Tata Tech IPO: ₹3 వేల కోట్ల ఐపీఓకు.. రూ.లక్షన్నర కోట్ల విలువైన బిడ్లు!

Tata Tech IPO Final day: టాటా టెక్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ గడువు ముగిసింది. చివరి రోజు కూడా మదుపరుల నుంచి ఊహించని స్పందన లభించింది. 

Updated : 24 Nov 2023 18:47 IST

Tata Tech IPO | ఇంటర్నెట్ డెస్క్‌: టాటా గ్రూప్‌ నుంచి రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన టాటా టెక్‌ ఐపీఓకు (Tata Tech IPO) ఊహించని రీతిలో స్పందన లభించింది. రూ.3042 కోట్ల సమీకరించేందుకు వచ్చిన ఈ ఐపీఓకు భారీ స్థాయిలో సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. మొత్తం 4.5 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. చివరి రోజు పూర్తయ్యే సరికి 69.4 రెట్ల స్పందన లభించింది. మొత్తం 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద లెక్కిస్తే ఈ మొత్తం రూ.1.56 లక్షల కోట్లతో సమానం. ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా కంపెనీ నిర్ణయించింది. 

టాటా టెక్‌ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు 6.54 రెట్లు స్పందన లభించగా.. రెండో రోజు పూర్తయ్యేసరికి 14.85 రెట్ల స్పందన వచ్చింది. చివరి రోజు భారీగా బిడ్లు రావడంతో మొత్తం 69.4 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో క్యూఐబీలు 203.41 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అవ్వగా.. ఎన్‌ఐఐ కోటా 62.10 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ 16.42 రెట్లు, టాటా టెక్‌ ఉద్యోగుల కోటా 3.67 రెట్లు, టాటా మోటార్స్‌ వాటాదారుల కోటా 29.12 రెట్లు చొప్పున సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.

వ్యక్తిగత రుణాలు ప్రియం కానున్నాయా? కారణం ఇదే!

ఐపీఓలో భాగంగా టాటా టెక్‌ 6.08 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా టాటా మోటార్స్‌ తమ వాటాలో 11.4 శాతాన్ని ఉపసంహరించుకుంటోంది. అదనంగా ఆల్ఫా టీసీ హోల్డింగ్స్‌ 2.4 శాతం, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌-I 1.2 శాతం వాటాలను విక్రయిస్తున్నాయి. ఈ ఐపీఓ పూర్తిగా ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో సమీకరించిన నిధులు కంపెనీకి చెందవు. షేర్ల కేటాయింపు నవంబరు 30న జరగనుండగా.. డిసెంబర్‌ 1 నుంచి రిఫండ్లు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 4న డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ జరుగుతుంది. డిసెంబరు 5న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో టాటా టెక్‌ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

  • గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ ఐపీఓకూ మంచి స్పందన లభించింది. మూడో రోజు పూర్తయ్యేసరికి మొత్తం 65.63 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2.12 కోట్ల షేర్లు ఆఫర్‌ చేయగా.. 136 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీలు 129.06 రెట్లు, ఎన్‌ఐఐలు 64.34 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు 29.93 రెట్లు చొప్పున స్పందన లభించింది.
  • ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌లో 49.28 రెట్ల స్పందన అందుకుంది. రిటైల్‌ పోర్షన్‌ 13.73 రెట్లు, క్యూఐబీ కోటా 122.02 రెట్లు, ఎన్‌ఐఐ కోటా 35.23 రెట్లు చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ లభించింది.
  • ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఫెడ్‌ఫినా) ఐపీఓకు 2.24 రెట్ల స్పందన వచ్చింది. క్యూఐబీలు 3.48 రెట్ల బిడ్లు దాఖలు చేయగా.. ఎన్‌ఐఐ కోటా 1.49 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 1.88 చొప్పున బిడ్లు దాఖలు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని