Akshata Murthy: బ్రిటన్‌లోనూ పన్ను చెల్లిస్తా: అక్షతా మూర్తి

తాను బ్రిటన్‌లో కూడా పన్నులు చెల్లిస్తానని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ భార్య అక్షతా మూర్తి వెల్లడించారు....

Updated : 09 Apr 2022 21:01 IST

లండన్‌: తాను ఇక నుంచి బ్రిటన్‌లోనూ పన్నులు చెల్లిస్తానని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ భార్య అక్షతా మూర్తి వెల్లడించారు. తన ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా చట్టబద్ధమేనని తెలిపారు. అయినప్పటికీ.. విదేశాల్లో పొందిన ఆర్జనపై పన్ను నుంచి మినహాయింపునిస్తున్న ఈ నిబంధనల నుంచి ఇక ఏమాత్రం ప్రయోజనం పొందబోనని స్పష్టం చేశారు.

‘‘నా పన్ను హోదా నా భర్తకు గానీ, నా కుటుంబ సభ్యులకుగానీ ఇబ్బందికరంగా మారొద్దని భావిస్తున్నాను. నాకు ప్రపంచవ్యాప్తంగా సమకూరుతున్న ఆదాయంపై ఇక నేను యూకేలో పన్నులు చెల్లిస్తాను. డివిడెండ్లు, మూలధన లాభాలు.. ఇలా ప్రపంచంలో ఏ మూల నుంచి నాకు ఆదాయం వస్తున్నా.. దానిపై పన్ను కడతాను. భారత్‌ నేను పుట్టిన దేశం. అక్కడి పౌరసత్వం కొనసాగుతుంది. నా తల్లిదండ్రులకూ అది పుట్టిల్లు. నేను యూకేనీ ప్రేమిస్తున్నాను. నా కూతుళ్లు బ్రిటిషర్లు. వారు ఇక్కడే పెరుగుతున్నారు. ఇక్కడ ఉంటున్నందుకు నేను గర్వపడుతున్నాను. నేను బ్రిటన్‌ వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టాను’’ అని అక్షతా మూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

బ్రిటన్‌లో ఉంటూ వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టక్కర్లేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రధాని రేసులో ముందంజలో ఉన్న రిషి సునక్‌ వెనకబడ్డారు. దీంతో సునక్‌ కుటుంబం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని