Stock Market Update: జులై నెలకు స్టాక్‌ మార్కెట్ల నష్టాల స్వాగతం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం జులై నెలకు నష్టాలతో స్వాగతం పలికాయి....

Published : 01 Jul 2022 09:42 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం జులై నెలకు నష్టాలతో స్వాగతం పలికాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ముడి చమురు ధరలు ఇటీవలి గరిష్ఠాల నుంచి కొంతమేర దిగొచ్చాయి. ఇతర కమొడిటీ ధరలు కూడా స్వల్పంగా దిగొచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు చైనాలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకోవడం మార్కెట్లకు సానుకూలం. ఆటో రంగంలో ముడి సరకుల ధరలు దిగిరావడం కూడా కలిసొచ్చే అంశం. అయితే, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, వడ్డీరేట్ల పెంపు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మాత్రం మార్కెట్లను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 315 పాయింట్ల నష్టంతో 52,703 వద్ద, నిఫ్టీ (Nifty) 89 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.09 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో పయనించాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

* ఆటో స్టాక్స్‌: జూన్‌ నెల విక్రయ వివరాలను నేడు కంపెనీలు ప్రకటించనున్నాయి.

* భారతీ ఎయిర్‌టెల్‌: సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొనని ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులను నాలుగేళ్ల పాటు వాయిదా వేసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. వడ్డీ బకాయిలను ఈక్విటీ వాటాలుగా మార్చే పరిష్కార మార్గాన్ని తాము ఎంచుకోవడం లేదని వెల్లడించింది.

* యూపీఎల్‌: నేచర్‌ బ్లిస్‌ అగ్రోలో 100 శాతం వాటాలను యూపీఎల్‌ సొంతం చేసుకుంది. ఇకపై నేచర్‌ బ్లిస్‌ యూపీఎల్‌ అనుబంధ సంస్థగా పనిచేయనుంది.

* ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌: ఆదిత్య బిర్లాతో కలిసి కంపెనీ ‘ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డ్‌’ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును ప్రవేశపెట్టింది.

* ఇండియన్‌ బ్యాంక్‌: ఎంసీఎల్‌ఆర్‌ను 0.15 శాతం పెంచింది.

* హిందూస్థాన్ కాపర్‌: డిబెంచర్ల ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని కంపెనీ వాటాదారులను అనుమతి కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని