పన్ను మినహాయింపుల కోసం పెట్టుబడులు ఎలా చేయాలి?

కేవలం రాబడినే పరిగణనలోనికి తీసుకొని మదుపు చేయడమూ సరికాదు.. ఏ పథకాల్లో పెట్టుబడి పెట్టాలి? ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారికి పెద్ద చిక్కు ప్రశ్న ఇది. కానీ, ఇక్కడ ఎంచుకోవాల్సింది కేవలం పథకాలనే కాదు…

Updated : 01 Jan 2021 16:54 IST

కేవలం రాబడినే పరిగణనలోనికి తీసుకొని మదుపు చేయడమూ సరికాదు.. ఏ పథకాల్లో పెట్టుబడి పెట్టాలి? ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారికి పెద్ద చిక్కు ప్రశ్న ఇది. కానీ, ఇక్కడ ఎంచుకోవాల్సింది కేవలం పథకాలనే కాదు… ప్రస్తుత పన్ను ఆదా ప్రయోజనంతో పాటు, భవిష్యత్తులోనూ ఉపయుక్తంగా ఉండాలి. అందుకు ఏం చేయాలి? ఆర్థిక ప్రణాళికలో ఆదాయపు పన్ను ప్రణాళిక కీలకమైన భాగమే. అయితే, ఈ రెండింటినీ విడివిడిగా చూసినప్పుడు మాత్రం ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ, దీన్ని గుర్తించక చాలామంది వీటిని కలిపేస్తుంటారు. దీర్ఘకాలం పొదుపు, ఆర్థిక రక్షణకు ఉద్దేశించిన బీమా పాలసీలను పన్ను ఆదా కోసం తీసుకోవడం ఇలాంటిదే. సెక్షన్‌ 80సీలో భాగంగా పీఎఫ్‌, పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎన్‌పీఎస్‌, పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌, బీమాపాలసీలు, పిల్లల చదువులకు చెల్లించిన ఫీజులు, గృహరుణం అసలు తదితరాలన్నీ వస్తాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఈ సెక్షన్‌ కింద గరిష్ఠంగా రూ.1,50,000 మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. వీటిలో పెట్టుబడి పథకాలను ఎంచుకునేప్పుడే కాస్త జాగ్రత్తగా… ఏ వయసులో ఎలాంటివి ఎంచుకోవాలి? అవి నిజంగా మనకు ఎంత మేరకు ఉపయోగపడతాయి అని నిర్ధారించుకోవాలి. నష్టభయం భరించే సామర్థ్యమూ పరిగణనలోనికి తీసుకోవాలి. అప్పుడే ఈక్విటీలకూ, డెట్‌ పథకాలకూ ఎంత కేటాయించాలనేది అవగాహన వస్తుంది. కేవలం రాబడినే పరిగణనలోనికి తీసుకొని మదుపు చేయడమూ సరికాదు.

ఆర్జన మొదలైన కొత్తలో..
సంపాదన ప్రారంభం నుంచి… వివాహం అయ్యేంత వరకూ ఉండే ఆర్థిక పరిస్థితి కొద్దిగా వేరుగా ఉంటుంది. సాధారణంగా 23 నుంచి 30 ఏళ్లలోపు వారు ఈ దశలో ఉంటారు. బాధ్యతల బరువు ఏ మాత్రం ఉండని పరిస్థితి. కాబట్టి, భవిష్యత్తు కోసం వీలైనంత వరకూ పొదుపు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటివారు కాస్త నష్టభయం భరించేందుకూ వీలుంటుంది. కాబట్టి, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌)తోపాటు, దీర్ఘకాలిక పథకాలైన ఈపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, పీపీఎఫ్‌లాంటివి ఎంచుకోవడం మంచిది. దీనివల్ల అటు పన్ను ప్రయోజనంతోసహా, చిన్న వయసు నుంచే పదవీ విరమణ ప్రణాళికకూ వెసులుబాటు లభిస్తుంది.

తమపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన మొత్తానికి జీవిత బీమా తీసుకోవడమూ మంచిది. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80డీ ప్రకారం మినహాయింపు పొందవచ్చు. చిన్న వయసులో పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియమూ తక్కువగానే ఉంటుంది.

బాధ్యతలు పెరిగినప్పుడు: ఆదాయంతోపాటు, బాధ్యతల బరువులూ పెరుగుతాయి. ఈ దశలో ఉన్నవారు ముందుగా బాధ్యతలకు అనుగుణంగా జీవిత బీమా మొత్తాన్ని పెంచుకోవడంతో పాటు పింఛన్‌ పాలసీలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లల ఫీజులు, పీఎఫ్‌లాంటివే సాధారణంగా సెక్షన్‌ 80సీకి సరిపోయేలాగా ఉంటాయి. కాబట్టి, ఇతర పెట్టుబడుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

సాధారణంగా 30 ఏళ్లు దాటిన వారు సొంతింటి కొనుగోలు కోసం ఆలోచిస్తుంటారు. గృహరుణం తీసుకొని ఇల్లు కొనడం వల్ల ఆ రుణానికి చెల్లించే వడ్డీకి సెక్షన్‌ 24బి ప్రకారం గరిష్ఠంగా రూ.2,00,000 వరకూ మినహాయింపు వర్తిస్తుంది. అసలును కూడా సెక్షన్‌ 80సీలో పేర్కొనవచ్చు. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పన్ను చెల్లించాల్సి వస్తున్నప్పుడు ఉమ్మడిగా గృహరుణం తీసుకోవడమే ఉత్తమమైన మార్గం.

పన్ను మినహాయింపు కోసం ఇంకా ఎంత మొత్తం మదుపు చేయాలి? అనేది ముందుగా తెలుసుకున్నాకే ఏ పథకాలను ఎంచుకోవాలి అనేది నిర్ణయించుకోవాలి. తర్వాత నష్టభయం భరించే శక్తి, ఎంతకాలం ఓపిక పట్టగలరు అనేది చూసుకోవాలి. అనవసరంగా పన్ను ఆదా పథకాల్లో ఎక్కువ మొత్తాన్ని మదుపు చేయడం మానుకోవాలి.

36 నుంచి 45 ఏళ్ల వారు: బాధ్యతలు పెరిగినప్పుడు ఆర్థిక విషయాల్లో సాహసాలకు దిగే ప్రయత్నం చేయలేము. పిల్లలకు పెద్ద చదువులు చెప్పించడం, వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రయత్నాలు చేయడం ఈ దశలో ఇలాంటివే మనకు లక్ష్యాలు అవుతాయి. పీఎఫ్‌, పిల్లల ఫీజులు, గృహరుణం అసలు, జీవిత బీమా పాలసీలతో సెక్షన్‌ 80సీ పరిమితి దాటిపోతుంది. కొత్తగా ఏ పథకాల్లో మదుపు చేయాలన్నది ఒకసారి పరిశీలించాలి. ఒకవేళ ఇంకా కొంత మొత్తం మిగిలిపోతే… పదవీ విరమణ పథకాలవైపు మొగ్గు చూపడం ఉత్తమం. ఆరోగ్య బీమా పాలసీలను మర్చిపోవద్దు. గృహరుణం తీసుకుంటే వడ్డీకి మినహాయింపు ఎటూ ఉంటుంది.

గతంలో చేసిన తప్పులను దిద్దుకోవడానికీ ఇది అనువైన సమయమే. ఇప్పటికే మదుపు చేస్తున్న పథకాల్లో మంచి చెడులను విశ్లేషించుకోవాలి. అందులో ఏ మాత్రం ఆశాజనకంగా లేని పథకాలను వదిలించుకోవడమే మేలు. మరి కాస్త పన్ను ఆదా చేసుకోవాలంటే ఎన్పీ స్ లో ఏడాదికి అదనంగా(సెక్షన్ 80C పరిమితి కాకుండా) రూ. 50 వేల వరకు మదుపు చేయవచ్చు.

46-60 ఏళ్ల వయసులో: సాధారణంగా ఈ దశలో వ్యక్తుల గరిష్ఠ సంపాదనకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే తీసుకున్న అప్పులు ఏమైనా ఉంటే వాటికి వాయిదాలు చెల్లించడం, భవిష్యత్తు కోసం తగిన పెట్టుబడి పథకాలను ఎంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. గృహరుణం, పిల్లల ఫీజులు, పీఎఫ్‌లాంటివాటితోనే పన్ను ప్రణాళిక పూర్తవుతుంది. యాజమాన్యం అందించే ఆరోగ్య బీమా పాలసీలపైనే ఆధారపడటం ఈ వయసులో ఉన్నవారు చేసే ప్రధాన పొరపాటు. కాబట్టి, ఇప్పటికే బీమా పాలసీ ఉంటే కొనసాగించడం లేకపోతే కొత్తది తీసుకోవడం తప్పనిసరి. 60 ఏళ్లు దాటాక పాలసీ తీసుకోవడం అంత తేలిక కాదనే సంగతిని గుర్తించాలి. దీర్ఘకాలిక పెట్టుబడి పథకం పీపీఎఫ్‌లో మదుపు చేయడం కూడా వారికి అంత ఆచరణీయం కాదు. అయితే, 45 ఏళ్ల వయసులో ఉన్నవారు పీపీఎఫ్‌ ఖాతాను ప్రారంభించి, అందులో కొంత మొత్తాన్ని జమ చేయడం ఉత్తమం. పెట్టుబడుల్లోనూ ఈక్విటీలకన్నా… డెట్‌ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వండి. అధిక ప్రీమియం ఉండే బీమా పాలసీలు, పరిమితికి మించి పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులు అంతమంచివి కావు.

60 ఏళ్లు దాటాక: పెట్టుబడిని సురక్షితంగా ఉంచుకోవడమే ఈ వయసులో ప్రధాన లక్ష్యం కావాలి. సాధ్యమైనంత వరకూ ఈక్విటీలకు దూరంగా ఉండి, డెట్‌ పథకాల్లోనే మదుపు చేయాలి. పదవీ విరమణ చేసిన వారికి నెలవారీ, మూడు నెలలకోసారి రాబడి వచ్చేలా ఉంటే బాగుంటుంది. అందుకే, పెద్దల పొదుపు పథకం (సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం)లాంటి వాటిని పరిశీలించవచ్చు. దీనికి ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి, పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రాబడి హామీ కూడా ఉంటుంది. ఎన్పీఎస్ లో మదుపు చేసి ఉంటే 60 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు. దీన్ని పైన తెలిపిన సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం పధకం లో మదుపు చేయవచ్చు. పన్ను మినహాయింపు పథకాల్లో మదుపు చేసేప్పుడు వయసే కాకుండా, ఆదాయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది.

ఆదాయం ఆధారంగా..
రూ. 2 లక్షల నుంచి 5 లక్షల లోపు: పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఈ ఆదాయ పరిమితిలోపల ఉన్నవారు సెక్షన్‌ 80సీ పరిధిలోని రూ.లక్ష మదుపు చేయడం కూడా కష్టంగానే మారుతోంది. కాబట్టి, ఈ ఆదాయ పరిమితిలో ఉన్నవారు… ఇంటి అద్దె భత్యం సరిగా లెక్కిస్తున్నారా? చూసుకోవాలి. పీఎఫ్‌, బీమా పాలసీలకు చెల్లిస్తున్న మొత్తాన్ని కలుపుతున్నారా లేదా అనే విషయాలను తనిఖీ చేసుకోవాలి. ఈ ఆదాయ పరిధిలో ఉన్నవారు గరిష్ఠంగా రూ.10వేల వరకూ పన్ను ఆదా చేసుకోగలరు. సమయం, ఆర్థిక లక్ష్యాలను బట్టి పథకాలను ఎంపిక చేసుకోవాలి. బీమా పాలసీని తీసుకోవాలి అనుకుంటే, తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ ఇచ్చే టర్మ్‌ పాలసీలను ఎంచుకోవాలి. యాజమాన్యం ఆరోగ్య బీమా అందిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా మీరూ ఒక పాలసీని తీసుకోవడం వల్ల అదనపు రక్షతోపాటు సెక్షన్‌ 80డీ ప్రకారం మినహాయింపూ వర్తిస్తుంది. కొత్త పన్ను నియమాల(FY 2018-19) ప్రకారం రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను వర్తించదు కాబట్టి ప్రత్యేకంతా పన్ను ఆదా కోసం పెట్టుబడుల గురించి ఆలోచించే అవసరం ఉండదు.

రూ.5 లక్షలు- 10లక్షల పరిధిలో..
సెక్షన్‌ 80సీ పరిధిలో గరిష్ఠంగా రూ.లక్షను పీఎఫ్‌, గృహరుణం అసలు, పిల్లల ఫీజులే భర్తీ చేస్తాయి. గృహరుణం వడ్డీకి రూ. 2 లక్షల వరకూ మినహాయింపు వస్తుంది. అలాగే, సెక్షన్ 80D లో రూ. 25 వేలు, ఎన్పీ స్ లో అదనంగా రూ. 50 వేలు లాంటివాటిని అన్నీ ఉపయోగించుకోవడం మంచిది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే దిగువ లో ఉంటే పన్ను వర్తించదు, కాబట్టి దీని ప్రకారం పన్ను మినహాయింపులు ఎంచుకోవాలి. అధిక ప్రీమియం ఉండే పాలసీలకన్నా టర్మ్‌ పాలసీ మేలు.

మీకు నవంబరు 23, 2012 వరకూ డీమ్యాట్‌ ఖాతా లేదా? అయితే, పన్ను ఆదాకు మరో అవకాశం ఉంది. అదే రాజీవ్‌ గాంధీ ఈక్విటీ పొదుపు పథకం. ఇందులో గరిష్ఠంగా రూ.50వేల వరకూ మదుపు చేయవచ్చు. ఈ మదుపు మొత్తంలో 50శాతాన్ని సెక్షన్‌ 80సీసీజీ కింద పన్ను మినహాయింపు కోసం క్లెయిం చేసుకోవచ్చు. ఇది మొదటిసారిగా (నవంబరు 23, 2012తర్వాత) స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేసేవారికి మాత్రమే ఉద్దేశించిన పథకం. కనీసం మూడేళ్లపాటు ఇందులో కొనసాగాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.50వేలు ఈ పథకంలో మదుపు చేశారనుకుందాం. అప్పుడు సెక్షన్‌ 80సీసీజీ కింద రూ.25వేలను పన్ను మినహాయింపు కోసం పరిగణనలోనికి తీసుకుంటారు.

ఆరోగ్య బీమా మీ పేరుమీద తీసుకుంటే గరిష్ఠంగా రూ.20వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది. తల్లిదండ్రుల పేరుమీద తీసుకున్నా రూ.15 వేల (సీనియర్‌ సిటిజన్లయితే రూ.20వేలు) వరకూ క్లెయిం చేసుకోవచ్చు.

రూ.10 లక్షల పైన ఆదాయం ఉంటే: సెక్షన్‌ 80సీలో రూ.1.50 లక్ష మేరకు మదుపు చేయడం ద్వారా ఈ ఆదాయ పరిధిలో ఉన్నవారు గరిష్ఠంగా రూ.30వేల వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. పైన తెలిపిన పన్ను ఆదా పధకాలను ఉపయీగించుకోవడం మంచిది. ఈ ఆదాయ పరిధిలో ఉన్నవారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేసినప్పుడు వచ్చే వడ్డీకి వర్తించే ఆదాయపు పన్ను శ్లాబులను బట్టి పన్ను చెల్లించాలి. అంటే, రూ.10లక్షల ఆదాయం దాటిన వారికి గరిష్ఠంగా 30శాతం పన్ను వర్తిస్తుంది.

ఉదాహరణకు మీరు 9 శాతం వడ్డీ వచ్చే విధంగా 5 ఏళ్ల ఎఫ్‌డీ చేశారనుకుందాం. అప్పుడు వచ్చిన వడ్డీ నుంచి పన్ను, సెస్సులు తీసివేస్తే వాస్తవంగా మిగిలేది 6.30 శాతమే. కాబట్టి, పెట్టుబడికీ, రాబడికీ పన్ను మినహాయింపు వర్తించే పథకాలవైపు మొగ్గు చూపాలి. 3 ఏళ్ళ పైన మదుపు చేయాలంటే ఫిక్సిడ్ డిపాజిట్ల కంటే డెట్ ఫండ్లు మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని