Ruchi Soya Patanjali: రుచిసోయా చేతికి పతంజలి ఫుడ్‌ బిజినెస్‌

పతంజలి ఆయుర్వేదకు చెందిన ఆహార పదార్థాల వ్యాపారాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్నట్లు రుచిసోయా బుధవారం ప్రకటించింది....

Updated : 17 Aug 2022 15:39 IST

దిల్లీ: పతంజలి ఆయుర్వేదకు చెందిన ఆహార పదార్థాల వ్యాపారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు రుచిసోయా బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రూ.690 కోట్లు. ఎఫ్‌ఎంసీజీ రంగంలో అగ్రగామిగా నిలిచే ప్రయత్నంలోనే భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం పతంజలి పేరిట ఉన్న నెయ్యి, తేనె, మసాలాలు, పండ్ల రసాలు, గోధుమ పిండి సహా మొత్తం 21 ఉత్పత్తులు రుచిసోయా సొంతం కానున్నాయి. మే 9 నుంచి పూర్తిగా ఆహార పదార్థాల వ్యాపారాన్ని రుచి సోయాకు బదిలీ చేసేందుకు పతంజలి బోర్డు కూడా ఆమోదం తెలిపింది. పదార్థ, హరిద్వార్‌, నెవాసాలో ఉన్న తయారీ కేంద్రాలను రుచి సోయా సొంతం చేసుకోనుంది. అలాగే కొత్త వ్యాపారానికి పతంజలి ఫుడ్స్‌ లిమిటెడ్‌గా నామకరణం చేయనున్నట్లు రుచిసోయా తెలిపింది.

జులై 15 నాటికి మొత్తం మూడు విడతల్లో పతంజలికి చెల్లింపులు చేయనున్నట్లు రుచిసోయా తెలిపింది. తొలి విడతలో భాగంగా వ్యాపార బదిలీ సమయంలో 13.5 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లిడించింది. ఈ పరిణామం నేపథ్యంలో నేడు రుచిసోయా షేర్లు భారీగా రాణించాయి.

రుచిసోయాను పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ గత ఏడాదే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత నిధుల సేకరణ నిమిత్తం రుచిసోయాను ఎఫ్‌పీఓకు కూడా తీసుకెళ్లారు. రూ.4,300 కోట్లు సమీకరించారు. కొన్ని నెలల క్రితం పతంజలి ఫుడ్‌ బిజినెస్‌ను రుచిసోయాకు బదిలీ చేస్తామని బాబా రామ్‌దేవ్‌ ప్రకటించారు. తాము కేవలం ఆహరేతర, సంప్రదాయ ఔషధం, ఆరోగ్య సంరక్షణ రంగాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని