాజీనామా చేసినట్లు పేర్కొంది. నవంబరు 25న ఆయన కంపెనీ నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే కొత్త సీఎఫ్‌వో నియమిస్తామని ఎఫ్‌ఎస్‌ఎన్‌ తెలిపింది. అర్వింద్ జులై 2020లో నైకా సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన, ఇతర స్టార్టప్‌ల నుంచి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైకా సీఎఫ్‌వో పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. 

నైకా లాభాదాయక స్టార్టప్‌గా మారడంలో అర్వింద్‌ కీలకపాత్ర పోషించారని కంపెనీ ఛైర్‌పర్సన్‌ ఫల్గుణి నాయర్‌ అన్నారు. ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ-కామర్స్‌లోకి అడుగుపెట్టకముందు అర్వింద్‌ అగర్వాల్‌ మూడేళ్లపాటు అమెజాన్‌లో ఎఫ్‌పీ అండ్‌ ఏ బిజినెస్ కంట్రోలర్‌గా సేవలందించారు. అంతకముందు వోడాఫోన్ ఇండియాలో ఐదేళ్లపాటు పనిచేశారు. తాజాగా నైకా సీఎఫ్‌వో పదవికి రాజీనామా చేసిన ఆయన డిజిటల్‌ ఎకానమీ స్టార్టప్‌లో చేరనున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని