Zomato CEO: పోటీ కారణంగానే డిస్కౌంట్లు అలా చూపిస్తున్నాం..!: జొమాటో సీఈఓ

Zomato CEO: జొమాటో అందించే డిస్కౌంట్లపై ఆ సంస్థ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ మాట్లాడారు. తమ ఆఫర్ల వర్తింపులో వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

Published : 04 Nov 2023 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో (Zomato) ఎప్పుడు ఓపెన్‌ చేసినా ఏదో ఒక ఆఫర్‌ కనిపిస్తూ ఉంటుంది. 20-50 శాతం డిస్కౌంట్ అనే ఆఫర్లు అందులో ఊరిస్తుంటాయి. తీరా బుక్‌ చేశాక డిస్కౌంట్‌ రూపంలో వచ్చేది తక్కువేనని యూజర్లకు అర్థమవుతుంది. ఇలా జొమాటో ఇచ్చే ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. యాప్‌లో పేర్కొనే ఆఫర్లలో నిజం లేదని కొందరు ఆన్‌లైన్‌లో వ్యాఖ్యానిస్తుంటారు. ఈ విషయం తాజాగా జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal) స్పందించారు. జొమాటోలో అందిస్తున్న ఆఫర్ల వర్తింపులో వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

యూట్యూబర్‌ రణ్‌వీర్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దీపిందర్‌ గోయల్‌ జొమాటో డిస్కౌంట్ల గురించి మాట్లాడారు. ‘జొమాటో ఇచ్చే డిస్కౌంట్లు అంత పెద్దవి కావు. అలా కనిపిస్తాయి అంతే. 50 శాతం తగ్గింపు అని ఉంటుంది. అది వాస్తవం కాదు. ఉదాహరణకు రూ.400కి ఆర్డర్‌ పెడితే. అందులో 50 శాతం ఆఫర్‌ అని చూపిస్తుంది. రూ.80 మాత్రమే తగ్గుతుంది. అంటే 20 శాతం మాత్రమే డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు. అందుకే ఈ తగ్గింపులో నిజాయతీ ఉందని నేను చెప్పను’ అని ఆయన అన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ దీపావళి ఆఫర్‌.. ఈ ప్లాన్లపై అదనపు డేటా

ఇలాంటి డిస్కౌంట్లు చూపించటం కస్టమర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందని దీపిందర్‌ అన్నారు. ఈ విధానాన్ని మార్చాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే పోటీ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ తరహా డిస్కౌంట్లు చూపించాల్సి వస్తోందని చెప్పారు. మరోవైపు జొమాటోకు పోటీగా ఉన్న స్విగ్గీ (Swiggy) సహ వ్యవస్థాపకుడు శ్రీహర్షతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు. వ్యాపారంలో తాము ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ తమ మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందన్నారు. తాము ఎక్కడ కలిసినా వ్యాపారం గురించి మాట్లాడుకోమని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని