Zomato: జొమాటోకు రూ.401 కోట్ల జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసు.. కంపెనీ స్పందనిదే..!

Zomato: డెలివరీ ఛార్జీపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ జొమాటోకు డీజీజీఐ నోటీసులు పంపింది.

Published : 28 Dec 2023 11:35 IST

Zomato | దిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato)కు ‘డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ (DGGI)’ జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. రూ.401 కోట్లు బకాయి పడినట్లు ఆ నోటీసులో పేర్కొంది. డెలివరీ అనేది సేవ కాబట్టి 18 శాతం జీఎస్‌టీ కట్టాలని డీజీజీఐ స్పష్టం చేసింది.

షోకాజ్ నోటీసుపై జొమాటో (Zomato) స్పందించింది. తమవైపు నుంచి ఎలాంటి పన్ను బకాయిలూ లేవని తెలిపింది. డెలివరీ భాగస్వాముల తరఫున తాము డెలివరీ ఛార్జీలు వసూలు చేశామని పేర్కొంది. అలాగే కస్టమర్లకు తాము నేరుగా డెలివరీ సేవలు అందించలేదని, పరస్పర ఆమోదంతో కుదుర్చుకున్న నియమ నిబంధనల ప్రకారం.. డెలివరీ భాగస్వాములే ఆ సేవలను అందించారని వివరించింది.

జొమాటో (Zomato)లో కస్టమర్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసినప్పుడు బిల్లులో మూడు అంశాలు ఉంటాయి. అందులో ఆహార పదార్థాల ధర ఒకటి. మరొకటి ఫుడ్‌ డెలివరీ ఛార్జీ. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. మూడోది ఆహారం ధర, ప్లాట్‌ఫామ్‌ ఫీజుపై ఐదు శాతం పన్ను. ఈ ట్యాక్స్‌ను జీఎస్‌టీ మండలి 2022 జనవరి నుంచి అమలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని