Recession: అమెరికాలో ఆర్థిక మాంద్యం అనివార్యమేమీ కాదు: బైడెన్‌

అమెరికాలో ఆర్థిక మాంద్యం అనివార్యమని వస్తున్న విశ్లేషణలను తాను విశ్వసించడం లేదని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు....

Published : 23 May 2022 18:34 IST

టోక్యో: అమెరికాలో ఆర్థిక మాంద్యం అనివార్యమని వస్తున్న విశ్లేషణలను తాను విశ్వసించడం లేదని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఎగబాకినప్పటికీ.. మాంద్యం పరిస్థితులు తలెత్తుతాయని తాను భావించడం లేదన్నారు. ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ వార్షిక సమావేశం కోసం టోక్యో వెళ్లిన ఆయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

అన్ని దేశాలలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోందని బైడెన్‌ అన్నారు. కానీ, వాటి ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే తమ దేశంపై తక్కువే ఉంటుందన్నారు. సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు, అధిక ఇంధన ధరల వల్ల అమెరికా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి ఉపశమనం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కానీ, ఇలాంటి సమస్యలకు సత్వర పరిష్కారాలేమీ ఉండవని వ్యాఖ్యానించారు. కొంత సమయం వేచి చూడాల్సిందేనన్నారు.

అమెరికా మాంద్యం బారిన పడటానికి అధిక అవకాశాలున్నాయని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ సీనియర్‌ ఛైర్మన్‌ లాయిడ్‌ బ్లాంక్‌ఫిన్‌ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం మెడలు వంచే శక్తిమంత ఆయుధాలు ఫెడరల్‌ రిజర్వ్‌ వద్ద ఉన్నాయన్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ ఇపుడు సరిగ్గానే స్పందిస్తోందని చెప్పారు. అమెరికా వినియోగదార్ల సెంటిమెంటు 2011 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయులకు ఈ నెలలో చేరింది. ఏప్రిల్‌లో వినియోగ ధరలు 8.3 శాతం పెరిగాయి. మార్చితో పోలిస్తే ధరల పెరుగుదలలో వేగం కాస్త తగ్గినా.. దశాబ్దాల్లోనే అత్యంత వేగంగా ధరలు అధికమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని