GST on paratha: చపాతీ వేరు పరోటా వేరు.. 18 శాతం జీఎస్‌టీ కట్టాల్సిందే

‘చపాతీ/రోటీ వేరు.. పరోటా వేరు. కాబట్టి 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందే అంటూ గుజరాత్‌ అప్పీలేట్‌ అథారిటీ స్పష్టంచేసింది.

Published : 14 Oct 2022 20:31 IST

దిల్లీ: ‘‘చపాతీ/రోటీ వేరు.. పరోటా వేరు. పరోటాను వినియోగించే ముందు దానికి కొంత ప్రాసిసెంగ్‌ అవసరం. అలానే పరోటా తయారీలో పిండితో పాటు కొన్ని ఇతర పదార్థాలనూ వినియోగిస్తారు. కాబట్టి 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందే’’ అంటూ గుజరాత్‌ అప్పీలేట్‌ అథారిటీ స్పష్టంచేసింది. తమ కంపెనీ తయారు చేసే పరోటాలపై 18 జీఎస్టీని విధించడంపై వాదిలాల్‌ అనే కంపెనీ అప్పీలేట్‌ అథారిటీని ఆశ్రయించగా.. ఈ మేరకు తీర్పు వెలువరించింది.

గుజరాత్‌కు చెందిన వాదిలాల్‌ ఇండస్ట్రీస్‌ వివిధ రకాల పరోటాలను తయారు చేస్తోంది. అయితే ఈ పరోటాలు చపాతీ, రోటీనే మాదిరి కాదని, తినడానికి సిద్ధంగా ఉన్న ఈ పరోటాలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని గుజరాత్‌ అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (AAR) 2021లో తీర్పు వెలువరించింది. దీనిపై ఆ కంపెనీ అప్పీలేట్‌ అథారిటీని ఆశ్రయించింది. ఏఏఆర్‌ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తాజాగా అప్పీలేట్‌ అథారిటీ  తీర్పు వెలువరించింది. అయితే చపాతీ, రోటీ వ్యవహారం ఇదే కొత్తది కాదు. గతంలో ఏఏఆర్‌ కర్ణాటక బెంచ్‌ సైతం ఇలాంటి తీర్పునే వెలువరించింది. బెంగళూరుకు చెందిన ఐడీ ఫ్రెడ్‌ ఫుడ్స్‌ తయారు చేసే ఫ్రొజెన్‌ పరోటాల విషయంలోనూ 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్పు వెలువరించింది. దీంతో అప్పట్లో మీమ్స్‌ వరద పారింది. తాజాగా గుజరాత్‌ అప్పీలేట్‌ ఇచ్చిన తాజా తీర్పుపైనా సోషల్‌ మీడియాలో మరోసారి మీమ్స్‌ ట్రెండ్‌ అవుతున్నాయి.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని