Updated : 06 May 2022 19:10 IST

Loans: రుణం త్వరగా చెల్లించాలా? అయితే ఈ టిప్స్ మీ కోస‌మే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు రుణాలు తీసుకుంటూ ఉంటాం. బ్యాంకులు, బ్యాకింగేత‌ర‌ ఆర్థిక సంస్థ‌లు లేదా తెలిసిన‌ స్నేహితులు, బంధువుల నుంచి అవ‌స‌రానికి అప్పు తీసుకుని.. డ‌బ్బు చేతికి అందిన వెంట‌నే తిరిగి చెల్లింస్తుంటాం. అయితే అవ‌స‌రానికి అప్పు చేసి స‌మ‌యానికి తిరిగి చెల్లించేస్తే ప‌ర్వాలేదు. కానీ స‌మ‌యానికి తిరిగి చెల్లించ‌లేక‌పోతే వ‌డ్డీ భారం పెరిగి రుణ వ‌ల‌యంలో చిక్కుకుపోయే ప్ర‌మాదం ఉంది. ఒక‌టి కంటే ఎక్కువ రుణాలు ఉండి చెల్లింపులు చేసేందుకు ఇబ్బంది ప‌డే వారు.. ఆందోళ‌న చెంద‌కుండా, ఒక ప్రణాళిక ప్ర‌కారం చెల్లింపులు చేస్తే వీలైనంత తొంద‌ర‌గా రుణాల‌ను క్లియ‌ర్ చేయ‌వ‌చ్చు.

అధిక వ‌డ్డీ రుణాలు: ఇందుకోసం ముందుగా మీకున్న అన్ని రుణాల జాబితాను త‌యారు చేయండి. వ‌డ్డీ రేటును అనుస‌రించి వాటికి ర్యాంక్ ఇవ్వండి. ఎక్కువ వ‌డ్డీ రేటు ఉన్న రుణాల‌తో మొద‌లు పెట్టి జాబితాను త‌యారు చేయండి. ఉదాహ‌ర‌ణ‌కు ముందుగా క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాలు ఆపై కారు, గృహ రుణాలు .. ఇలా జాబితా చేసుకోవాలి. మొద‌ట అధిక వ‌డ్డీతో కూడిన రుణంపై దృష్టి పెట్టాలి. క్రెడిట్ కార్డు వంటి రుణాలు వార్షికంగా 38 నుంచి 48 శాతం వ‌ర‌కు కూడా వ‌డ్డీ వ‌సూలు చేస్తాయి. దీంతో వ‌డ్డీకి ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వ‌స్తుంది. ఇటువంటి రుణాల‌ను ముందుగా చెల్లించ‌డం వ‌ల్ల వ‌డ్డీల‌కు అధిక మొత్తం పోకుండా జాగ్ర‌త్త‌ ప‌డొవ‌చ్చు. రుణాలు తీర్చ‌డానికి ఇది ఒక వ్యూహం.

చిన్న రుణాలు: కొంత మంది నిపుణులు మ‌రొక వ్యూహాన్ని కూడా సూచిస్తారు. అధిక వడ్డీతో కూడిన రుణాల కంటే త‌క్కువ మొత్తంతో కూడిన చిన్న చిన్న‌ రుణాలు ముందుగా చెల్లించ‌మంటారు. ఉదాహ‌ర‌ణ‌కు: రాహుల్‌కి రూ 35 వేల క‌న్జ్యూమ‌ర్ డ్యుర‌బుల్ లోన్‌, రూ.1 ల‌క్ష క్రెడిట్ కార్డ్ రుణం ఉంటే.. క్రెడిట్ కార్డుకి బ‌దులు ముందుగా కన్జ్యూమ‌ర్ డ్యుర‌బుల్ రుణం చెల్లింపులు చేసేందుకు ప్ర‌య‌త్నించవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ముందుగా ఒక రుణం పూర్తిగా క్లియ‌రవుతుంది. అలాగే ఇత‌ర రుణాల‌పై పూర్తి ఫోక‌స్ పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది.

టాప్ - అప్ లోన్‌: ఒక వేళ మీరు ఇప్ప‌టికే గృహ రుణం తీసుకుని.. వ్య‌క్తిగ‌త రుణం, కారు రుణం, క్రెడిట్ కార్డు బ‌కాయిలు వంటి ప‌లు చిన్న చిన్న రుణాలు ఉంటే గృహ రుణంపై టాప్‌-అప్ లోన్ కోసం రుణ‌దాత‌ను సంప్ర‌దించొచ్చు. ఇత‌ర రుణాలైన క్రెడిట్ కార్డులు, వ్య‌క్తిగ‌త రుణాల వ‌డ్డీ రేట్ల‌తో పోలిస్తే గృహ రుణం వ‌డ్డీ రేటు కాస్త త‌క్కువ‌గానే ఉంటుంది కాబ‌ట్టి వ‌డ్డీ భారాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. పైగా ఒకే రుణం కాబ‌ట్టి నెల‌వారీ ఈఎంఐల‌తో సుల‌భంగా చెల్లించి ఒత్తిడిని త‌గ్గించుకోవ‌చ్చు. గృహ రుణం ఉన్న వారు మాత్ర‌మే దానిపై టాప్ - అప్ లోన్ తీసుకోగ‌లుగుతారు.

చివ‌రిగా..: రుణం తీసుకునేట‌ప్పుడు.. మీ చెల్లింపుల సామ‌ర్థ్యాన్ని ముందుగా అంచ‌నా వేయండి. అప్పుడే ఒక ప్రణాళిక ప్ర‌కారం చెల్లింపులు చేయ‌గ‌లుగుతారు. ఒకవేళ మీరు రుణం తీసుకున్నట్లైతే, మీ ఈఎంఐ అవుట్-గో, మీ మొత్తం నెలవారీ ఆదాయంలో 40 శాతానికి మించకుండా చూసుకోండి. ఒకవేళ మీ ఆదాయంలో ఈఎంఐ 50 నుంచి 70 శాతంగా ఉంటే, మీ భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు ఆదా చేయడం చాలా కష్టంగా మారుతుంది. మీరు రుణం తీసుకునే ముందు ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ నెలవారీ ఈఎంఐ అవుట్‌ గోను తెలుసుకోండి. మీరు ఎలాంటి రుణం తీసుకోవాల‌నుకుంటున్నారో.. ఆ కేట‌గిరీలో వివిధ బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్లు, కాల‌ప‌రిమితి, ఇత‌ర ఛార్జీల‌ను పోల్చి చూసి స‌రైన సంస్థ‌ల‌ను ఎంచుకోండి. తీసుకున్న రుణాన్ని అవసరం లేని వ‌స్తువుల కొనుగోలుకు ఉప‌యోగించ‌కండి. అన్ని వ్యూహాలు అందిరికీ స‌రిప‌డ‌క‌పోవ‌చ్చు. మీకు ఉన్న రుణాల ఆధారంగా త‌గిన వ్యూహాన్ని ఎంచుకుని రుణాల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా క్లియ‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నించండి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts