ఆ డిస్కమ్‌లతో లావాదేవీలు నిలిపివేయండి.. ఇంధన ఎక్స్ఛేంజీలకు కేంద్రం లేఖ!

జన్‌కోలకు బకాయిలు చెల్లించని డిస్కమ్‌లతో లావాదేవీలు నిలిపివేయాలని ఇంధన ఎక్స్ఛేంజీలకు కేంద్రం ఆదేశించింది.

Published : 19 Aug 2022 00:04 IST

దిల్లీ: జన్‌కోలకు బకాయిలు చెల్లించని డిస్కమ్‌లతో లావాదేవీలు నిలిపివేయాలని ఇంధన ఎక్స్ఛేంజీలను కేంద్రం ఆదేశించింది. 13 రాష్ట్రాల్లోని 27 డిస్కమ్‌లకు లావాదేవీలు నిలిపివేయాలని సూచించింది. ఈ మేరకు ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ (IEX), పవర్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (PXIL), హిందుస్థాన్‌ పవర్‌ ఎక్స్ఛేంజ్‌ (HPX)లకు ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలో గల ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (POSOCO) సూచించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన డిస్కమ్‌లు కూడా ఉన్నాయి.

ఆగస్టు 19 నుంచి లావాదేవీలు నిలిపివేయాలని ఇంధన ఎక్స్ఛేంజీలకు పోసోకో సూచించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. ప్రాప్తి పోర్టల్‌లో ఉన్న బకాయిల వివరాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన లేఖలో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో ఇంధన మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఎలక్ట్రిసిటీ రూల్స్‌, 2022 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం బకాయిలు, ఇతర ఛార్జీలు చెల్లించకపోతే ఆ డిస్కమ్‌లను లావాదేవీలు జరపకుండా నిషేధించొచ్చు. పోసోకో పేర్కొన్న 13 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, తమిళనాడు, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌కు చెందిన డిస్కమ్‌లూ ఉన్నాయి. సాధారణంగా విద్యుత్‌కు డిమాండు పెరిగినప్పుడు రోజూవారీ అవసరాలకు ఐఈఎక్స్‌లో డిస్కమ్‌లు విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని