Paytm: చైనా కంపెనీలకు డేటా లీక్‌?.. ఖండించిన పేటీఎం

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank)పై రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధించడం వెనుక సంచలన కారణాలు ఉన్నట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. చైనా

Updated : 14 Mar 2022 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank)పై రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధించడం వెనుక సంచలన కారణాలు ఉన్నట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. చైనా కంపెనీలకు డేటాను లీక్‌ చేసిందన్న ఆరోపణలతోనే ఆర్‌బీఐ ఆంక్షలు విధించినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఆరోపణలను పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖండించింది. అవన్నీ నిరాధారమంటూ ట్విటర్‌ వేదికగా పేర్కొంది. 

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఇటీవల తాత్కాలిక ఆంక్షలు విధించింది. కొత్త ఖాతాలను చేర్చుకోవడాన్ని తక్షణం నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ వ్యవస్థపై ఆడిట్‌ నిర్వహించేందుకు ఓ ఐటీ ఆడిట్‌ సంస్థను నియమించుకోవాలని సూచించింది. బ్యాంకులో పర్యవేక్షణ లోపాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆర్‌బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది.

అయితే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు చెందిన కంపెనీ సర్వర్లు.. చైనాకు చెందిన కంపెనీలకు డేటాను షేర్‌ చేశాయని ఇటీవల ఆర్‌బీఐ జరిపిన వార్షిక తనిఖీల్లో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు సదరు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ చైనా కంపెనీలకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో పరోక్షంగా వాటాలు కూడా ఉన్నట్లు తెలిపాయి. ఈ కారణం వల్లే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినట్లు ఆ కథనాలు వెల్లడించాయి. 

అయితే ఈ ఆరోపణలను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖండించింది. ‘‘చైనా సంస్థలకు డేటా లీక్‌ అంటూ వస్తోన్న కథనాలు నిరాధారం. సంచలనాల కోసం ఇలాంటి కథనాలు వస్తున్నాయి. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ పూర్తిగా స్వదేశీ బ్యాంక్‌ అయినందుకు గర్విస్తున్నాం. డేటా లోకలైజేషన్‌పై మేం పూర్తిగా ఆర్‌బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం. మా బ్యాంక్‌కు సంబంధించిన డేటా మొత్తం భారత్‌లోనే ఉంది’’ అని కంపెనీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

మరోవైపు ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో నేటి స్టాక్‌ ఎక్స్ఛేంజీ ట్రేడింగ్‌లో పేటీఎం షేర్లు దారుణంగా పడిపోయాయి. షేరు విలువ 13శాతానికి పైగా పడిపోయింది.  2016 ఆగస్టులో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాటైంది. 2017 మేలో నొయిడాలో శాఖతో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఆర్‌బీఐ ఆంక్షలను పేటీఎం ఎదుర్కోవడం మూడోసారి కాగా, కొత్తఖాతాలు ప్రారంభించవద్దనడం రెండోసారి కావడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని