కాలంతో పాటు హామీ మొత్తాన్ని పెంచుకోండి.. 

క‌రీర్ ప్రారంభంలో ఉన్న‌వారు ఇంక్రీజింగ్ ట‌ర్మ్‌పాల‌సీ కొనుగోలు చేయ‌డం ద్వారా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొంద‌చ్చు

Updated : 03 Feb 2021 16:04 IST


జీవిత బీమాకు ఎంత ప్రాముఖ్య‌తుందో అందరికీ తెలిసిందే. ప్రీమియం గురించి ఆలోచిస్తారు చాలామంది. ప్రీమ‌యం త‌గ్గించుకునేందుకు క‌వ‌రేజ్ విష‌యంలో రాజీప‌డుతుంటారు. స్మార్ట్ విధానాల‌ను అనుస‌రించ‌డం ద్వారా క‌వ‌రేజ్ విష‌యంలో రాజీప‌డ‌కుండా ప్రీమియంను త‌గ్గించుకోవ‌చ్చు. ఇందుకోసం ఇంక్రీజింగ్ ట‌ర్మ్‌పాల‌సీ స‌రైనది. క‌రీర్ ప్రారంభంలో ఉన్న‌వారు ఈ ర‌కం ట‌ర్మ్‌పాల‌సీ ద్వారా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొంద‌చ్చు.

సాధార‌ణంగా, చాలామంది త‌మ‌ ఇర‌వైల‌లో ఉద్యోగం సంపాదించి, కెరియ‌ర్‌ను ప్రారంభిస్తారు. ఈ వ‌య‌సులో భాద్య‌త‌లు త‌క్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి జీవిత బీమా అవ‌స‌రం కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. ‌ఈ స్టేజ్‌లో రూ.50 ల‌క్ష‌ల నుంచి రూ.1కోటి హామీ మొత్తంతో జీవిత బీమా పాల‌సీ తీసుకుంటే మంచిది. త‌ల్లిదండ్రులు ఉద్యోగం చేస్తుంటే, రూ.25 ల‌క్ష‌ల హామీ కూడా స‌రిపోతుంది. ఇది వారు తీసుకున్న‌ విద్యా, వాహ‌నం వంటి రుణాల‌ను క‌వ‌ర్ చేసే విధంగా ఉంటే స‌రిపోతుంది.

వ‌య‌సు పెరుగుతున్న కొద్ది సంపాద‌న పెరుగుంది. అందుకు అనుగుణంగానే భాద్య‌తలు, ఆర్ధిక ల‌క్ష్యాలతో పాటు జీవ‌న‌శైలి ఖ‌ర్చులు కూడా పెరుగుతాయి. సంపాద‌న పెరిగితే, ఎక్కువ ఆదా చేసేందుకు వీలుంటుంద‌ని చాలామంది న‌మ్మ‌కం. అయితే సంపాద‌న పెరిగే కొద్ది జీవ‌న శైలిలో చోటుచేసుకునే మార్పుల కార‌ణంగా ఖ‌ర్చులు కూడా పెరుగుతుంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అందువ‌ల్ల ఏదైనా అనుకోని సంఘ‌ట‌న జ‌రిగితే కుంటుంబాన్ని ఆర్థికంగా ర‌క్షించేందుకు పెద్ద మొత్తంలో క‌వ‌రేజ్ అవ‌స‌రం అవుతుంది. 

దీనికి త‌గిన‌ట్లుగా, రెండవ ట‌ర్మ్ ప్లాన్ కొనుగోలు చేయ‌డం మంచిద‌ని సూచిస్తుంటారు. అయితే దీనికి మ‌రో మార్గం కూడా ఉంద‌ని వ్యక్తిగత ఫైనాన్స్ కోచ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ పరితోష్ శర్మ వివ‌రిస్తున్నారు. ఇందుకోసం హామీ మొత్తంలో పెరుగుద‌ల ఉండే ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీని ఎంచుకోవ‌చ్చు. 

 ఇంక్రీజింగ్ ట‌ర్మ్‌ ఇన్సూరెన్స్ పాలసీ అంటే..

ఈ ప్లాన్‌లో, పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం, ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ముందుగానే నిర్ణ‌యించిన విధంగా,  హామీ మొత్తం ప్ర‌తీ సంవ‌త్స‌రం పెరుగుతుంటుంది. 10శాతం ఇంక్రీజింగ్ ట‌ర్మ్ పాల‌సీని ఎంచుకుంటే, ప్ర‌తీ సంవ‌త్స‌రం పాల‌సీదారుని బీమా హామీ మొత్తం 10 శాతం చొప్పున పెరుగుతూ ఉంటుంది.  ప్రీమియం కూడా కొద్దిగా పెరిగే అవ‌కాశం ఉంది. ఎక్కువ ప్రీమియం చెల్లించే కంటే, ఆదాయం పెరిగిన‌ప్పుడు మ‌రో ట‌ర్మ్ ప్లాన్ తీసుకోవ‌డం మంచిది అనుకుంటారు చాలా మంది. ఒక ఉదాహ‌ర‌ణ‌తో అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిద్దాం. 

ఉదాహ‌ర‌ణ‌కి 30 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న వ్య‌క్తి 40 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో(అత‌ని 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు) రూ.1కోటికి ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే, వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.14,500 అనుకుందాం.  40 సంవ‌త్స‌రాల‌లో అత‌ను చెల్లించే ప్రీమియం రూ.5.8 ల‌క్ష‌లు. హామీ మొత్తం పెంచుకునేందుకు, 45 సంవ‌త్స‌రాల వ‌య‌సులో రూ.1కోటి హామీ మొత్తంతో రెండ‌వ ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే, అత‌ను చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం రూ.30 వేలు,  మ‌రో 25 సంవ‌త్స‌రాలు పాల‌సీ కొన‌సాగించాలి కాబ‌ట్టి, ఈ కాలానికి అత‌ను చెల్లించే ప్రీమియం  రూ.7.5 ల‌క్ష‌లు,  50 సంవ‌త్స‌రాల వ‌య‌సులో  రూ.50 ల‌క్ష‌ల హామీ మొత్తానికి మూడ‌వ పాల‌సీ తీసుకుంటే, చెల్లించ‌వ‌ల‌సిన వార్షిక ప్రీమియం రూ.24 వేలు. 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు మూడ‌వ ప్రీమియంకు రూ.4.8 ల‌క్ష‌లు చెల్లించాల్సి  వ‌స్తుంది. ఈ మూడు పాల‌సీల‌కు  చెల్లించే మొత్తం ప్రీమియం రూ.18.1 ల‌క్ష‌లు. 

ప్ర‌తీ సంవత్స‌రం క‌వ‌రేజ్ పెరిగే ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు చేసిన 30 సంవ‌త్స‌రాల వ్య‌క్తి, 40 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో(అత‌ని 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు) రూ.1కోటి హామీ మొత్తానికి చెల్లించ‌వల‌స‌ని వార్షిక ప్రీమియం దాదాపు రూ.20వేలు ఉంటుంది. అంటే 40 సంవ‌త్స‌రాల‌లో చెల్లించే మొత్తం ప్రీమియం రూ.8 ల‌క్ష‌లు మాత్ర‌మే. కానీ క‌వ‌రేజ్ స్థిరంగా పెరుగుతూ ఉంటుంది. 

సాధార‌ణ పాల‌సీతో పోలిస్తే, ప్రీమియం అధికంగా ఉన్న‌ప్ప‌టికీ, హామీ మొత్తం స్థిరంగా పెరుగుతుంది కాబ‌ట్టి ఈ ప్లాన్‌ను ఎంచుకోవ‌డం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని శ‌ర్మ తెలియ‌జేశారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని