పెట్టుబ‌డులు పెట్టేవారు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

చాలా మంది డ‌బ్బును పొదుపు చేయ‌డం కంటే పెట్టుబ‌డి పెడితేనే అధిక లాభాలు వ‌స్తాయ‌ని న‌మ్ముతున్నారు.

Updated : 24 Mar 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్టుబ‌డులు పెట్టేవారు త‌మ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అంత‌టినీ ఒకేసారి ఒకేచోట పెట్ట‌కూడ‌ద‌ని నిపుణుల మాట‌. షేర్ మార్కెట్‌లో ఒకే పోర్ట్‌ఫోలియోలో అస‌లు పెట్ట‌కూడ‌దు. మార్కెట్ ఎప్పుడు బాగా ప‌నిచేస్తుందో ఎవ‌రూ హామీ ఇవ్వ‌లేరు. కాబ‌ట్టి పోర్ట్‌ఫోలియో డైవ‌ర్సిఫికేష‌న్ ముఖ్యం. అయితే, చాలా మంది డ‌బ్బును పొదుపు చేయ‌డం కంటే పెట్టుబ‌డి పెడితేనే అధిక లాభాలు వ‌స్తాయ‌ని న‌మ్ముతున్నారు. ఇది నిజం కూడా. కొత్త పెట్టుబ‌డిదారుల‌కు ఆర్థిక ప్ర‌పంచం నిరుత్సాహంగా అనిపించ‌వ‌చ్చు. కానీ నిపుణుల సాయంతో మీ పెట్టుబ‌డి పోర్ట్‌ఫోలియోని నిర్మించుకోవాలి. అప్పుడే తెలివైన పెట్టుబ‌డి నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చు. మీ ల‌క్ష్యం నుంచి సాధార‌ణ అపోహ‌లను దూరం చేసుకోవ‌చ్చు.

పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు గుర్తుంచుకోవ‌ల‌సిన కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు ఏమిటంటే.. ఈక్విటీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించ‌డానికి స‌రైన స‌మ‌యమ‌నేది లేదు. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ‌రూ హామీ ఇవ్వ‌లేరు. అయితే, భార‌త్‌లో ధృఢ‌మైన కేంద్ర ప్ర‌భుత్వం, మంచి అంత‌ర్జాతీయ ప‌రిణామాలు ఉన్న‌ప్పుడు మార్కెట్ పెరిగిందే గానీ త‌గ్గ‌లేదు. ఒడుదొడుకులు కూడా త‌క్కువే ఉంటాయి. మీరు మార్కెట్‌పై మీ విశ్లేష‌ణ ఆధారంగా అంచ‌నాలు వేయ‌వ‌చ్చు గానీ మీరు మార్కెట్‌లోకి ఎప్పుడు ప్ర‌వేశించాలి? ఎప్పుడు నిష్క్ర‌మించాలి? అనేదానిపై అత్యంత అనుభ‌వ‌జ్ఞులైన మార్కెట్ స‌ల‌హాదారులు కూడా మీకు చెప్ప‌లేరు. మీరు పెట్టుబ‌డి పెట్టిన‌పుడు సంప‌ద సృష్టిని పెంచ‌డానికి దీర్ఘ‌కాలానికి పెట్టుబ‌డి పెట్ట‌డం మంచి ప‌ద్ధతి.

పెట్టుబ‌డులు వైవిధ్య‌భ‌రితంగా వివిధ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టాలి. అదే స‌మ‌యంలో వైవిధ్యం అర్థవంతంగా ఉండాలి. వైవిధ్యీక‌ర‌ణ ల‌క్ష్యం పోర్ట్‌ఫోలియోను ర‌క్షించ‌డం. మ‌రీ ఎక్కువ వైవిధ్యీక‌ర‌ణ రిస్క్‌ల త‌గ్గింపును భ‌ర్తీ చేయ‌డం కంటే రాబ‌డి త‌గ్గింపునకు దారితీయ‌వ‌చ్చు. సాధార‌ణ నియ‌మం ప్ర‌కారం.. క‌నీసం 3-4 ఆస్తి త‌ర‌గ‌తుల‌లో (ఈక్విటీ, స్థిర ఆదాయం, హైబ్రిడ్‌, గ్లోబ‌ల్ ఫండ్‌లు) పెట్టుబ‌డులు మంచి రాబ‌డిని ఇవ్వ‌డంలో ఉప‌యోగ‌ప‌డొచ్చు.

అధిక రిస్క్ తీసుకోవ‌డం వ‌ల్ల త‌మ‌కు అధిక రాబ‌డి ల‌భిస్తుంద‌ని కొందరు పెట్టుబ‌డిదారులు భావిస్తుంటారు. కానీ అది పూర్తిగా వాస్త‌వం కాదు. చాలా సార్లు త‌క్కువ రిస్క్ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా స‌హేతుక‌మైన రాబ‌డి వ‌స్తుంది. చిన్న న‌గ‌రాల నుంచి పెద్ద ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ఈ రోజుల్లో పెట్టుబ‌డిదారుల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు ఎక్కువే జ‌రుగుతున్నాయి. పెట్టుబ‌డులు పెట్టేవారు ఆన్‌లైన్‌లో వివిధ మార్కెట్ విష‌యాల‌ను అధ్యయ‌నం చేయ‌డం కూడా మంచిదే. ఈ మ‌ధ్య‌న పెట్టుబ‌డిదారులు.. రిస్క్‌, పెట్టుబ‌డి, రాబ‌డి లాంటి విష‌యాల‌ను అర్థం చేసుకోవ‌డం ప్రారంభించారు.

త‌క్కువ వ్య‌వ‌ధిలో విప‌రీత లాభాల‌ను ఆశించి సెక్యూరిటీల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం అనేది కొంత మంది చేసే అత్యంత ప్ర‌మాద‌క‌ర విష‌యాల్లో ఒక‌టి. దీర్ఘ‌కాలం నాణ్య‌త‌, వృద్ధిని హామినిచ్చే కంపెనీల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచి విధానం. నాణ్య‌మైన పెట్టుబ‌డి అనేది లాభ‌దాయ‌క‌మైన వ్యాపారాల‌ను గుర్తించి రాబ‌డిని పెంచుతుంది.

మీ రిస్క్ ప్రొఫైల్‌, పెట్టుబ‌డి ల‌క్ష్యాలు, కార్ప‌స్, వ‌యస్సు మొద‌లైన వాటిపై ఆధార‌ప‌డి, మీరు ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌, భౌతిక ఆస్తుల‌లో ఎంతెంత నిష్ప‌త్తిలో పెట్టుబ‌డి పెట్టాలో నిర్ణ‌యించుకోవాలి. ఇది రాబ‌డిని ఇవ్వ‌డంలో స‌హాయ‌ప‌డ‌ట‌మే కాకుండా మార్కెట్ సైకిల్స్‌లో వివిధ ఆస్తి త‌ర‌గ‌తుల‌లో విభిన్నంగా ప్ర‌తిస్పందిస్తుంది. కాబ‌ట్టి రిస్క్‌ను కూడా త‌గ్గిస్తుంది. అన్నిటిక‌న్నా ముఖ్యం పెట్టుబ‌డిదారులు త‌మ పెట్టుబ‌డుల‌పై సొంత బాధ్య‌త‌ను తీసుకోవ‌డం అత్యంత కీల‌క‌మైన విష‌యం అని గుర్తించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని