Zee: జీ షేర్లు ఢమాల్‌.. ₹2,000 కోట్ల అవకతవకల ఆరోపణలు!

Zee: జీ వ్యవస్థాపకులపై విచారణ జరుపుతున్న క్రమంలో కంపెనీ నుంచి రూ.2,000 కోట్లు అక్రమంగా తరలించినట్లు సెబీ గుర్తించిందని వార్తలు వెలువడ్డాయి.

Updated : 21 Feb 2024 15:34 IST

ముంబయి: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లు బుధవారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సోనీ పిక్చర్స్‌లో విలీనం కోసం మళ్లీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో నిన్న జీ షేరు 8.03 శాతం పుంజుకున్న విషయం తెలిసిందే. అయితే, కంపెనీ ఖాతాల్లో దాదాపు రూ.2,000 కోట్ల విలువ చేసే అవకతవకలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల గుర్తించినట్లు బుధవారం బ్లూమ్‌బర్గ్‌ ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో షేరు విలువ 14 శాతం నష్టపోయి రూ.165.65 వద్ద ముగిసింది.

ఓ కేసులో భాగంగా జీ వ్యవస్థాపకులపై విచారణ జరుపుతున్న క్రమంలో కంపెనీ నుంచి రూ.2,000 కోట్లు అక్రమంగా తరలించినట్లు సెబీ గుర్తించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అయితే, కంపెనీ అధికారుల నుంచి సమాచారం అందిన తర్వాత ఈ మొత్తంలో మార్పు ఉండే అవకాశం ఉందని సమాచారం. అందుకోసం జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర, ఆయన కుమారుడు పునీత్‌ గోయెంకా, బోర్డు సభ్యులను సెబీ వివరణ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు జీ, సెబీ అధికారికంగా స్పందించలేదు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో కుదిరిన విలీన ఒప్పందాన్ని కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఇంతకుముందు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా) రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ఇరు సంస్థలు చర్చలు జరుపుతున్నాయని వచ్చిన వార్తలను మంగళవారం జీ తోసిపుచ్చింది. సుభాష్‌ చంద్ర, గోయెంకా తమ సొంత ప్రయోజనాల కోసం కంపెనీ నిధులను దారి మళ్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సెబీ గతకొంతకాలంగా దర్యాప్తు జరుపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు