Vodafone Idea: పెట్టుబడులు కొనసాగాలంటే.. టారిఫ్‌ల సవరణ జరగాల్సిందే: వొడాఫోన్‌

దేశంలో టెలికాం టారిఫ్‌లు ‘నిర్వహించలేని స్థాయి’లో ఉన్నాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. మున్ముందు పెట్టుబడులు కొనసాగాలంటే మాత్రం టారిఫ్‌ల సవరణ అవసరం అని అభిప్రాయపడింది.

Published : 05 Nov 2022 20:44 IST

దిల్లీ: దేశంలో టెలికాం టారిఫ్‌లు ‘నిర్వహించలేని స్థాయి’లో ఉన్నాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. మున్ముందు పెట్టుబడులు కొనసాగాలంటే మాత్రం టారిఫ్‌ల సవరణ అవసరం అని అభిప్రాయపడింది. ఇటీవల ప్రకటించిన క్యూ2 ఫలితాల్లో రూ.7,595 కోట్ల నికర నష్టాన్ని వీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ ఆర్పు (యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం) రూ.131గా నమోదైంది. గతంలో చేపట్టిన టారిఫ్‌ల పెంపుదల కారణంగా ఇది కొంత మెరుగైంది. అయినప్పటికీ ఈ మొత్తం ఇంకా పెరగాల్సి ఉందని ఆ కంపెనీ సీఈఓ అక్షయ్‌ ముంద్రా అన్నారు. భవిష్యత్‌ పెట్టుబడులు కొనసాగాలంటే మాత్రం టారిఫ్‌లు సవరించాల్సిందేనని అనలిస్టుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా 5జీ సేవలపైనా ఆయన మాట్లాడారు. 5జీ సేవల విషయంలో త్వరలోనే కీలక భూమిక పోషించబోతున్నామన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న 4జీ కవరేజీ విస్తరణ, 5జీ అమలు వంటివి ఫండింగ్‌పై ఆధారపడి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం నిధుల సమీకరణ వేటలో ఉన్నామని, అవి సమకూరాక 5జీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పోటీ కంపెనీలతో పోలిస్తే 5జీ విషయంలో తాము వెనకబడిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే, రెండు నెలల్లో నిధులు సమకూర్చుకుని నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తే తమపై పెద్ద ప్రభావం చూపబోదని చెప్పారు. వొడాఫోన్‌ బకాయిలను ఈక్విటీలుగా మార్చుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఎందుకు జాప్యం జరుగుతోందో తనకైతే తెలీదని, అందుకు కారణమేంటన్నది తెలియరాలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. జనవరిలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామని, తర్వాత టెలికాం విభాగానికి తెలియజేశామన్నారు. ఆ తర్వాత అటు నుంచి సమాధానం లేదని చెప్పారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని