Tax: రూ.19 లక్షల కోట్లకు ఈ ఏడాది ప్రత్యక్ష పన్నుల వసూళ్లు?

Tax collection: ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ద్వారా పన్ను వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాలను మించి రూ.19 లక్షల కోట్లకు చేరతాయని నిపుణులు భావిస్తున్నారు.

Updated : 29 Dec 2023 13:51 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో (Net direct taxes) ఇప్పటి వరకు 20 శాతం వృద్ధి నమోదైంది. ఇలాగే కొనసాగితే 2024 మార్చి 31 నాటికి వసూళ్లు రూ.19 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలే పన్ను వసూళ్ల పెరుగుదలకు దోహదం చేసినట్లు విశ్లేషించారు.

2013-14లో వ్యక్తిగత ఆదాయం (Personal Income tax), కార్పొరేట్‌ పన్నులతో (Corporate tax) కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 నాటికి అవి రూ.16.61 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అవి రూ.19 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా. 2023-24 బడ్జెట్‌ అంచనా అయిన రూ.18.23 లక్షల కోట్లను ఇది దాటేసే అవకాశం ఉంది. తక్కువ రేట్లు, తక్కువ మినహాయింపులతో పన్ను విధానాన్ని సరళీకృతం చేయడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2019 నుంచి మినహాయింపులను వదులుకున్న కార్పొరేట్‌లకు ప్రభుత్వం తక్కువ పన్ను రేటును ఆఫర్‌ చేస్తోంది. 2020 ఏప్రిల్‌ నుంచి వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకూ అలాంటి పథకాన్నే తీసుకొచ్చింది.

100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి తొలిసారిగా ఆమె..!

శ్లాబులను హేతుబద్ధీకరించడం ద్వారా 2023-24 బడ్జెట్‌లో పన్ను విధానాన్ని ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేసింది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.మూడు లక్షలకు పెంచింది. రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా అందులో చేర్చింది. మరోవైపు ఆదాయ పన్ను విభాగం తీసుకున్న చర్యల వల్ల చెల్లింపుదారుల సంఖ్య సైతం పెరుగుతూ వస్తోంది. 2013-14లో 3.36 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు కాగా.. అక్టోబర్‌ 2023 నాటికి ఆ సంఖ్య 7.41 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది దాఖలైన వాటిలో 53 లక్షల రిటర్నులు కొత్తవారివి కావడం విశేషం.

మరోవైపు జీఎస్‌టీ వసూళ్లు సైతం ఏటా పెరుగుతున్నాయి. 2023 ఏప్రిల్‌లో గరిష్ఠంగా రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023-24లో ఇప్పటి వరకు నెలవారీ సగటు వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు