Emergency Fund: అత్యవసర నిధిని ఎప్పుడు వినియోగించాలి?

అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఎందుకు ఖర్చు పెట్టాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

Published : 11 May 2022 16:49 IST

ఆర్థిక ప్రణాళికలో ముఖ్యంగా ఉండాల్సిన వాటిలో ఎమ‌ర్జెన్సీ ఫండ్ ఒక‌టి. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకుంటాం. అయితే అత్యవసర పరిస్థితులు అంటే ఏమిటి? ఎలాంటి ఖర్చులకు అత్యవసర నిధిని ఉపయోగించాలి, వినియోగించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపాది కోల్పోయినప్పుడు..
ఉద్యోగం లేదా ఉపాది కోల్పోవడం.. అనేది అతిపెద్ద ఆర్థిక అత్యవసర పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోల్పోయినప్పుడు నెలవారిగా వచ్చే ఆదాయం ఆగిపోతుంది కాబట్టి ఇంటి ఖర్చులు, ఆహారం మొదలైన జీవన వ్యయాలు భారం అవుతాయి.  కోవిడ్ సమయంలో చాలామంది ఉపాది కోల్పోయారు. కొందరికి పనిగంటలు తగ్గడం వల్ల ఆదాయంలో భారీ కోత ఏర్పడింది. ఇటువంటి అత్యవసర పరిస్థితులలో కుటుంబ పోక్షణకు ఇబ్బంది కలుగుకుండా అత్యవసర నిధిని ఉపయోగించుకోవచ్చు. 

వైద్య బిల్లులు..
ఒక వ్య‌క్తి ఆర్థికంగా ఒత్తిడికి లోనవ్వడానికి ప్రధాన కారణం వైద్య ఖర్చులు. తగినంత ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ బీమా నిబంధనలతో కవర్ కాని ఖర్చులు, సహా చెల్లింపులు వంటి షరతులతో ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది. అటువంటి  సమయంలో అత్యవసర నిధిని ఆశ్రయించడం అర్థవంతంగా ఉంటుంది. 

ముఖ్యమైన రిపేర్లు..
ఉద్యోగ రీత్యా కొందరు సొంత వాహనాలలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అనుకోకుండా వాహనం చెడిపోతే రిపేర్లకు ఖర్చులు అవుతాయి. చిన్న చిన్న రిపేర్లు అయితే పర్వాలేదు. కానీ ఒక్కోసారి వాహనం విడిభాగాన్ని మార్చాల్సి రావచ్చు. అటువంటి సందర్భంలో పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. అప్పుడు క్రెడిట్ కార్డు వంటి వాటిని ఉపయోగించవచ్చు. కానీ గడువు లోపు బిల్లు చెల్లించకపోతే వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఇలా అధిక వడ్డీ చెల్లించే కంటే అత్యవసర నిధిని ఉపయోగించుకోవచ్చు. 

అనవసర ఖర్చులు చేయకండి..
అత్యవసర నిధిని ఒత్తిడి తగ్గించుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ సమయంలో అనవసర ఖర్చుల జోలికి అస్సలు పోకూడదు. అత్యవసర నిధిని నెలవారి ఖర్చుల కోసం ఉపయోగించే వారు..  ప్రతీ నెల ఖర్చు చేసేదే అయినా వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకుని ఆదా చేసేందుకు ప్రయత్నించాలి. అవసరాలు, కోరికలు, విలాసాలకు మధ్య తేడా తెలుసుకోవాలి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఇది మీకు నిజంగా అవసరమా అనే ప్రశ్న మీకు మీరే వేసుకోండి. అప్పుడు మీకే సమాధానం దొరుకుతుంది. 

పునఃనిర్మించండి..
కష్ట సమయంలో ఆర్థిక ఒత్తిడిని అధిగమించడానికే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేది. అవసరమైనప్పుడు ఉపయోగించికుని పరిస్థితులు చక్కదిద్దుకున్నాక పునః నిర్మించుకోవాలి. అయితే ఉపయోగించిన నిధి మొత్తాన్ని ఒకేసారి భర్తీ చేయలేకపోవచ్చు. కాబట్టి చిన్నగా ప్రారంభించండి. ప్రతీ నెల కొంత మొత్తాన్నయినా అత్యవసర నిధికి కేటాయించండి. బోనస్లు, తదితరాల రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బు చేతికందినప్పుడు కొంత భాగాన్ని అత్యవసర నిధికి మళ్లించండి. మీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉన్న తర్వాత ఎక్కువ మొత్తాన్ని కేటాయించి, మునుపటి స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి.

చివరిగా..
అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఎందుకు ఖర్చు పెట్టాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ముందుగానే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నవారు కోవిడ్ - 19 క్లిష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొగలిగారు.  ప్రస్తుతం ఈ పరిస్థితుల నుంచి క్రమంగా సాధారణ జీవితానికి వస్తున్నాం. కాబ‌ట్టి మీ ఎమ‌ర్జెన్సీ ఫండ్‌ను పునఃనిర్మించండి. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌వ‌స‌ర‌నిధి ఏర్పాటు చేయ‌ని వారు ఇప్పుడైనా ఏర్పాటు చేసుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని