రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి?

ఆర్‌బీఐ ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌లో ప్రధానంగా నాలుగు రేట్ల ప్ర‌స్తావ‌న వ‌స్తుంటుంది..

Published : 15 Dec 2020 20:34 IST

రిజర్వ్ బ్యాంకు నియంత్రణలో ఉండే వడ్డీ రేట్లను దేశంలో న‌గ‌దు చలామణిని అదుపులో ఉంచడానికి ఉపయోగిస్తారు. అందుకే ద్రవ్య ప‌ర‌ప‌తి విధాన సమీక్ష జరిగినప్పుడల్లా ఏదో ఒక రేటు తగ్గించామనో, పెంచామనో లేదా పాతదే కొనసాగిస్తున్నామనో ప్ర‌క‌టిస్తుంటారు. ఆర్‌బీఐ ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌లో ప్రధానంగా నాలుగు రేట్ల ప్ర‌స్తావ‌న వ‌స్తుంటుంది. వాటి గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

రేపో రేటు

ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేపో రేటును నిర్ణయిస్తారు. రేపో రేటున‌ను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు త‌క్కువ‌కే రుణాలు వ‌స్తాయి. ఈ ప్ర‌భావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రేపో రేటు తగ్గించినా దానిని సామాన్యుల‌కు బ‌ద‌లాయించేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు. ఇందుకు బ‌దులుగా ఆదాయం పెంచుకోవాలని చూస్తాయి.

రివర్స్ రేపో రేటు:

బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వొచ్చు. అలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్‌బీఐకి చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రేపో రేటు అంటారు. ఇది రెపో రేటు క‌న్నా తక్కువగా ఉంటుంది.

మార్కెట్లో స్థిరత్వం లేన‌ప్పుడు బ్యాంకులు తమ అదనపు డబ్బును ఆర్‌బీఐ వ‌ద్ద ఉంచి త‌క్కువైనా స‌రే స్థిర‌ వడ్డీ ఆదాయాన్ని పొందేందుకు ఆస‌క్తి చూపిస్తాయి.

రివర్స్ రెపో రేటు శాతాన్ని గ‌తంలో రెపో రేటు వ‌డ్డీ శాతానికి సంబంధం లేకుండా నిర్ణయించేవారు. 2011 నుంచి దీంట్లో మార్పులు తీసుకొచ్చారు. అప్ప‌ట్లో ఆర్బీఐ దీనిని రెపో రేటుతో అనుసంధానం చేసింది. రెపో రేటు మారినప్పుడల్లా రివ‌ర్స్ రెపో రేటును దానికంటే 1 శాతం తక్కువ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

న‌గ‌దు నిల్వ‌ల‌ నిష్ప‌త్తి (సీఆర్ఆర్‌)

ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా తాను ప్రజల నుండి వసూలు చేసే డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకు వద్ద జమ చేయాలి. అలా ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ చేయాల్సిన న‌గ‌దునే న‌గ‌దు నిల్వ‌ల నిష్ప‌త్తి(సీఆర్ఆర్‌)గా ప‌రిగ‌ణిస్తారు. డిపాజిటర్ల రక్షణ కోసం ఈ చర్య తీసుకున్నారు. సీఆర్ఆర్‌ను తగ్గిస్తే మరిన్ని నిధులు బ్యాంకులకు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా వివిధ కంపెనీలకు, వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అవకాశం వస్తుంది. అదే సీఆర్ఆర్‌ను పెంచితే బ్యాంకుల వద్ద అందుబాటులో ఉండే నిధులు తగ్గిపోతాయి. దీని ప్ర‌భావంతో రుణాలను త‌క్కువ‌గా జారీ చేసే అవ‌కాశముంది. ప్ర‌స్తుతం సీఆర్ఆర్ 4శాతంగా ఉంది. దీనిపై ఆర్‌బీఐ బ్యాంకుల‌కు ఎటువంటి వ‌డ్డీ చెల్లించ‌దు.

చ‌ట్ట‌బ‌ద్ధ ద్ర‌వ్య నిష్ప‌త్తి

వాణిజ్య బ్యాంకులు తాము సేకరించిన డిపాజిట్లలో నిర్దిష్ట మొత్తాన్ని బంగారం తదితర విలువైన లోహాలు ఇంకా… ప్రభుత్వ బాండ్ల రూపంలో ఉంచాలి. ఇవి గరిష్టంగా 40 శాతం వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటు ఉంది. ఎస్ఎల్ఆర్ ప్ర‌స్తుతానికి 19.5శాతం ఉంది. చ‌ట్ట‌బ‌ద్ధ ద్ర‌వ్య నిష్ప‌త్తి (Statutory Liquidity Ratio) ద్వారా డిపాజిట‌ర్ల‌ సొమ్ముకు ఆర్‌బీఐ భద్రతనిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని