భారత్‌ నుంచి వెళ్లిపోనున్న టిక్‌టాక్‌!

చైనా సామాజికమాధ్యమ సంస్థ బైట్‌డాన్స్‌ భారత్‌లో కార్యకలాపాలకు బై బై చెప్పేందుకు సిద్ధమైంది. టిక్‌టాక్‌ సహా ఇతర చైనీస్‌ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర

Published : 27 Jan 2021 17:28 IST

నిర్ణయాన్ని సిబ్బందికి వెల్లడించిన బైట్‌డాన్స్‌

దిల్లీ: చైనా సామాజికమాధ్యమ సంస్థ బైట్‌డాన్స్‌ భారత్‌లో కార్యకలాపాలకు బై బై చెప్పేందుకు సిద్ధమైంది. టిక్‌టాక్‌ సహా ఇతర చైనీస్‌ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో, సిబ్బంది తగ్గింపుపై బైట్‌డాన్స్ తన భారత ఉద్యోగులకు సమాచారమిచ్చింది. భారత్‌లో తమ సంస్థ కార్యకలాపాలు, సిబ్బంది తగ్గించే నిర్ణయాన్ని టిక్‌టాక్‌ తాత్కాలిక గ్లోబల్‌ హెడ్‌ వనెస్సా పప్పాస్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బ్లేక్‌ చాండ్లీ సిబ్బందికి ఈ మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారు. భారత్‌కు మళ్లీ తిరిగి రావడంపై సందేహమేనన్న బైట్‌డాన్స్‌ ప్రతినిధులు, రానున్న రోజుల్లో అలా జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై టిక్‌టాక్‌ యాజమాన్యాన్ని సంప్రదించగా.. యాప్‌లను నిషేధిస్తూ గత సంవత్సరం జూన్‌ నెలలో తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వ అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రయత్నించామని వెల్లడించారు. అయినప్పటికీ నిషేధాన్ని తొలగించడం కుదరని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సిబ్బందిని తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తాజా నిర్ణయం ఇక్కడి సిబ్బందికి ఇబ్బందిని కలిగిస్తుందని పేర్కొన్న బైట్‌డాన్స్‌, తమ భారత బృందానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భారత్‌లో టిక్‌టాక్‌ను పునప్రారంభించే అవకాశం కోసం ఎదురు చూస్తామని తెలిపారు.

ఇదిలాఉంటే, గతేడాది జూన్‌లో 59, సెప్టెంబర్‌లో 118 చైనీస్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సౌర్వభౌమత్వానికి భంగం కలుగుతోందన్న అంశాలపై టిక్‌టాక్‌, హెలో, పబ్‌జీ వంటి యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం కొనసాగుతుందని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో టిక్‌టాక్‌ సంస్థ భారత్‌ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది.

ఇవీ చదవండి..
భారత్‌లో టిక్‌టాక్‌ నిషేధం
టిక్‌ టాక్‌@200కోట్ల డౌన్‌లోడ్‌లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని