Passenger Vehicles: చిప్‌ల కొరత ప్రభావం.. సెప్టెంబరులో వాహన విక్రయాల్లో పతనం!

వాహన ఉత్పత్తి పరిశ్రమపై సెమీ కండక్టర్లు, చిప్‌ల కొరత ప్రభావం కొనసాగుతూనే ఉంది! మరోవైపు విక్రయాలు మందగిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్‌ వెహికల్‌(పీవీ) సెగ్మెంట్‌

Published : 14 Oct 2021 23:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాహన ఉత్పత్తి పరిశ్రమపై సెమీ కండక్టర్లు, చిప్‌ల కొరత ప్రభావం కొనసాగుతూనే ఉంది! మరోవైపు విక్రయాలు మందగిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్‌ వెహికల్‌(పీవీ) సెగ్మెంట్‌ వాహనాల అమ్మకాల్లో భారీ పతనం నమోదైంది. ఈ సెగ్మెంట్‌లో గతేడాది సెప్టెంబరులో 2,72,027 వాహనాలు విక్రయించగా, ఈసారి కేవలం 1,60,070 మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, దాదాపు 41.15 శాతం తగ్గుదల నమోదైంది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌(సియామ్‌) గురువారం ఈ వివరాలు వెల్లడించింది. కార్ల విక్రయాల్లో అత్యధికంగా 60.82 శాతం పతనం కనిపించింది. గతేడాది సెప్టెంబరులో 1,63,981 కార్లు విక్రయించగా, ఈ సారి కేవలం 64,235 మాత్రమే అమ్మారు. యుటిలిటీ వెహికల్‌ సెగ్మెంట్‌లో 9.22 శాతం, వ్యాన్స్‌లో 28.89, ద్విచక్ర వాహనాల్లో 17.35 శాతం తగ్గుదల కనిపించింది. అన్ని కేటగిరీల వాహనాల అమ్మకాలు కలిపి చూస్తే 20 శాతం తగ్గింది.

సవాళ్లు కొనసాగుతున్నాయి..

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న చిప్‌ల కొరతతో ఉత్పత్తిపై ప్రభావం కనిపిస్తోంది. అయితే 2020 జూలై- సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే 2021లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2.07 శాతం పెరగడం కొంత ఊరట కలిగించే అంశం. ‘దేశ ఆటోమొబైల్ పరిశ్రమ కొత్త సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. ఒకవైపు డిమాండ్‌ ఉంది.. మరోవైపు సెమీకండక్టర్లు, చిప్‌ల కొరత ఆందోళన కలిగిస్తోంది. ముడి సరకుల ధరలు మండిపోతున్నాయి. దీంతో చాలా సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించాయి’ అని సియామ్ అధ్యక్షుడు కెనిచి అయుకవా అన్నారు. కొత్త మోడళ్ల విడుదలలోనూ ఆలస్యం అవుతోందని చెప్పారు. కానీ.. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని