Health Insuarnce: ‘ఇంట్లో చికిత్స’కూ ఉండాలి బీమా..లేదంటే బదిలీ ఆప్షన్‌ ఉందిగా!

ఆరోగ్య బీమా పాలసీలను పోర్టబిలిటీ చేసుకునే సౌకర్యం రావడం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది...

Updated : 15 Mar 2022 13:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా పాలసీలను పోర్టబిలిటీ చేసుకునే సౌకర్యం రావడం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. పాలసీబజార్‌ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో.. చాలా మంది ప్రజలు తమ పాలసీలను బదిలీ చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాలసీతో సంతృప్తి చెందనట్లయితే.. వెంటనే పోర్టబిలిటీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. మెరుగైన ఫీచర్లు, అధిక బీమా కవర్‌ నిమిత్తం చాలా మంది బదిలీ అవుతున్నట్లు తేలింది.

ఈ ఫీచర్లు ఉంటే ఉత్తమం..

పాలసీబజార్ నిర్వహించిన సర్వేలో 63 శాతం మంది అధిక బీమా హామీ మొత్తం, తక్కువ ప్రీమియం కోసమే పాలసీని బదిలీ చేసుకున్నట్లు తెలిపారు. మరో 37 శాతం మంది మెరుగైన ఫీచర్లు, సర్వీసుల కోసం మారినట్లు వివరించారు. సరైన ఫీచర్లను పరిశీలించి బదిలీ కావడం ముఖ్యమైన విషయం. నగదురహిత హాస్పిటలైజేషన్‌, కన్జ్యూమబుల్స్ కవర్‌, నెట్‌వర్క్‌ హాస్పిటలైజేషన్‌, అంబులెన్స్‌ కవర్‌ వంటి కీలక ఫీచర్లు ఉన్న పాలసీలకు మారితేనే ప్రయోజనకరం. నగదురహిత హాస్పిటలైజేషన్‌ సౌకర్యం ఉంటే.. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో చికిత్సకు చేతి నుంచి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కన్జ్యూమబుల్స్ కవర్ ఉంటే పీపీఈ కిట్లు, మాస్కులు, చేతి తొడుగులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్ల వంటి వాటన్నింటికీ బీమా వర్తిస్తుంది. ఇక అంబులెన్స్‌ కవర్‌ ఉంటే.. ఎలాంటి నగదు చెల్లించకుండానే అంబులెన్స్‌ సేవల్ని పొందొచ్చు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ‘ఇంట్లో చికిత్స’ సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా మారబోతున్న పాలసీలో ‘హోం ట్రీట్‌మెంట్‌’ సదుపాయం కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఒకేరకమైన ఆరోగ్య బీమా పాలసీలకు మాత్రమే పోర్టబిలిటీ అవకాశం ఉంటుంది. అంటే బేసిక్‌ కవర్‌ నుంచి మరో బేసిక్‌ కవర్‌, ఒక టాపప్‌ ప్లాన్ నుంచి మరో టాపప్‌ ప్లాన్‌కు మాత్రమే పాలసీని బదిలీ చేసుకోగలరు.

అధిక హామీ మొత్తం..

టైర్‌-1 పట్టణాల్లో 54%, టైర్‌-2 పట్టణాల్లో 18%, టైర్‌-3 పట్టణాల్లో 28% మంది అధిక హామీ మొత్తం ఉన్న పాలసీలకు బదిలీ అయినట్లు సర్వేలో తేలింది. ఎంత మొత్తం కవర్‌ తీసుకోవాలనేది మనం నివసిస్తున్న ప్రాంతం, ఆసుపత్రుల సదుపాయం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. నగరాల్లో నివసిస్తున్నవారికి రూ.15 లక్షల కనీస పాలసీ సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఆర్థిక పరిస్థితులు సహకరిస్తే మరికొంత ఎక్కువ మొత్తానికి తీసుకున్నా ఫరవాలేదు. అధిక కవరేజీ ప్లాన్‌కు మారడానికి బదులు మరో ఆప్షన్‌ని కూడా వినియోగదారులు పరిశీలించొచ్చు. అదే బీమా సంస్థ లేదా ఇతర బీమా సంస్థల నుంచి సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ని కూడా కొనుగోలు చేయొచ్చు. రెండింటిలో లాభనష్టాలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి.

ప్రీమియంలో రాయితీ కావాలంటే..

పాలసీబజార్‌ సర్వేలో 68 శాతం మంది ‘మల్టీ ఇయర్‌ పాలసీ’ నుంచి ‘సింగిల్‌ ఇయర్‌ పాలసీ’కి బదిలీ అయ్యారు. మరో 28 శాతం మంది సింగిల్‌ నుంచి మల్టీ ఇయర్‌ పాలసీకి మారారు. ఒకేసారి రెండు, మూడేళ్లకు ప్రీమియం చెల్లిస్తే మీకు రాయితీ లభించే అవకాశం ఉంటుంది.

త్వరగా దరఖాస్తు చేసుకోవాలి..

పాలసీ గడువు ముగియడానికి 7 రోజుల ముందు 36%, 15 రోజుల ముందు 19%, 60 రోజుల ముందు 48% మంది బదిలీ అయినట్లు సర్వేలో తేలింది. అయితే, వీలైనంత త్వరగా బదిలీ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా మన దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించేందుకు బీమా సంస్థలకు సమయం ఉంటుంది.

చివరగా.. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీ మీ ప్రస్తుత అవసరాలకు సరిపోతుందో.. లేదో.. సమీక్షించుకోండి. లేదన్నదే మీ సమాధానం అయితే, మెరుగైన పాలసీకి బదిలీ కావడం ఉత్తమం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని