Rupee Value: రష్యా తూటా.. రూపాయికి తంటా!

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం మరింత భీకరంగా మారితే రూపాయి విలువ భారీగా పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.....

Published : 08 Mar 2022 12:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం మరింత భీకరంగా మారితే రూపాయి విలువ భారీగా పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ.80 వద్ద చారిత్రక కనిష్ఠానికి చేరొచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ క్యాలెండర్‌ ఏడాదిలోనే రూపాయి విలువ 77.93 డాలర్లను తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే రూ.82ను తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరికొంత మంది నిపుణులు అంచనా వేస్తున్నారు.

యుద్ధమే అన్నింటికీ మూలం..

రూపాయి విలువ ఈ స్థాయిలో దిగజారడానికి ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధమే. ఇరు దేశాల మధ్య పోరాటం ఊహించిన దాని కంటే ఎక్కువ రోజులు కొనసాగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతింటాయన్న ఊహాగానాలు అధికమవుతున్నాయి. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. మరోవైపు విదేశీ మదుపర్ల పెట్టుబడులు భారత్‌ నుంచి తరలిపోవడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సోమవారం డాలరుతో పోలిస్తే 77.44 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని తాకిన రూపాయి విలువ మంగళవారం ఉదయం 11:52 గంటల సమయంలో 76.88 వద్ద ట్రేడవుతోంది.

లాభ నష్టాలేమిటంటే..

రూపాయి విలువ క్షీణిస్తే దిగుమతి వ్యయాలు భారీగా పెరుగుతాయి. మనం ఎక్కువగా దిగుమతి చేసుకునేది ముడి చమురే కాబట్టి దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఆహార ధరలపైనా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే నిత్యావసర ధరలకు ఆజ్యం పోసే రవాణా ధరలు పెరుగుతాయి కాబట్టి. ఇక విదేశీ విద్య కూడా ప్రియమవుతుంది. విదేశీ ప్రయాణాలూ ఖరీదవుతాయి. ఇక లాభమేమిటంటే.. ఎగుమతిదారులు లాభపడతారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు దీని వల్ల డాలర్ల రూపేణ ఎక్కువ ప్రయోజనం పొందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని