Francoise Bettencourt Meyers: 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి తొలిసారిగా ఆమె..!

Francoise Bettencourt Meyers: ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ 100 బిలియన్‌ డాలర్ల సంపద కలిగిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

Updated : 29 Dec 2023 14:14 IST

Francoise Bettencourt Meyers | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్రాన్స్‌కు చెందిన సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ (Francoise Bettencourt Meyers) ప్రపంచంలో 100 బిలియన్‌ డాలర్ల సంపద కలిగిన తొలి మహిళగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం.. గురువారం నాటికి ఆమె సంపద 100.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. లోరియల్‌ ఎస్‌ఏ షేర్లు నిన్న భారీ ఎత్తున పుంజుకోవడమే అందుకు కారణం.

లోరియల్‌ కంపెనీ షేర్లు 1998 తర్వాత మళ్లీ 2023లోనే అత్యంత మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. బెటెన్‌కోర్ట్‌ మేయర్స్‌ (Francoise Bettencourt Meyers) కుటుంబం 35 శాతం షేర్లతో కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా ఉంది. కంపెనీ విలువ ప్రస్తుతం 268 బిలియన్‌ డాలర్లు. 1909లో తాత యూజీన్‌ షూలర్‌ ప్రారంభించిన లోరియల్‌ కంపెనీలో బెటెన్‌కోర్ట్ మేయర్స్ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

మీ విమానం బోల్టులు సరిచూసుకోండి..కోరిన బోయింగ్‌..!

ప్రపంచంలోని అనేక మంది సంపన్నులు కోరుకునే విలాసాలను విడిచిపెట్టి ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ (Francoise Bettencourt Meyers) నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. లోరియల్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆమె రెండు పుస్తకాలు కూడా రాశారు. బైబిల్‌పై సమగ్ర అధ్యయనం చేసి ఐదు సంపుటాల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. గ్రీకు దేవుళ్ల వంశానుక్రమంపై మరో పుస్తకాన్ని వెలువరించారు. అలాగే రోజుకు కొన్ని గంటలపాటు పియానో వాయిస్తుంటారు. 2017లో తల్లి లిలియన్ బెటెన్‌కోర్ట్ మరణం తర్వాత సంపద మొత్తం ఆమె చేతికి వచ్చింది.

కరోనా మహమ్మారి సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. లోరియల్‌ వేగంగా తిరిగి పుంజుకుంది. లాక్‌డౌన్‌ల ఎత్తివేత తర్వాత విలాసవంత ఉత్పత్తుల గిరాకీ భారీగా పెరిగింది. ఈ ఏడాది కంపెనీ షేర్లు 35 శాతం రాబడి ఇవ్వడం విశేషం. ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రస్తుతం మేయర్స్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని