రాగిణి జైలుకు.. సంజన సీసీబీ కస్టడీకి!

శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం ఆరోపణలపై అరెస్టయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టులో .............

Published : 15 Sep 2020 01:04 IST

బెంగళూరు: శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం ఆరోపణలపై అరెస్టయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టులో షాక్‌ తగిలింది. ఈ కేసులో కస్టడీ నేటితో ముగియడంతో బెంగళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులు వారిని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. విచారించిన న్యాయస్థానం రాగిణికి జ్యుడిషియల్‌ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించింది. అలాగే, మరో నటి సంజనా గల్రానీని మరో మూడు రోజుల పాటు సీసీబీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. తన ఆరోగ్యం బాగోలేదని, ప్రైవేటు ఆస్పత్రిలో చేరేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాగిణి చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. పరప్పన అగ్రహారం జైలు లోపల ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని సూచించింది.

అలాగే, ఈ కేసులో అరెస్టయిన రవిశంకర్‌, వీరెన్‌ ఖన్నాలను ఇంకా విచారించాల్సి ఉన్నందున మరో మూడు రోజుల పాటు సీసీబీ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే రాగిణిని 12 రోజులు, సంజనను ఏడు రోజుల పాటు సీసీబీ అధికారులు విచారించారు. అయితే, సంజనను మరో ఐదు రోజుల పాటు విచారణకు ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం మూడు రోజుల విచారణకు అనుమతిచ్చింది. ఆమె ఫోన్‌లో ఉన్న డేటా ఆధారంగా విచారించన్నట్టు తెలుస్తోంది. కోర్టు తాజా ఆదేశాలతో రాగిణి ఈ నెల 28 వరకు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని