GST Dues: రాష్ట్రాలకు రూ.86,912 కోట్ల జీఎస్టీ బకాయిల విడుదల

ఆయా రాష్ట్రాలకు చెల్లించాల్సిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది.

Updated : 31 May 2022 22:39 IST

ఒకేవిడతలో క్లియర్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ:  రాష్ట్రాలకు చెల్లించాల్సిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఇందులో భాగంగా మే 31, 2022 వరకు మొత్తం రూ.86,912 కోట్ల బకాయిలను ఒకేసారి విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. జీఎస్‌టీ అమలువల్ల ఏర్పడే రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని రాష్ట్రాలకు అందిస్తోంది. మూలధన వ్యయంతోపాటు ఆర్థిక వనరుల నిర్వహణ, వివిధ కార్యక్రమాలకు విజయవంతంగా అమలు చేసేందుకు తాజా నిర్ణయం దోహదపడుతుందని ఆర్థిక శాఖ తెలిపింది.

‘జీఎస్టీ పరిహార నిధి కింద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద రూ.25వేల కోట్లే ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్రాల మూలధన వ్యయాలను తిరిగి గాడిలో పెట్టేందుకుగాను మే 31వరకు ఉన్న బకాయిలన్నింటినీ ఒకేవిడతలో చెల్లించాలని నిర్ణయించాం. ఇందుకోసం కేంద్రం తన సొంత వనరుల ద్వారా అదనంగా నగదు సర్దుబాటు చేయాల్సి వచ్చింది’ అని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని జులై 1, 2017లో ప్రవేశపెట్టారు. అయితే, జీఎస్టీ అమలు వల్ల ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీకి ఆయా రాష్ట్రాలకు రెండు నెలలకోసారి కేంద్రం పరిహారం చెల్లించాలని 2017 జీఎస్టీ చట్టం చెబుతోంది. 2017 నుంచి ఐదేళ్ల పాటు ఈ సహాయాన్ని అందజేయాల్సి ఉంది. ఈ ఏడాది జూన్‌తో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఇకపై నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా.. స్వయంసమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు అందజేయాల్సిన జీఎస్టీ బకాయిల మొత్తం రూ.86,912 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటికోసం ఆయా రాష్ట్రాలు చాలా రోజులుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని