Ola Cabs: అంతర్జాతీయ మార్కెట్లకు ఓలా గుడ్‌బై.. భారత్‌ మీదే ఫోకస్‌!

అంతర్జాతీయ మార్కెట్లకు ఓలా క్యాబ్స్‌ గుడ్‌బై చెప్పింది. ఇతర దేశాల్లో తన కార్యకలాపాలను ఈ నెలాఖరు నుంచి నిలిపివేయనుంది.

Published : 09 Apr 2024 16:25 IST

Ola Cabs | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా క్యాబ్స్‌ (Ola cabs) కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల్లోని తన కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు కల్లా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఉన్న తన వ్యాపారాన్ని మూసివేయనుంది. ఇప్పటికే యూజర్లకు నోటిఫికేషన్లు పంపుతోంది. ఆయా దేశాల్లో ఎదురవుతున్న పోటీ, ఫ్లీట్‌ను పూర్తిగా విద్యుదీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా భారత్‌ మార్కెట్‌పైనే ఓలా దృష్టి పెట్టనుంది.

తమ ప్రాధాన్యాలను సమీక్షించుకున్నాక యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని తమ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వ్యక్తిగత వాహన విభాగంతో పాటు క్యాబ్‌ సేవల విభాగంలోనూ విద్యుత్‌ వాహనాలదే భవిష్యత్‌ అని పేర్కొన్నారు. భారత్‌లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి ఉద్యోగులకు త్వరలో ఉద్వాసన పలికే అవకాశం ఉంది.

నెట్‌వర్క్‌ లేకున్నా ఫోన్‌ కనిపెట్టేయొచ్చు.. ఫైండ్‌ మై డివైజ్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన గూగుల్‌

క్యాబ్‌ సర్వీసులందించేందుకు పూర్తిగా విద్యుత్‌ వాహనాలనే వినియోగించాలంటూ ప్రభుత్వాల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న క్యాబ్‌లను ఈవీలుగా మార్చాలంటే ఓలా రెట్టింపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనికితోడు ఆస్ట్రేలియా, యూకేలో పోటీ కూడా అధికంగా ఉండడంతో ఓలా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఓలా బ్రాండ్‌పై ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ సంస్థ   ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ ఏకీకృత నికర నష్టం 49.2 శాతం క్షీణించి రూ.772 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది నష్టం రూ.1,522 కోట్లుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని